డిసెంబర్ 15 నుండి 18 వరకు హైదరాబాద్ లో జరిగే ఇండియన్ రోడ్డు కాంగ్రెస్ 77వ వార్షిక సదస్సు విజయవంతంగా నిర్వహించడానికి తగు ఏర్పాట్లు చేయాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డా.రాజీవ్ శర్మ సంబంధిత శాఖల అధికారులను ఆదేశించారు.
గురువారం సచివాలయంలో ఇండియన్ రోడ్డు కాంగ్రెస్ సదస్సు ఏర్పాట్లపై సంబంధిత శాఖల అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో రోడ్లు భవనాల శాఖ ముఖ్య కార్యదర్శి శ్రీ సునీల్ శర్మ , మెట్రో రైల్ యం.డి. శ్రీ యన్.వి.యస్ రెడ్డి , టూరిజం కార్పొరేషన్ యం.డి. శ్రీమతి క్రిస్టినా చొంగ్తు , జాయిట్ కమీషనర్ ఆఫ్ పోలీస్ శ్రీ స్టీపెన్ రవీంద్ర, ఇ.ఎన్.సి.లు శ్రీ గణపతి రెడ్డి , శ్రీ రవీందర్ రావు, న్యాక్ డి.జి. శ్రీ బిక్షపతి, జి.హెచ్.యం.సి, తదితర శాఖల అధికారులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి మాట్లాడుతూ ఇండియన్ రోడ్ కాంగ్రెస్ సదస్సు సందర్భంగా రోడ్లకు మరమ్మతులు, జి.హెచ్.యం.సి ద్వారా హోర్డింగ్స్, పారిశుద్ద్యం, టూరిజం శాఖ ద్వారా పర్యటనలు, సాంస్కృతిక శాఖ ద్వారా సాంస్కృతిక కార్యక్రమాలు, , పోలీసు శాఖ ద్వారా బందోబస్తు, అగ్ని ప్రమాదాల నియంత్రణ చర్యలు , ట్రాఫిక్ నిర్వహణ తదితర పనులు చేపట్టాలన్నారు. ఈ సదస్సు కు దాదాపు 2500 నుండి 3000 మంది ప్రతినిధులు పాల్గొనే అవకాశం ఉందన్నారు.
రోడ్లు భవనాల శాఖ ముఖ్యకార్యదర్శి శ్రీ సునీల్ శర్మ సదస్సు నిర్వహణ కు సంబంధిం చి ఇప్పటికే సంబంధిత శాఖల లో సమీక్ష సమావేశాలు నిర్వహించడం జరిగిందని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి వివరించారు.