రైతుల సమగ్ర సమాచారంతో పాటు క్షేత్ర స్థాయి లో అధికారులు రైతులకు అందుబాటు లో ఉండాలని రాష్ట్ర వ్యవసాయ, అనుబంధ శాఖల మంత్రి పోచారం శ్రీనివాస్ రెడ్డి జిల్లా వ్యవసాయ అధికారులను ఆదేశించారు.
గురువారం హైదరాబాద్ రెడ్ హిల్స్ ఫ్యాప్సి భవనం లో రంగారెడ్డి, వికారాబాద్, మేడ్చల్ జిల్లాల జోనల్ స్థాయి అవగాహన, సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా మంత్రి మాట్లాడుతూ జిల్లాలలో పని చేసే అధికారులు, సిబ్బంది తప్పనిసరిగా స్థానికంగా ఉండి విధులు నిర్వహించాలన్నారు. రంగారెడ్డి జిల్లా లో వ్యవసాయ శాఖ, సహకార సంఘ అధికారులు, సిబ్బంది దాదాపు 350 మంది ఉన్నట్లు మంత్రి తెలిపారు. ప్రతి గ్రామం లో రైతుల పూర్తి స్థాయి వివరాలను సేకరించాలని ఈ వివరాలను ఆన్ లైన్ వెబ్ పోర్టల్ లో పొందు పరచాలని తెలిపారు. త్వరలో 24 మార్కెట్ యార్డ్ ఆవరణ లో భూ సార పరీక్షా ల్యాబ్ లు ఏర్పాటు చేసిన తరవాత పట్టాదార్ ప్రకారం భూ సార పరీక్ష చేయాలనీ తెలిపారు. రంగారెడ్డి జిల్లాలో నూరు శాతం భూ సార పరీక్షలు శాస్త్రీయ పద్దతి లో పూర్తి చేయాలనీ మంత్రి ఆదేశించారు. రైతులు ముఖ్యంగా ప్రకృతి వైపరీత్యాల ద్వారా అధికంగా నష్ట పోకుండా వ్యవసాయ అధికారులు పంట ప్రణాళిక పై అవగాహనా కలిపించాలన్నారు. మార్చ్ 31, 2017 లోపు పూర్తి స్థాయి లో పంట కోత జరిగేలా అధికారులు చర్యలు చేపట్టాలన్నారు. పంట ప్రణాళిక ను రైతులకు సమాచారం ఇవ్వాలని, తద్వారా ప్రకృతి వైపరీత్యాల తో పంట నష్టం తగ్గించవచ్చు అని మంత్రి తెలిపారు. పంట రుణాలు తీసుకున్న ప్రతి రైతు పంట భీమా చేసేవిధంగా క్షేత్ర స్థాయి వ్యవసాయ అధికారులు దృష్టి పెట్టాలన్నారు. రైతుల పొలాలలో పురుగు గమనించిన అనంతరం వ్యవసాయ అధికారులు పరిశీలించి పురుగుమందుల సిఫార్సు పత్రం అధికారుల సంతకం ద్వారానే షాప్ ఓనర్ పురుగు మందులు ఇవ్వాలని జిల్లా అధికారులు డీలర్లకు, రైతులకు సమాచారం ఇవ్వాలని ఆదేశించారు. రైతులు విపణి లో గీటుబాటు ధర వచ్చేంతవరకు జిల్లా లో మార్కెటింగ్ శాఖ ద్వారా నూతనంగా నిర్మించిన గోదాములు పంట నిల్వ చేసేందుకు ఉపయోగించుకోవచ్చు అని మంత్రి సూచించారు. రైతులకు క్షేత్ర స్థాయి లో సాంకేతిక సమాచారం ఇచ్చేందుకు వ్యవసాయ సాంకేతిక సిబ్బంది రైతులకు అందుబాటు లో ఉండాలని ఆదేశించారు. రైతు భిందు పధకం ద్వారా పంట ఉత్పత్తులను నిల్వ చేసేందుకు ఆర్ధిక సహాయం చేసేందుకు ప్రభుత్వం నిర్ణయించిందన్నారు. జిల్లాలో విత్తనాలు, ఎరువుల కొరత రాకుండా అధికారులు దృష్టి పెట్టాలన్నారు. రైతులకు బ్యాంకు ద్వారా రుణాలు మంజూరు చేయించే బాధ్యత అధికారులు తీసుకోవాలన్నారు. ధాన్యం కొనుగోలు కేంద్రాలను పటిష్టం చేసేందుకు, రైతు అవసరాలను ఏక గవాక్ష విధానం ద్వారా అందించేందుకు సహకార సంఘాలు కృషి చేయాలన్నారు. గ్రామంలో రైతులకు విద్యుత్ అంతరాయం చోటుచేసుకునపుడు వ్యవసాయ అధికారులు చొరవ తీసుకొని సంబంధిత అధికారులకు సూచించాలని మంత్రి తెలిపారు.
రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పట్నం మహేందర్ రెడ్డి మాట్లాడుతూ రైతులకు వ్యవసాయ సూచనలు, సాంకేతిక సలహాలు అందించడం లో వ్యవసాయ శాఖ సిబ్బంది చురుకుగా పాల్గొనాలన్నారు. అధికారులు స్థానికంగా అందుబాటులో ఉండి రైతాంగానికి భరోసా కల్పించాలని మంత్రి తెలిపారు. ప్రకృతి వైపరీత్యాల ద్వారా జరిగిన పంట నష్టాన్ని అంచనా వేయడంలో అధికారులు బాధ్యత వహించాలన్నారు. ప్రభుత్వం అమలు చేసే వివిధ వ్యవసాయ పధకాల పై రైతులకు పూర్తి సమాచారం ఇవ్వడం లో అధికారులు కీలక పాత్ర వహించాలన్నారు.
పరిగి శాసన సభ్యులు టి. రామ్ మోహన్ రెడ్డి మాట్లాడుతూ పంట ప్రణాళిక ద్వారా రైతుల ఆత్మ హత్యలను నివారించవచ్చు అన్నారు. అధికారులు క్షేత్ర స్థాయి పరిశీలనల ద్వారా రైతుల సాంకేతిక ఇబందులు దూరం అవుతాయన్నారు. బ్యాంకర్లు, రైతుల మధ్య వ్యవసాయ అధికారులుసమన్మయం పాటించాలన్నారు. ఉద్యాన శాఖ ద్వారా రైతులకు చేయాల్సిన చెల్లింపులో ఆలస్యం అవుతుందని మంత్రి దృష్టికి తీసుకువచ్చారు.
షాద్ నగర్ శాసన సభ్యులు అంజయ్య యాదవ్ మాట్లాడుతూ జిల్లా లోని కొని ప్రాంతాలలో వర్ష పాతం తక్కువగా ఉందని వ్యవసాయ రంగం పై ఆధారిత రైతులకు ప్రత్యామ్నాయ పంటల సాగు చేసేందుకు అవగాహనా పరచాలని తెలిపారు. ప్రతి గ్రామం లో వ్యవసాయ సాగు విస్తీర్ణం వివరాలను స్థానిక రెవిన్యూ అధికారులతో సమన్వయం చేసి సేకరించాలని సూచించారు.
కల్వకుర్తి శాసన సభ్యులు వంశీ చందర్ రెడ్డి మాట్లాడుతూ వ్యవసాయ రంగం పై ఆధారిత వ్యవస్థ కాబట్టి వ్యవసాయ అధికారుల పాత్ర కీలకం అన్నారు. రైతులు పంట పెట్టుబడి కి బ్యాంక్ రుణం, పంట నష్ట పరిహారం పొందడం లో వ్యవసాయ అధికారులు చొరవ తీసుకోవాలన్నారు. రైతులకు ఉపయోగకరంగా ఉండే పంట భీమా పధకం, కార్యాచరణ రూపొందించాలని సూచించారు.
హైదరాబాద్ జిల్లా సహకార సంఘ అధ్యక్షులు పెంటా రెడ్డి మాట్లాడుతూ అరహతా ఉన్న సహారా సంఘాలకు 6% రిబేట్ మంజూరు చేయాలనీ మంత్రి దృష్టికి తెచ్చారు.
రాష్ట్ర వ్యవసాయ శాఖ కార్యదర్శి సి. పార్థసారధి, రాష్ట్ర వ్యవసాయ శాఖ కమీషనర్ ఏం జగన్ మోహన్, రంగారెడ్డి జిల్లా కలెక్టర్ ఏం రఘునందన్ రావు, రంగారెడ్డి జిల్లా సహకార సంఘ అధ్యక్షులు, వ్యవసాయ, సహకార సంఘ అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.