
కర్నూలు /శ్రీశైలం, మార్చి 2:-మహిమాన్వితమైన శ్రీశైల మహాక్షేత్రంలో మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని అనూహ్యరీతిలో శ్రీశైలం వచ్చిన భక్తులకు ఏర్పాటు చేసిన సౌకర్యాలలో ఎలాంటి లోపాలు లేకుండా అన్ని జాగ్రత్తలు తీసుకొని విజయవంతం చేసిన అధికారులను జిల్లా కలెక్టర్ పి. కోటేశ్వరరావు అభినందించారు. బుధవారం భ్రమరాంబ సదన్ కాన్ఫరెన్స్ హాళ్ళో జిల్లా ఎస్పీ సుధీర్ కుమార్ రెడ్డి తో కలిసి మహాశివరాత్రి వేడుకలను విజయవంతం చేసిన జోనల్ అధికారులు, వారి ఆధ్వర్యంలో పని చేసిన సిబ్బంది, అధికారులకు అభినందనలు, కృతజ్ఞతలు తెలిపారు.
మహాశివరాత్రి పర్వదినాన శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామివార్లను దర్శించుకునేందుకు వచ్చిన అశేష భక్త జనావళికి ప్రశాంత వాతావరణంలో దర్శనం చేసుకునే అవకాశం కల్పించామన్నారు. గత వారం రోజుల నుండి చేస్తున్న పనులలో ఇంకా మెరుగ్గా ఇలా చేసుంటే బావుండేది అన్న అభిప్రాయాల పై వారం రోజుల తరువాత నివేదిక ఇవ్వాలన్నారు. ఈ అనుభవాలను పరిగణలోకి తీసుకొని వచ్చే సంవత్సరం ఎలాంటి లోపాలు, పొరపాట్లు దొర్లకుండా జాగ్రత్తలు తీసుకునే అవకాశం ఉంటుందన్నారు. భక్తులు అధిక సంఖ్యలో వచ్చినప్పటికీ పారిశుద్ధ్యం, త్రాగునీరు, టాయిలెట్లు, పార్కింగ్, వైద్యశిబిరాలు తదితర ఏర్పాట్లలో ఎలాంటి లోపాలు లేకుండా విధులు నిర్వహించారన్నారు.
జాయింట్ కలెక్టర్ (ఆసరా , సంక్షేమం) ఎం కె వి శ్రీనివాసులు, డిఆర్డిఎ పి.డి. వెంకటేసులు, డ్వామా పి.డి. అమర్నాథరెడ్డి, డిపిఓ నాగార్జుననాయుడు, సివిల్ సప్లైస్ డియం షర్మిల తదితరులు పాల్గొన్నారు.