మార్కెట్ యార్డులలో రైతులు ఇబ్బందికి గురికాకుండా అధికారులు చర్యలు చేపట్టాలని రాష్ట్ర వ్యవసాయ శాఖ కార్యదర్శి సి.పార్థసారథి తెలిపారు.
శనివారం బోయిన్ పల్లి మార్కెట్ యార్డ్ లో జిల్లా మార్కెటింగ్ అధికారులతో వివిధ అంశాల పై సమీక్షించారు. ఈ సందర్బంగా అయన మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా ఖరీఫ్ ఉత్పత్తులతో రైతులు మార్కెట్ యార్డ్ లను ఆశ్రయిస్తారని, మౌలిక వసతులతో కొరత రాకుండా అధికారులు అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. ఖరీఫ్ ఉత్పత్తులకు కనీస మద్దతు ధరల తో పాటు వివిధ ప్రధాన మార్కెట్ లో ఉన్న ధరల వివరాలను మార్కెట్ నోటీసు బోర్డు పై పెట్టాలన్నారు. రైతులకు మేలు చేసేందుకు నాణ్యమైన తూకం, చెలింపులు ఆన్ లైన్ ద్వారా చేసేందుకు అధికారులు చొరవ తీసుకోవాలన్నారు. వ్యాపారాలు, కమిషన్ ఏజెంట్ ల తో సమన్వయ సమేవేశం నిర్వహించి రైతులకు మద్దతు ధర అందించడం లో కృషి చేయాలన్నారు. రాష్ట్రం లో నూతనంగా ఏర్పడిన మార్కెట్ కమిటి సభ్యులను మార్కెట్ కార్యకలాపాలలో పాల్గొనేలా చూడాలి. ఈ- నామ్ ప్రక్రియ ను విజయవంతం చేయాలనీ, సాంకేతిక లోపాలను రాష్ట్ర స్థాయి లో సమాచారం ఇవ్వాలని తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా 330 గోదాములు మంజూరు ఇవ్వగా 200 గోదాముల నిర్మాణం పూర్తయిందని, వీటిని వినియోగం లోకి తీసుకొని రావాలని సూచించారు. మిగతా 130 గోదాముల నిర్మాణం పనులను ఇంజినీర్లతో సమీక్షించారు. రైతు బంధు పధకం పై క్షేత్ర స్థాయి లో విస్తృత ప్రచారం చేయాలన్నారు. నూతన జిల్లా లో ఉన్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు.
ఈ సమావేశం లో మార్కెటింగ్ శాఖ సంచాలకులు లక్ష్మి భాయ్,మార్కెటింగ్ అధికారి పద్మ హర్ష, జిల్లా మార్కెటింగ్ అధికారులు, ఇంజినియర్లు పాల్గొన్నారు.