వాణిజ్యపన్నుల శాఖలో 1194 కోట్ల బకాయిల వసూళ్ళకు ప్రత్యేక చర్యలు చేపట్టాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డా. రాజీవ్ శర్మ వాణిజ్యపన్నుల శాఖ అధికారులను ఆదేశించారు.
గురువారం సచివాలయంలో ఏర్పాటు చేసిన వాణిజ్య పన్నుల శాఖ అధికారుల సమీక్షా సమావేశంలో సి.యస్ మాట్లాడుతూ పెద్ద నోట్ల రద్దు నేపథ్యంలో రాష్ట్ర ఆదాయంపై పడిన ప్రభావాన్ని దృష్టిలో ఉంచుకొని వాణిజ్య పన్నుల శాఖ అధికారులు బకాయిల వసూళ్ళకు విసృత ప్రచారం చేపట్టాలని, డీలర్లకు ఎస్.యం.ఎస్ ల ద్వారా సందేశం అందించి ఈనెల 24 లోగా పాత నోట్లతో చెల్లింపులు జరిగేలా ప్రత్యేక డ్రైవ్ లు చేపట్టాలన్నారు. మొత్తం బకాయిలతో మూసివేసిన సంస్ధలు, వ్యాపారస్తుల బకాయిలు 838 కోట్ల విషయమై వారి ఆస్తుల స్వాదీన ప్రయత్నాలను ముమ్మరం చేయాలని, ఆస్తులను వేలం వేయటానికి చర్యలు చేపట్టాలన్నారు. ఈ వేలంలో టియస్ఐఐసి, హెచ్ యం డి ఏ, హౌసింగ్ బోర్డ్స్ బిడ్లు దాఖలు చేసేలా చూడాలన్నారు. డివిజన్ల వారిగా బకాయిలపై డిప్యూటి కమీషన్ల తో చర్చించారు. వాణిజ్య పన్నుల శాఖ డిఫాల్టర్ల వివరాలపై ప్రచారం నిర్వహించాలన్నారు. నోట్ల రద్దు వలన వాణిజ్య పన్నుశాఖ పై పడే ప్రభావాన్ని క్షుణ్ణంగా అధ్యయనం చేయాలన్నారు. వ్యాపారస్తుల టర్నోవర్ నమోదు పై ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు. బకాయిలు పేరుకు పోకుండా చూడాలన్నారు.
వాణిజ్యపన్నుల శాఖ కమీషనర్ శ్రీ అనిల్ కుమార్ మాట్లాడుతూ నవంబర్ 9 నుండి నవంబర్ 16 వరకు 182 కోట్లు వసూళ్ళు చేశామని, ప్రత్యేక డ్రైవ్ లు నిర్వహిస్తున్నామని డీలర్లను బకాయిలు చెల్లించేలా వారిని ప్రోత్సహిస్తున్నామని సియస్ కు వివరించారు. సెప్టెంబర్, అక్టోబర్ నెలలో 3244 కేసులు నమోదు చేసి 44 కోట్ల రూపాయలు వసూళ్ళు చేశామన్నారు.
ఈ సమావేశంలో వివిధ డివిజన్ల డిప్యూటీకమీషనర్లు తదితరులు పాల్గొన్నారు.