తెలంగాణ రాష్ట్రం బ్రిటన్ దేశాల మధ్య పారిశ్రామిక , సాంస్కృతిక రంగాలల్లో పటిష్టమైన సంబంధాలను ఏర్పరచుకొని రాష్ట్ర పారిశ్రామిక ప్రగతికి, ఆర్ధికాభివృద్ధి సహకరించాల్సిందిగా బ్రిటన్ పార్లమెంట్ సభ్యులు శ్రీ వీరేంద్రశర్మను ప్రభుత్వ సలహాదారు డా.కె.వి.రమణాచారి కోరారు.
శనివారం సచివాలయంలో బ్రిటన్ పార్లమెంట్ సభ్యులు శ్రీ వీరేంద్రశర్మ ప్రభుత్వ సలహాదారును మర్యాద పూర్వకంగా కలుసుకున్నారు.ఈ సందర్భంగా డా. కె.వి.రమణాచారి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం ఏర్పడి కేవలం రెండున్నర సంవత్సరాలు అయ్యిందని, రాష్ట్రముఖ్యమంత్రి శ్రీ కె.చంద్రశేఖర్ రావు గారి నాయకత్వంలో ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో తెలంగాణ రాష్ట్రం మొదటి స్ధానంలో నిలిచిందని తెలుపుతూ తెలంగాణ, బ్రిటన్ దేశాల మధ్యన వాణిజ్య, సాంస్కృతిక సంబంధాలు మెరుగుపరచడానికి కృషి చేయాలన్నారు. వచ్చే 2,3 ఏళ్ళలో సంబంధాలు మరింత మెరుగు పడాలని తెలంగాణ రాష్ట్రంలో ఎన్నో సానుకూల అంశాలు ఉన్నాయని, వివిధ రంగాలలో విరివిగా పెట్టు బడులు పెట్టేలా కృషి చేయాలన్నారు. ఈ సమావేశం సంబంధాల మేరకు దశదిశ నిర్ధేశాన్నిస్తుందని, మంచి పరిణామానికి నాంది పలికిందన్నారు.
బ్రిటన్ పార్లమెంట్ సభ్యులు శ్రీ వీరేంద్రశర్మ మాట్లాడుతూ భారతదేశం పట్ల, ముఖ్యంగా దక్షిణాది రాష్ట్రమైన తెలంగాణ పట్ల ప్రత్యేక ఆసక్తి ఉందని, ఈ రాష్ట్రంతో సంబంధాల పెంపుకు కృషి చేసి రాష్ట్ర ప్రగతికి తోడ్పాటు నందిస్తానన్నారు.
తన వారం రోజుల పర్యటనలో గౌరవముఖ్యమంత్రి, మంత్రులను కలవనున్నట్లు తెలిపారు. రాష్ట్ర పారిశ్రామికాభివృద్ధికి అనేక అవకాశాలు, వనరులు ఉన్నాయని అన్నారు.
బ్రిటన్ పార్లమెంట్ సభ్యుల సలహాదారు శ్రీ ఉదయ్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి కోసం యుకె తెలంగాణ బిజినెస్ మీట్ ను లండన్ పార్లమెంట్ లో ఏర్పాటు చేసి స్వరాజ్ పాల్, ఇతర యంపి లను ఆహ్వానించి తెలంగాణ రాష్ట్రంలో వ్యాపార అనుకూలతలను తెలియజేయడం జరిగిందన్నారు. తెలంగాణ, బ్రిటన్ సంబంధ బాంధవ్యాల పటిష్టతకు కార్యచరణ ప్రణాళిక రూపొందించుకొని ముందుకు సాగుతున్నాయన్నారు.
ఈ సమావేశంలో తెలంగాణ యన్ఆర్ఐ ఫోరం అధ్యక్షులు శ్రీ చంద్రశేఖర్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.