* ఈ నెల 16 నుంచి స్కూళ్ల డిజిటలైజేషన్ కార్యక్రమం ప్రారంభిస్తాం
* 11 నుంచి 14 వరకు ట్రయల్ రన్ చేసుకోవాలి
* ఒకసారి ప్రారంభించాక మధ్యలో ఆగొద్దు
ప్రత్యేక శ్రద్ధ పెట్టి పాఠశాలల్లో డిజిటలైజేషన్ కు వసతులు, సాంకేతిక పరికరాలు అందుబాటులో ఉంచాలి వీడియో కాన్ఫరెన్స్ లో కలెక్టర్లకు డిప్యూటీ సిఎం, విద్యాశాఖ మంత్రి కడియం శ్రీహరి సూచనలు
ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న పాఠశాలల డిజిటలైజేషన్ కార్యక్రమాన్ని ఈ నెల 16వ తేదీ నుంచి ప్రారంభిస్తున్నట్లు డిప్యూటీ సిఎం, విద్యాశాఖ మంత్రి కడియం శ్రీహరి తెలిపారు. స్కూళ్ల డిజిటలైజేషన్ స్కీం పై సచివాలయంలో కలెక్టర్లు, డిఈవోలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. 16 నుంచి ప్రారంభించే ఈ కార్యక్రమానికి జిల్లాల కలెక్టర్లు, డీఈఓలు ఈ నెల 11 నుంచి 14 వరకు ట్రయల్ రన్ నిర్వహించి ప్రతి పాఠశాలలో కంప్యూటర్లు, విద్యుత్, ఆర్వోటీలు, కేబుల్ కనెక్షన్లు, టీచర్ల శిక్షణ పూర్తయ్యేలా చూసుకోవాలని డిప్యూటీ సిఎం, విద్యాశాఖ మంత్రి కడియం శ్రీహరి సూచించారు. ఒకసారి ప్రారంభించిన తర్వాత సాంకేతిక, ఇతర కారణాలతో మధ్యలో ఆపడానికి వీలు లేదన్నారు. అందుకే కలెక్టర్లు ప్రత్యేక శ్రద్ధ తీసుకుని ఈ నెల 16వ తేదీ వరకు అన్ని పాఠశాలలను చెక్ చేసుకోవాలని సూచించారు. అన్ని వసతులు, కంప్యూటర్లు, కేబుల్ కనెక్షన్లు ఉన్న చోటే ప్రారంభిస్తామని ప్రత్యేకంగా చెప్పారు. మొదటి దశలో దాదాపు రెండువేలకు పైగా పాఠశాలల్లో దీనిని ప్రారంభిస్తున్నామన్నారు. ఆ తర్వాత దశల వారిగా మిగతా పాఠశాలలకు, సబ్జెక్టులకు దీనిని విస్తరిస్తామని కలెక్టర్లు, డీఈఓలతో చెప్పారు. ఈ కార్యక్రమం ప్రారంభోత్సవంలో ప్రజాప్రతినిధులను ఆహ్వానించాలని, వారు లేనిచోట అధికారులు ప్రారంభించాలని సూచించారు.
డిజిటలైజేషన్ ఆఫ్ స్కూళ్ల కార్యక్రమంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ పాఠశాలలు ఇప్పటికే ముందంజలో ఉన్నాయని, మిగతా స్కూళ్లు కూడా అలా ఉండేలా చర్యలు తీసుకోవాలని పాఠశాల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రంజీవ్ ఆర్ ఆచార్య కలెక్టర్లు, డీఈవోలకు సూచించారు. ఈ నెల 11వ తేదీ నాటికి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించేందుకు సిద్ధంగా ఉన్న స్కూళ్ల తుది జాబితా ఇవ్వాలన్నారు. 14వ తేదీ వరకు ట్రయల్ రన్ చేస్తూ ఎప్పటికప్పుడు వివరాలు అందచేయాలని కోరారు.
హార్డ్ వేర్ కు సంబంధించిన సమస్యలు వస్తే వెంటనే వాటిని పరిష్కరించేందుకు జిల్లాల్లో ఈ డిస్ట్రిక్ట్ మేనేజర్లు ఉన్నారని ఐటి కార్యదర్శి జయేష్ రంజన్ తెలిపారు. వీరితో పాటు ఎంఐఎస్ కో ఆర్డినేటర్లు కూడా అందుబాటులో ఉన్నారని, వీరికి శిక్షణ కూడా ఇచ్చామన్నారు. పాఠశాలల ప్రధానోపాధ్యాయులు డిజిటలైజేషన్ కు సంబంధించిన సమస్యలపై ఎంఐఎస్ కో ఆర్డినేటర్లను సంప్రదించాలని సూచించారు. అన్ని జిల్లాల్లో డిసెంబర్ 31 నాటికి కేబుల్ ఆపరేటర్లతో ఒప్పందాలు పూర్తవుతాయన్నారు. హైదరాబాద్ లో ప్రతి స్కూల్ కు ఈ కార్యక్రమం కోసం కేబుల్ ఆపరేటర్లు ముందుకొచ్చి వారి ఖర్చుతో కేబుల్ కనెక్షన్లు, సెట్ టాప్ బాక్స్ లు అందిస్తున్నారని, మిగిలిన జిల్లాల్లో కూడా ఇలాంటి ప్రయత్నాన్ని కలెక్టర్లు చేయాలని కోరారు.
డిజిటలైజేషన్ ఆఫ్ స్కూళ్ల కార్యక్రమం మధ్యాహ్నం మంత్రి సంబంధిత అధికారులతో రివ్యూ చేశారు. వీడియో కాన్ఫరెన్స్ లో కలెక్టర్లు ఈ స్కీం ప్రారంభోత్సవానికి అంతా సిద్ధంగా ఉన్నామని చెప్పారు.