తెలంగాణ రాష్ట్రంలో కొత్త జిల్లాల ఏర్పాటు నేపధ్యంలో జిల్లాల ప్రాతిపదికన కేంద్రం నుండి లభించే ప్రాయోజిత పథకాలకు సంబంధించిన ప్రతి పాదనలను కేంద్ర ప్రభుత్వానికి సమర్పించాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డా.రాజీవ్ శర్మ ఆదేశించారు.
బుధవారం సచివాలయంలో వివిధ శాఖల ఉన్నతాధికారులతో డా. రాజీవ్ శర్మ సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు శ్రీ యస్.పి.సింగ్, శ్రీమతి రంజీవ్ ఆర్ ఆచార్య, శ్రీ అజయ్ మిశ్రా ముఖ్యకార్యదర్శులు శ్రీ బి.పి ఆచార్య, శ్రీ రాజేశ్వర్ తివారి, శ్రీ అథర్ సిన్హా, శ్రీ బి.ఆర్ మీనా, శ్రీ రాజీవ్ త్రివేది,శ్రీ రామకృష్ణారావు, శ్రీ అజత్ కుమార్,శ్రీ సునీల్ శర్మ, కార్యదర్శులు శ్రీ వికాస్ రాజ్, శ్రీ నవీన్ మిత్తల్, శ్రీ శివశంకర్, శ్రీ బి.వేంకటేశం, శ్రీ ఉమ్మర్ జలీల్, శ్రీ జగధీశ్వర్, శ్రీ బెనహర్ మహేశ్ దత్ ఎక్కా, శ్రీ పార్ధసారధి, శ్రీ సంతోష్ రెడ్డి, కుటుంబ సంక్షేమ శాఖ కమీషనర్ శ్రీమతి కరుణ తదితరులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాఖల వారిగా కేంద్ర ప్రభుత్వ ప్రాయోజిత పథకాలు, కొత్త జిల్లాల్లో కలెక్టరేట్లు, ఆర్టీఓ, తహశీల్ దార్ల కార్యాలయాల నిర్మాణం, ఐటి సంబంధిత సమస్యలు, సిబ్బంది కేటాయింపు, వాహానాల అవసరం, విధుల వివరాలు, షెడ్యూల్డు 9,10 సంస్ధల ఉద్యోగుల వివరాలు, నిధులు, శాఖల వారిగా ఆర్ధిక సంబంధమైన సమీక్షలు తదితర అంశాలపై సమీక్షించారు. జిల్లాల వారిగా కేంద్రం నుండి లభించే పథకాల ప్రతిపాదనలు కేంద్ర ప్రభుత్వాలకు సమర్పించడంతో పాటు, రాష్ట్ర ఆర్ధిక శాఖకు ప్రతిపాదనల ప్రతిని అందజేయాలన్నారు. జిల్లాలకు సంబంధించిన స్టాటిస్టిక్స్, జనాభా వివరాలు, నీతి అయోగ్ కు పంపవలసిన వివిరాలను ప్రణాళికాశాఖ రూపొందించి సంబంధిత కేంద్ర ప్రభుత్వ శాఖలకు సమర్పించాలని ప్రణాళికా శాఖ ముఖ్యకార్యదర్శిని ఆదేశించారు.
వైద్య ఆరోగ్యశాఖకు సంబంధించి శ్రీ రాజేశ్వర్ తివారి మాట్లాడుతూ రాష్ట్రీయ బాల్ స్వాస్త్య (ఆర్.బి.యస్.కె) కార్యక్రమం సంబంధించి 21 జిల్లాల్లో సెంటర్ల ఏర్పాటు, వివిధ పథకాల ద్వారా కేంద్ర ప్రభుత్వం నుండి 484 కోట్ల నిధులు కోరుతూ ప్రతిపాదనలు రూపొందించినట్లు వివరించారు.
విద్యాశాఖకు సంబంధించి విద్యాపరంగా వెనుకబడిన కొత్త 105 గ్రామీణ మండలాల్లో కె.జి.బి.వి ( కస్తూరిభా గాంధీ బాలికా విద్యాలయాలు) 18 కేంద్రీయ విద్యాలయాలు, 21 జవహర్ నవోదయ విద్యాలయాలు, 21 డైట్ లను నూతన జిల్లాల్లో ఏర్పాటు చేయాలన్న ప్రతిపాదనలు రూపొందిస్తున్నట్లు విద్యాశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి శ్రీమతి రంజీవ్ ఆర్.ఆచార్య వివరించారు.
పంచాయతీ రాజ్ శాఖ ప్రత్యేక ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శ్రీ యస్.పి.సింగ్ మాట్లాడుతూ 14 వ ఫైనాన్స్ కమీషన్ ద్వారా గ్రాంట్లు గ్రామ పంచాయితీలకే వెళ్ళుతున్నాయని, జిల్లాల వారిగా నిధులు కేటాయింపులు లేవన్నారు.
అటవీ శాఖలో జిల్లాల వారిగా ఎకోక్లబ్బులు, రహదారులు, భవనాల శాఖలో వామ పక్ష ప్రభావిత ప్రాంతాల నిధులు మహిళా, శిశు సంక్షేమ శాఖల్లో చైల్డ్ ప్రొటెక్షన్ యూనిట్లు, ఐటి శాఖ ద్వారా జిల్లాలో యన్ ఐ సి ఏర్పాటు డిస్ట్రిక్ ఇన్ ఫర్ మేషన్ ఆఫీసర్ల నియామకం, వ్యవసాయ శాఖ ద్వారా కృషి విజ్ఞాన కేంద్రాలు, భూసార పరీక్షా కేంద్రాలు, ఆత్మా పథకం అమలు, నేషనల్ ఈ గవర్నమెంట్ ల్యాబుల ఏర్పాటుకు సంబంధించి ప్రతిపాదనలు వివరించారు.
సాంఘీక సంక్షేమ శాఖకు జనాభా ఆధారంగా నిధులు, స్కాలర్ షిప్స్ మంజూరు అవుతున్నాయని, హాస్టల్స్, డార్మెటరీల నిర్మాణం, వసతుల కల్పనకు ప్రతిపాదనలు రూపొందింస్తున్నట్లు ఆ శాఖ కార్యదర్శి శ్రీ బెనహర్ మహేశ్ దత్ ఎక్కా వివరించారు.
మైనారిటీ సంక్షేమ శాఖలో జనాభా ఆధారంగా నిధులు మంజూరు అవుతున్నాయని, రెసిడెన్షియల్ స్కూల్స్ కు సంబంధించి 100 కోట్ల ప్రతిపాదనలు పంపామని, సద్భావనా మండపాలు, స్కిల్ డెవలప్ మెంట్ కు సంబంధించిన ప్రతిపాదనలు రూపొందిస్తున్నట్లు వివరించారు.