* జిల్లాల విభజనతో ప్రజలకు పాలన చేరువైంది. అధికారులకు పర్యవేక్షణ సులువైంది.
* టీం వర్క్ తో పారదర్శకంగా ప్రభుత్వ పథకాలను ప్రజలకు చేరుద్దాం.
* రెండేళ్లలో వందశాతం వ్యక్తిగత మరుగుదొడ్లు, ఇంకుడు గుంతల నిర్మాణం పూర్తిచేయాలి.
* అసంపూర్తిగా ఉన్న అంగన్ వాడీ, గ్రామపంచాయతీ భవనాల నిర్మాణం త్వరితగతిన పూర్తవ్వాలి.
* నర్సరీల్లో మిగిలిపోయిన మొక్కలను నాటే ప్రక్రియ కొనసాగించాలి.
* వచ్చే ఏడాది హరితహారానికి ఇప్పటి నుండే ప్రణాళిక బద్దంగా ముందుకు పోవాలి.
* ప్రజలు కోరుకుంటున్న మొక్కలనే నర్సరీల్లో పెంచేలా చర్యలు తీసుకోవాలి.
* వర్షాలు బాగా కురిసిన నేపథ్యంలో ఎక్కడ రైతు పంటలు ఎండిపోలేదు. అలాగే హరితహారం మొక్కలు కూడా ఎండిపోకూడదు.
* ప్రతి ఉపాధికూలీ కుటుంబానికి 400 మొక్కల సంరక్షణ భాద్యత అప్పగించాలి.
* స్వయం సహాయక బృందాలను క్రియశీలం చేయాలి. అన్ని ప్రభుత్వ కార్యక్రమాల్లో వారిని భాగస్వామ్యం చేయాలి.
* కేరళ రాష్ట్రంలో డ్రైనేజీ వ్యవస్థే పెద్దగా కనిపించలేదు. ప్రతి ఇంటిలో వర్షపు నీటిని భావిలోకి వెళ్లేలా ఏర్పాట్లు, ఇంకుడు గుంతలు ఉన్నాయి. దీంతో ఎక్కడ వరద నీరు పారే అవకాశమే లేకుండా పోయింది. ఇలాంటి చర్యలు తీసుకునే దిశగా ఆలోచన చేద్దాం.
సచివాలయంలో హరితహారం, ఉపాధిహామీ, మరుగుదొడ్ల నిర్మాణంపై కలెక్టర్లతో పంచాయతీరాజ్ మరియు గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు సమీక్ష.
హైదరాబాద్: జిల్లాల విభజనతో ప్రజలకు పాలన చేరువైందని, అధికారులకు పర్యవేక్షణ సులువైందని పంచాయతీరాజ్ మరియు గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. జిల్లాల విభజన అనంతరం తొలిసారిగా సచివాలయం నుండి జిల్లా కలెక్టర్లతో మంత్రి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. హరితహారం, ఉపాధిహామి పనులు, వ్యక్తిగత మరుగు దొడ్ల నిర్మాణం పనుల పురోగతిపై చర్చించారు. పనులను వేగంగా ముందుకు తీసుకెళ్లే దిశగా కలెక్టర్లకు దిశా నిర్ధేశం చేశారు. జిల్లాల విభజన తర్వాత కలెక్టర్లకు కూడా పర్యవేక్షణ సులువుగా మారిందని, పారదర్శకంగా ప్రభుత్వ పథకాలను ప్రజలకు చేర్చేందుకు టీం వర్క్ తో పనిచేయాలన్నారు. కొన్ని జిల్లాల్లో లక్ష్యం మేరకు ఉపాధిహామి పనులు, హరితహారం సాగడం లేదన్నారు. ఆయా జిల్లాల కలెక్టర్లు ప్రత్యేకంగా చొరవ చూపి పనుల్లో వేగం పెంచాలని ఆదేశించారు. హరితహారంలో నాటిన ప్రతి మొక్కను సంరక్షించేందుకు చర్యలు తీసుకోవాలని, ప్రతి ఉపాధి కూలీ కుటుంబానికి 400 మొక్కల పరిరక్షణ భాద్యత అప్పగించాలని సూచించారు. వర్షాలు బాగా కురవడంతో ఎక్కడ రైతు పొలాలు ఎండిపోలేదని, అయితే అక్కడక్కడ హరితహారం మొక్కలు ఎందుకు ఎండుతున్నాయన్నారు. ఇలాంటి పరిస్థితి రాకుండా చూసుకోవాలన్నారు. నర్సరీల్లో అందుబాటులో ఉన్న మొక్కలన్నింటిని నాటేలా చర్యలు తీసుకోవాలని, వచ్చే ఏడాది హరితహారానికి ఇప్పటి నుంచే ప్రణాళిక సిద్ధం చేయాలన్నారు. ఈ ఏడాది అక్కడక్కడ ప్రజలు కోరుకున్న మొక్కలు అందుబాటులో ఉంచలేకపోయామని, వచ్చే ఏడాది ఈ పరిస్థితి రాకుండా చూసుకోవాలన్నారు. వచ్చే సంవత్సరం ప్రతి గ్రామంలోను 40వేల మొక్కలు నాటేందుకు ఇప్పటినుంచే ప్రణాళిక సిద్ధం చేసుకోవాలన్నారు. మహిళా సంఘాలను క్రియాశిలం చేసి, ప్రభుత్వ కార్యక్రమాలన్నింటిలో పాల్గొనేలా చూడాలని సూచించారు.
2018 అక్టోబర్ 2 నాటికే వంద శాతం మరుగుదొడ్ల నిర్మాణం పూర్తి కావాలని, అలాగే ప్రతి ఇంటికి ఇంకుడు గుంత నిర్మాణం జరిగేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఇటీవల కేరళ రాష్ట్రాన్ని తాము సందర్శించామని, ఎక్కడ పెద్దగా డ్రైనేజీ వ్యవస్థ కనిపించలేదన్నారు. ప్రతి ఇంటిలో ఎవరికి వారు ఇంకుడు గుంత, కంపోస్ట్ తయారి, బయో గ్యాస్, వాన నీటిని భావిలోకి పంపే ఏర్పాట్లు చేసుకోవడం వల్ల పారిశుద్ద్య లోపమే కేరళలో కనిపించలేదన్నారు. ఉపాధిహామి, స్వచ్ఛ్ భారత్ మిషన్ కింద మరుగుదొడ్ల నిర్మాణం చేపట్టాలని, నిధులకు కొరత లేదన్నారు. అసంపూర్తిగా ఉన్న అంగన్ వాడీ, గ్రామపంచాయతీ భవన నిర్మాణాలను త్వరితగతిని పూర్తి చేయాలన్నారు. వీడియో కాన్ఫరెన్స్ లో స్పెషల్ సీఎస్ ఎస్పీ సింగ్, కమిషనర్ నీతూ కూమారి ప్రసాద్ పాల్గొన్నారు.
మిషన్ భగీరథను ప్రతివారం సమీక్షించాలి:
మిషన్ భగీరథ పనుల పురోగతిపై ప్రతి వారం కలెక్టర్లు సమీక్ష నిర్వహించాలని స్పెషల్ సీఎస్ ఎస్పీ సింగ్ కోరారు. దేశంలోనే అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న మిషన్ భగీరథ లక్ష్యాన్ని చేరుకునేందుకు ప్రత్యేక శ్రద్ధ చూపాలన్నారు. జిల్లాల్లో జరుగుతున్న భగీరథ పనులను ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని కలెక్టర్లను కోరారు.