
శ్రీశైలం/నంద్యాల, ఫిబ్రవరి 09:-శ్రీశైల మహాపుణ్యక్షేత్రంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలలో సామాన్య భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా చేస్తున్న విస్తృత ఏర్పాట్లలో లోటుపాట్లు లేకుండా అన్నిరకాల ముందస్తు జాగ్రత్త చర్యలు పకద్బందీగా చేపట్టాలని జిల్లా కలెక్టర్ డా. కె.శ్రీనివాసులు సంబంధిత అధికారులను ఆదేశించారు. శుక్రవారం అన్నపూర్ణ భవనం ప్రక్కన సీసీ కంట్రోల్ రూమ్ లో జిల్లా ఎస్పీ రఘువీర్‌రెడ్డి, దేవస్థానం ధర్మకర్తల మండలి అధ్యక్షులు రెడ్డివారిచక్రపాణిరెడ్డి, దేవస్థానం కార్యనిర్వహణాధికారి డి.పెద్దిరాజుతో కలిసి మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల ఏర్పాట్లపై సమీక్షించారు.
*ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ డా. కలెక్టర్- డా. కె.శ్రీనివాసులు మాట్లాడుతూ మార్చి 1 నుండి 11 వరకు 11 రోజులపాటు నిర్వహించే మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలలో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా తేలికగా మల్లన్న దర్శించుకుని సురక్షితంగా ఇంటికి చేరుకునే వరకు బాధ్యతాయుతంగా అధికారులకు అప్పగించిన పనులను నిర్వహించాలి . ప్రధానంగా క్యూలైన్లు, త్రాగునీటి సదుపాయం, ట్రాఫిక్, వాహనాల పార్కింగ్, నిరంతర విద్యుత్ సరఫరా, పారిశుద్ధ్యం తదితర అంశాలపై అప్పగించిన విధులపై ప్రత్యేక శ్రద్ధ పెట్టి నిర్వర్తించాలని సంబంధిత శాఖల అధికారులను కలెక్టర్ ఆదేశించారు. రద్ధీ ప్రాంతాలలో ఉచిత వైద్యశిబిరాలతో పాటు వైద్యనిపుణులు, అవసరమైన మందులను సిద్ధంగా ఉంచుకోవాలని డీఎంఅండ్‌హెచ్‌ఓను ఆదేశించారు. దోమలను అరికట్టేందుకు ఫాగింగ్ మెటిరీయల్ సిద్ధంగా ఉండాలని మలేరియా అధికారిని ఆదేశించారు. శ్రీశైలంలోని పిహెచ్సి, దేవస్థానం ఆసుపత్రి, సున్నిపెంటలోని వైద్యశాల, శ్రీశైలంలో ఏర్పాటు చేసే తాత్కాలిక 30 పడకల ఆసుపత్రి 24 గంటలపాటు నిర్వహించేలా వైద్యసిబ్బందిని కేటాయించాలని డి.ఎం. అండ్ హెచ్.ఓను ఆదేశించారు. ముఖ్య ప్రదేశాలలో రెండు షిఫ్టులలో వైద్యులు విధులు నిర్వహించేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఏడు 108 అంబులెన్సులు, పాదయాత్రమార్గములో ఒక అంబులెన్సును ఏర్పాటు చేయాలని సూచించారు. బ్రాహ్మణకొట్కూరు నుండి శ్రీశైలం వరకు గతంలో సూచించిన విధంగా 31 ప్రదేశాలలో తాత్కాలిక వైద్యశిబిరాలను ఏర్పాటు చేయాలని కలెక్టర్ ఆదేశించారు. పాతాళగంగ, లింగాలగట్టు ప్రాంతాలలో పుణ్యస్నానాలాచరించేందుకు అనుమతిస్తున్నామని, ఇందుకు ప్రతిపాదించిన గజ ఈతనిపుణులు, అవసరమైన లైఫ్ జాకెట్లు, పుట్టీలు, తాత్కాలిక టాయిలెట్లు, డ్రస్సింగ్ గదులు ఏర్పాటు చేసుకునేలా చర్యలు తీసుకోవాలని మత్స్యశాఖ అధకారులను, దేవస్థానం పారిశుద్ధ్య విభాగపు సహాయ కార్యనిర్వహణాధికారులను కలెక్టర్ ఆదేశించారు.
