శీఘ్ర దర్శనం అయ్యేలా ఏర్పాట్లు-కలెక్టర్ డా.మనజీర్ జిలాని సామూన్

శ్రీశైలం, ఫిబ్రవరి 17:-భూమండలానికే నాభీ స్థానముగా భాసిల్లుతున్న మహా పుణ్యక్షేత్రమైన శ్రీశైల భ్రమరాంబికా మల్లికార్జున స్వామి వారి దేవాలయములో మహాశివరాత్రి పర్వదినాన హాజరవుతున్న భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా శీఘ్ర దర్శనం అయ్యేలా ఏర్పాట్లు చేశామని జిల్లా కలెక్టర్ డా.మనజీర్ జిలాని సామూన్ తెలిపారు.శుక్రవారం జిల్లా ఎస్పి రఘువీర్ రెడ్డి, జాయింట్ కలెక్టర్ టి. నిశాంతిలతో కలిసి నంది సర్కిల్, శివాజీ గోపురం,కైలాస ద్వారం, సాక్షి గణపతి, పాతాళగంగ తదితర ప్రదేశాలలో భక్తుల సౌకర్యార్థం చేపట్టిన ఏర్పాట్లపై సంబంధిత నోడల్ అధికారులతో వివరాలు అడిగి తెలుసుకున్నారు.

నోడల్ అధికారులకు గత సమావేశంలో ఆదేశించిన ప్రకారం భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారని కలెక్టర్ తెలిపారు. త్రాగునీరు, పారిశుధ్యం, వైద్య శిబిరాలు, పాదయాత్ర భక్తులకు చేసిన ఏర్పాట్లు తదితర అంశాలపై ఆరా తీశారు. తొలుత నంది సర్కిల్ లోని బ్లడ్ బ్యాంక్, వైద్య శిబిరాన్ని పరిశీలించి రోగులకు పరీక్షలు నిర్వహించి మందులు ఇస్తున్నారా…లేదా తదితర అంశాలపై వైద్యులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. శివాజీ గోపురం సమీపంలోని ప్రదేశాల్లో త్రాగునీటి వసతి, పారిశుధ్య పనులను పరిశీలించారు. అనంతరం కైలాస ద్వారం దగ్గర కాలినడక వస్తున్న భక్తులతో కలెక్టర్ ముచ్చటించారు.
భక్తులతో పాటు కలెక్టర్ కూడ నడుస్తూ కాలినడకన ఎక్కడి నుండి వస్తున్నారు… సౌకర్యాలు ఎలా వున్నాయి… తదితర వివరాలు అడిగి తెలుసుకున్నారు. పాతాళగంగ ప్రాతంలో ఏర్పాటు చేసిన జల్లు స్నానాలు, డ్రెస్సింగ్ రూంలు, మరమ్మత్తులు చేసిన శాశ్వత మరుగు దొడ్లు, తాత్కాలికంగా ఏర్పాటు చేసిన మరుగుదొడ్లను కలెక్టర్ పరిశీలించారు.

జిల్లా కలెక్టర్  వెంట అడిషనల్ ఎస్పీ రమణ, శ్రీశైల దేవస్థాన కార్యనిర్వహణాధికారి లవన్న, ఆర్డీవో ఎం దాసు, సంబంధిత నోడల్ అధికారులు వున్నారు.

print

Post Comment

You May Have Missed