గుర్తింపు లేని బయో ఉత్పత్తులను ఎంపిక చేయకుండా రాష్ట్ర రైతాంగాన్ని చైతన్య పరచాలని రాష్ట్ర వ్యవసాయ శాఖ కార్యదర్శి సి. పార్థసారథి వ్యవసాయ అధికారులకు సూచించారు.
శనివారం నాంపల్లి లోని వ్యవసాయ కమిషనర్ కార్యాలయం లో వ్యవసాయ అధికారులు శాస్త్రవేత్తలతో సమీక్షించారు. ఈ సందర్బంగా అయన మాట్లాడుతూ ఆకర్షణీయమైన వ్యాపార ప్రకటనల ద్వారా నకిలీ బయో ఉత్పత్తులను కొని, వినియోగించడం వలన రైతులు ఆశించిన మేరకు ఫలితాలను పొందలేక నష్ట పోతున్నారని, రైతులకు నకిలీ బయో-ఉత్పత్తుల కొనుగోలు లో తీసుకోవలసిన జాగ్రత్తల పై అవగాహన కల్పించాలన్నారు. ఈ మధ్య కాలంలో కొన్ని జిల్లాలో నకిలీ బయో ఉత్పత్తులను విక్రయించిన స్థలాలను తనిఖీ చేసి కేసులు నమోదు చేసిన సంఘటనలు కూడా వెలుగు చూశాయన్నారు.
శాస్త్రవేత్తల సూచనల మేరకు సమాచార కరపత్రాలను రైతులకు అందించాలన్నారు. జిల్లా కలెక్టర్లు వారి పరిధి లోని డీలర్లకు నాణ్యమైన ఉత్పత్తులను రైతులకు సరఫరా చేయాలని ఆదేశాలు జారీ చేయాలనీ సూచించడం జరుగుతుందన్నారు. వ్యవసాయ శాఖ అధికారుల ద్వారా డీలర్లు అనుమతి పొందిన లేబుల్ ప్రకారం ఉత్పత్తుల అమ్మకాలు నిర్వహించేలా ఎప్పటికపుడు పర్యవేక్షించాలన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న బయో ఉత్పత్తులు విక్రయించే కేంద్రాలను ప్రత్యేక బృందాలు తనిఖీ చేసి ప్రభుత్వానికి నివేధిక సమర్పించాలన్నారు. తనిఖీలలో బోగస్ కంపెనీ లను గుర్తించి రైతులకు సమాచారం అందించాలన్నారు. బయో ఉత్పత్తి కంపెనీల పై చర్యలు చేపట్టిన వెంటనే కోర్ట్ ని ఆశ్రయించి స్టే తెచ్చుకోవడం జరుగుతుందని వ్యవసాయ అధికారులు కార్యదర్శి దృష్టికి తీసుకొచ్చారు. దీనికి అయన స్పందిస్తూ నకిలీ బయో ఉత్పత్తులను అరికటేందుకు చట్టం లో కొని మార్పులని సిఫార్సు చేయాలన్నారు. బయో ఉత్పత్తుల కంపెనీ అసోసియేషన్ సభ్యులతో సమావేశం నిర్వహించి నాణ్యమైన ఉత్పత్తులను మార్కెట్ లో విక్రయించేందుకు ఆదేశాలు జారీ చేయాలనీ వ్యవసాయ శాఖ కమీషనర్ కు సూచించారు. రాష్ట్రం లో బయో ఉత్పత్తుల నాణ్యత పరీక్షించేందుకు ల్యాబుల కొరత ఉందని మిగితా పరీక్షా కేంద్రాలలో మౌలిక సదుపాయాలు కలిగి ఉన్న వాటిని నోటిఫై చేసేందుకు శాస్త్రవేత్తలు ఇచ్చిన సూచనలను పరిగణనలోకి తీసుకోవడం జరుగుతుందన్నారు.
ఈ సమావేశం లో వ్యవసాయ శాఖ కమీషనర్ ఏం. జగన్ మోహన్, AICRP on Biological Control, PJTSAU ప్రధాన శాస్త్రవేత్త డా. రెహ్మాన్, NIPHM డైరెక్టర్ సి.హెచ్ . శ్రీనివాస రావు, AINP on Pesticides Residue సీనియర్ శాస్త్రవేత్త డా. అనిత, వ్యవసాయ శాఖ అదనపు సంచాలకులు విజయ్ కుమార్, సిబ్బంది పాల్గొన్నారు.