శ్రీశైలం / నంద్యాల జిల్లా, ఫిబ్రవరి 14 :-
మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి దేవస్థానం వద్దకు భారీగా తరలివస్తున్న భక్తులకు సరైన వసతి సదుపాయాలు కల్పించేందుకు జిల్లా కలెక్టర్ జి. రాజకుమారి, జాయింట్ కలెక్టర్ కొల్లా బత్తుల కార్తీక్ శనివారం పరిశీలించారు.
భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని దేవస్థానం ఆధ్వర్యంలో ఆన్లైన్, కౌంటర్ విధానాల ద్వారా గదుల కేటాయింపు పారదర్శకంగా జరుగుతోందా లేదా అన్న విషయంపై వారు సమీక్ష నిర్వహించారు. ముందస్తుగా బుక్ చేసుకున్న భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా గదులు అందుతున్నాయా, ప్రత్యేక కౌంటర్లు సక్రమంగా పనిచేస్తున్నాయా అనే అంశాలను పరిశీలించారు. ఉచిత, చెల్లింపు వసతి గృహాలు, చౌల్ట్రిలు, డార్మిటరీల వద్ద పరిశుభ్రత, తాగునీటి సదుపాయం, విద్యుత్ సరఫరా, భద్రతా ఏర్పాట్లు తదితర అంశాలపై అధికారులకు స్పష్టమైన సూచనలు చేశారు. వృద్ధులు, మహిళలు, చిన్నపిల్లలతో వచ్చే కుటుంబాలకు ప్రాధాన్యత ఇవ్వాలని, గదుల కేటాయింపులో ఎలాంటి అవకతవకలు జరగకుండా పర్యవేక్షణ పెంచాలని ఆదేశించారు. భక్తులు మధ్యవర్తులను నమ్మకూడదని, అధికారిక కౌంటర్లు లేదా ఆన్లైన్ విధానాల ద్వారానే గదులు పొందాలని జిల్లా కలెక్టర్ సూచించారు. మహాశివరాత్రి సందర్భంగా లక్షలాది మంది భక్తులు రానున్న నేపథ్యంలో ప్రతి భక్తుడికి సౌకర్యవంతమైన వసతి కల్పించేందుకు అన్ని శాఖలు సమన్వయంతో పనిచేస్తున్నాయని అధికారులు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో దేవస్థానం, రెవెన్యూ శాఖల అధికారులు పాల్గొన్నారు.