శివదీక్షా భక్తులు ఇబ్బందులు ఎదుర్కొకుండా సమగ్ర ప్రణాళికలు రూపొందించాలని, కార్యనిర్వహణాధికారిని సూచించారు.*
*రవాణా సౌకర్యాల నిమిత్తం ఆంధ్ర ప్రాంతం నుండి 500 బస్సులు, తెలంగాణా నుండి 450 బస్సులు, కర్ణాటక రాష్ట్రం నుంచి 170 బస్సులు కండిషన్లో ఉన్న బస్సులు ఏర్పాటు చేస్తున్నట్లు సంబంధిత రీజినల్ మేనేజర్లు కలెక్టర్‌కు వివరించారు. మార్గమధ్యములోని ముఖ్య కూడళ్ళలో క్రేన్లు, అవసరమైన మెకానిక్‌లను ఏర్పాటు చేయాలని సంబంధిత ఆర్టీసీ ఆర్.ఎం.లను ఆదేశించారు. వీఐపీలు, వీవీఐపీలు, విధులు నిర్వహిస్తున్న అధికారులు, సిబ్బందికి వసతి ఏర్పాట్లలో ఎలాంటి సమస్యలు రాకుండా దేవస్థాన గదులు మరియు ప్రవైటు సత్రాలలోని 35 శాతం గదులను స్వాధీనం చేసుకోవాలని ఆత్మకూరు ఆర్డిఓను ఆదేశించారు. మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలకు లక్షలాది మంది భక్తులు క్షేత్రానికి చేరుకుంటారని, ఎక్కడ పారిశుద్ధ్యలోపం లేకుండా అవసరమైన పారిశుద్ధ్య సిబ్బందిని కేటాయించుకుని దేవస్థాన శానిటేషన్ సిబ్బందితో సమన్వయం చేసుకుని పారిశుద్ధ్యలోపం లేకుండా పకడ్బందీ చర్యలు తీసుకోవాలని డిపిఓను, జిల్లా పరిషత్ సీఈఓను కలెక్టర్ ఆదేశించారు. అన్నదానశిబిరాలు, రద్ధీ కూడలి ప్రాంతాలలో అధిక పారిశుద్ధ్య సిబ్బందిని నియమించి ఎప్పటికప్పుడు పరిశుభ్రం చేసేలా చర్యలు తీసుకోవాలని డీపీఓను ఆదేశించారు. ఆత్మకూరు నుండి దోర్నాల వరకు రోడ్డు ప్యాచింగ్ మరమ్మతులు, రేడియం స్టిక్కర్లు, రోడ్డుకిరువైపులా మట్టితో చదును చేసే పనులు వెంటనే ప్రారంభించాలని ఆర్అండ్బి ఈఈని కలెక్టర్ ఆదేశించారు.
మార్చి 1 నుండి 11వ తేదీ వరకు అత్యధిక సంఖ్యలో భక్తులు క్షేత్రానికి వచ్చే అవకాశం ఉన్నందున అదనపు సౌకర్యాలు కల్పించడంతో పాటు సిబ్బంది మొత్తం అప్రమత్తంగా వుండి, భక్తులకు సేవలు అందించే కార్యక్రమంలో నిమగ్నం కావాలన్నారు.*
కార్యనిర్వహణాధికారి డి. పెద్దిరాజు మాట్లాడుతూ భక్తులకు సులభంగా స్వామివారి దర్శనం అయ్యేలా నాలుగు రకాల క్యూలైన్లను ఏర్పాటు చేశామని కలెక్టర్‌కు వివరించారు. ఈ ఏడాది బ్రహ్మోత్సవాలలో 20 శాతం అదనంగా భక్తులు వచ్చే అవకాశం ఉందని, అందుకు తగ్గ ఏర్పాట్లు కూడా చేస్తున్నట్లు వివరించారు. మహాశివరాత్రి పర్వదినం రోజు 1.10 లక్షల మంది స్వామివార్లను దర్శించుకునే అవకాశం ఉన్నందున, అందుకు తగ్గ ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు. దేవస్థానం ధర్మకర్తల మండలి అధ్యక్షులు రెడ్డివారిచక్రపాణిరెడ్డి మాట్లాడుతూ భక్తులకు అందించే స్వామిఅమ్మవార్ల లడ్డూ ప్రసాదాలను 35 లక్షల వరకు తయారు చేస్తున్నామన్నారు. మార్చి 8వతేదీ మహాశివరాత్రిపర్వదినాన్ని పురస్కరించుకుని సాయంకాలం ప్రభోత్సవం అనంతరం రాత్రి 10 గంటల నుండి పాగాలంకరణ, లింగోద్భవ కాల మహాన్యాస రుద్రదాభిషేకం, అర్థరాత్రి 12 గంటలకు కల్యాణోత్సవం తదితర వైదిక కార్యక్రమాలన్నీ సంప్రదాయబద్దంగా నిర్వహిస్తామన్నారు. మరుసటి రోజు రథోత్సవం, తెప్పోత్సవం ఉంటాయని కలెక్టర్‌కు వివరించారు. ప్రధానంగా త్రాగునీటికి ఇబ్బంది లేకుండా గుర్తించిన ప్రదేశాలలో ట్యాంకర్లు, నీటికొళాయిలు ఏర్పాటుకు దేవస్థానం ఈఈ వి. రామకృష్ణతో సమన్వయం చేసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. 11 రోజులపాటు జరిగే బ్రహ్మోత్సవాలకు దాదాపు 10 లక్షల మందికి పైగా భక్తుల వచ్చే అవకాశం ఉన్నందున మోబైల్ నెట్ వర్క్ సరిపోయే విధంగా ఏపి ఫైబర్ నెట్ వారితో సమన్వయం చేసుకొని, ఆ మేరకు చర్యలు తీసుకోవాలని బీఎస్ఎన్ఎల్ అధికారులను ఆదేశించారు. కల్తీ ఆహారపదార్థాలు నియంత్రించేందుకు లేబరు కమిషనర్, లీగల్ మెట్రాలజీ, ఫుడ్ ఇన్స్పెక్టర్లను టీమ్‌గా ఏర్పాటు చేయాలన్నారు. విద్యుత్ అంతరాయం లేకుండా అన్ని జోన్లకు నిరంతరాయ విద్యుత్ ఏర్పాటు చేయాలని ఏపిఎస్పీడీసీఎల్ అధికారులను ఆదేశించారు.
