పార్లమెంట్ ప్రాంగణంలో ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ అధ్యక్షతన జరిగిన జీఎస్టీ కౌన్సిల్ 4 వ సమావేశంలో పాల్గొన్న ఆర్థిక శాఖ మంత్రి ఈటెల రాజేందర్.
గురువారం నాడు జీఎస్టీ అమలుకు సంబంధించి జరిగిన 4వ సమావేశంలో పాల్గొన్న రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి ఈటెల రాజేందర్ రాష్ట్ర అభిప్రాయలను కౌన్సిల్ లో వివరించారు. సమావేశం అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ… పలు సమావేశాలు, అనేక చర్చల తర్వాత ఈ సమావేశంలో అన్ని రాష్ట్రాలు, కేంద్రం ఏకగ్రీవంగా పన్ను స్లాబ్ రేట్లని నిర్ణయించాయని ఆయన తెలిపారు.
అన్ని రాష్ట్రాలు పేదలు వాడే వస్తువుల పై ఎక్కువ పన్ను భారం ఉండొద్దన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేశాయని ఆయన తెలిపారు. రాష్ట్రాల ఆదాయాలు తగ్గకుండా ఉండే పద్దతులు, రాష్ట్రాలకు నష్ట పరిహారం విషయంపై కీలక నిర్ణయం జరిగిందని తెలిపారు. రాష్ట్రాల్లో గతంలో 5 శాతం వ్యాట్ ఉన్న అన్ని వస్తువులపై జీఎస్టీలో కూడా యధాతధంగా 5 శాతం పన్నులు విధించాలని నిర్ణయం జరిగిందన్నారు. 9 నుంచి 15 మధ్య పన్ను ఉన్న వస్తువులపై ఇకపై 12 శాతం పన్నులు వసూలు చేయాడానికి కౌన్సిల్ ఆమోదం తెలిపిందని ఆయన అన్నారు.
బంగారం, వజ్రాలు మినహా అన్ని వస్తువులపై పన్ను 5, 12, 18, 28 శాతాలుగా విధించడానికి అన్ని రాష్ట్రాలు అంగీకరించాయని తెలిపారు. గతంలో 40 నుంచి 45 శాతం పన్ను ఉన్న వస్తువులపై జీఎస్టీ ద్వారా 28 శాతం పన్ను విధించాలని నిర్ణయించినందున రాష్ట్రాలు కోల్పోయే ఆదాయాన్ని సమకూర్చడానికి ఆ వస్తువుల పై సెస్ వసూలు విధించి నష్టాన్ని కొంత మేరకు భర్తీ చేయాలని సమావేశంలో నిర్ణయం తీసుకున్నామని ఆయన తెలిపారు. పోగాకు సంబంధిత వస్తువులపై పన్ను శాతం గణనీయంగా తగ్గించాలని నిర్ణయించినందున వాటిపై కూడా సెస్ విధించాలని నిర్ణయించారని ఆయన తెలిపారు.
రేపు కూడా సమావేశం కొనసాగనుందని, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల పరిధిలో 1.5 కోట్ల లోపు విక్రయ, సేవల పన్ను వసూలు చేసే అధికారం రాష్ట్రాలకే వుండాలనే అంశంపై,1.5 కంటే ఎక్కువ విక్రయ, సేవ పన్ను ల్లో కేంద్ర ప్రభుత్వానికి వాటారేపు అన్న అంశాలపై రేపు చర్చించనున్నామని ఆర్థిక శాఖ మంత్రి తెలిపారు.
ఈ సమావేశంలో ఆర్థిక శాఖ మంత్రి ఈటెల రాజేందర్ తో పాటు ఆర్దిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్సి అజయ్ మిశ్రా,వాణిజ్య పన్నుల శాఖ కమీషనర్ అనిల్ కుమార్,వాణిజ్య పన్నుల శాఖ సంయుక్త కమీషనర్ లక్ష్మీ నారాయణ తదితరులు పాల్గొన్నారు.