తెలంగాణ విత్తన ధృవీకరణ సంస్థను క్షేత్ర స్థాయి లో బలోపేతం చేసేందుకు పాలక మండలి నిర్ణయించిందని రాష్ట్ర వ్యవసాయ శాఖ కార్యదర్శి సి.పార్థసారథి తెలిపారు.
శనివారం సచివాలయం డి-బ్లాక్ లోని తన ఛాంబర్ లో తెలంగాణ రాష్ట్ర విత్తన, సేంద్రియ ధృవీకరణ సంస్థ 4 వ సాధారణ పాలక మండలి సమావేశం జరిగింది. ఈ సందర్బంగా విత్తన దృవీకరణ సంస్థ బలోపేతం చేసేందుకు జోనల్ స్థాయిలో ముఖ్య విత్తన అధికారి పోస్ట్ ను మంజూరు చేసేందుకు పాలక మండలి నిర్ణయించినట్లు అయన తెలిపారు. ఈ సంస్థ గత సంవత్సరం ఖరీఫ్ లో 78501 ఎకరాలకు 7.05 లక్షల క్వింటాలు దృవీకరణ చేయగా ఈ ఏడాది ఖరీఫ్ లో 104378 ఎకరాలకు 8. 50 క్వింటాలు వివిధ పంటల క్రింద నమోదు చేయడం జరిగిందన్నారు. ఈ ఖరీఫ్ నుండి విత్తన ధ్రువీకరణ లో భాగంగా సేంద్రియ విత్తనాల దృవీకరణ ప్రారంభించడం జరిగిందన్నారు.
విత్తన ఎగుమతుల కొరకు OECD విత్తన దృవీకరణ కూడా ఖరీఫ్ లో ప్రారంభించడం జరిగిందన్నారు. 1200 ఎకరాలు ఈ రబి లో నమోదు అయే అవకాశం ఉందన్నారు. అంతర్జాతీయ విత్తన ప్రమాణాలకు ISTA అనుగుణంగా విత్తన పరీక్షలు జరిపేందుకు రాజేంద్రనగర్ లో ఉన్న విత్తన పరీక్షా కేంద్రాన్ని విస్తరించేందుకు నిర్ణయించినట్లు అయన తెలిపారు. నిజామాబాద్, వరంగల్ జిల్లాలో సంస్థ కార్యాలయాల నిర్మాణంకు, సంస్థ విత్తన కేంద్రాల ఏర్పాటు కు కేంద్ర ప్రభుత్వం ద్వారా 6 కోట్ల నిధులు మంజూరు చేయడం జరిగిందన్నారు.
ఇటీవలే మొదలు పెట్టిన సేంద్రియ విత్తనాల ధృవీకరణ కు 33 375 ఎకరాలకు 33 దరఖాస్తులు రైతుల నుండి నమోదు చేసుకోవడం జరిగిందన్నారు. రాష్ట్రాన్ని విత్తన భాండాగారం దిశగా తీర్చిద్దిదేందుకు కావలసిన సిబ్బంది ని మౌలిక సదుపాయాలను రాష్ట్ర ప్రభుత్వం కల్పిస్తుందన్నారు. కల్తీ లేని నాణ్యమైన విత్తనాలను రైతులకు అందించేందుకు సంస్థ కృషి చేయాలన్నారు.
ఈ సమావేశం లో వ్యవసాయ శాఖ కమీషనర్ ఏం. జగన్ మోహన్, తెలంగాణ విత్తన ధృవీకరణ సంస్థ సంచాలకులు కేశవులు, ఉద్యాన శాఖ కమీషనర్ ఎల్. వెంకట్ రామ్ రెడ్డి, పాలక మండలి సభ్యులు పాల్గొన్నారు.