జిల్లా ఎస్పి కె. రఘువీర్‌రెడ్డి మాట్లాడుతూ దోర్నాల నుంచి ట్రాఫిక్ అంతరాయం లేకుండా మార్గమద్యంలో కమ్యూనికేషన్ గ్యాప్ లేకుండా సిస్టమును డెవలప్ చేసుకోవాలన్నారు. శ్రీశైలం ముఖద్వారం – సాక్షిగణపతి ప్రదేశాలలో వాహనాలు నిలపకుండా చర్యలు చేపట్టాలని దేవస్థానం, అటవీశాఖ అధికారులకు సూచించారు. సాక్షిగణపతి ప్రదేశంలో రోడ్డుకిరువైపులా తాత్కలికంగా గ్రావెల్ వేసి విస్తరణ పనులు చేపట్టాలని ఆదేశించారు. క్యూలైన్లలో భక్తులు తొక్కిసలాటలు లేకుండా అవసరమయ్యే మంచినీరు, చంటిపిల్లలకు పాలు సరఫరా చేసేలా చర్యలు తీసుకోవాలని కార్యనిర్వహణాధికారిని సూచించారు. భారీ వాహనాలను అటవీమార్గంలో అనుమతించకుండా డైవర్ట్ చేసే విధంగా ప్రకాశం, నాగర్ కర్నూలు, కర్నూలు జిల్లాలలో విస్తృత ప్రచారం చేయాలని ట్రాన్స్‌ఫోర్ట్, సంబంధిత ట్రాఫిక్ డిస్పీలను ఆదేశించారు. గతంలో మాదిరిగానే ఏర్పాటు చేసిన 75 సీసీ కెమెరాలతో పాటు అదనంగా అవసరమైన ప్రాంతాలలో సీసీ కెమెరాలతో కవరేజ్ చేయడంతో పాటు డ్రోన్ కెమెరాలతో కూడా ఉత్సవాల ఏర్పాట్లను పరిశీలిస్తూ తగు చర్యలు తీసుకుంటామని కలెక్టర్‌కు వివరించారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా శాంతిభద్రతల పరిరక్షణకు పటిష్ట పోలీస్ బందోబస్తును ఏర్పాటు చేస్తున్నట్లు వివరించారు. పార్కింగ్ ప్రదేశాలలో దాదాపు 5వేల వాహనాలను నిలుపుదల చేసేందుకు అవకాశం ఉందన్నారు. కమాండ్ కంట్రోల్ రూమ్ నుండి తాను, కలెక్టర్ నిరంతరం పర్యవేక్షిస్తూ తగు చర్యలు తీసుకుంటామన్నారు. పోలీస్ యంత్రాంగానికి అన్నిశాఖల అధికారులు సహకరించాలని ఆయన కోరారు. పాగాలంకరణ ముగిసిన వెంటనే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా రవాణా సౌకర్యం కల్పిస్తామని ఆయన తెలిపారు.
అనంతరం కలెక్టర్ సంబంధిత అధికారులతో టోల్గేట్, వలయ రహదారి ( రింగురోడ్డు) యజ్ఞవాటిక పార్కింగు ప్రదేశం, మల్లమ్మ కన్నీరు ప్రాంతం. జిల్లాపరిషత్ ఉన్నత పాఠశాల ప్రక్కన గల పార్కింగు ప్రదేశం, ఆర్టీసీ బస్టాండు ప్రాంతం మొదలైన ప్రదేశాలను పరిశీలించారు. అన్ని పార్కింగు ప్రదేశాలలో కూడా అవసరమైన సదుపాయాలు ఉండాలన్నారు. ఈ సమావేశంలో మార్కాపురం సబ్ కలెక్టర్ రాహుల్ మీనా, డి.ఆర్.ఓ పద్మజ, ఆత్మకూరు ఆర్డిఓ మిరియాల దాసు, అన్నిశాఖల జిల్లా అధికారులు, మార్కాపురం, దోర్నాల, తెలంగాణా, కర్ణాటక ప్రాంతాల సంబంధిత అధికారులు పాల్గొన్నారు.