ఒక్కరోజే రికార్డు స్థాయిలో పంచాయతీల్లో 5 కోట్ల 80 లక్షల ఆస్థి పన్ను వసూలైంది. పాత 500 , వెయ్యి రూపాయలతో ఆస్థి పన్ను చెల్లించేందుకు తెలంగాణా ప్రభుత్వం ఇచ్చిన అవకాశంతో పెద్ద ఎత్తున ప్రాపర్టీ ట్యాక్స్ కలెక్ట్ అయింది.
శుక్రవారం ఉదయమే అన్ని జిల్లాల పంచాయతీ అధికారులతో పంచాయతీ రాజ్ మరియు గ్రామీణాభివౄద్ది శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. పాత నోట్ల ద్వారా పన్ను చెల్లించే వెసులుబాటు కల్పించిన విషయాన్ని గ్రామగ్రామాన మైక్‌ల ద్వారా ప్రకటన చేయించాలని ఆదేశించారు. ఈ మేరకు ప్రతి గ్రామంలోనూ దండోరా వేయించడంతో మంచి స్పందన లభించింది. అటు అచ్చంపేట నియోజకవర్గంలో మంత్రి తుమ్మల నాగేశ్వర్రావుతో కలిసి ప్రాపర్టీ ట్యాక్స్ కలెక్షన్ తీరును మంత్రి జూపల్లి కృష్ణారావు స్వయంగా పరిశీలించారు.
ప్రజలకు కొత్త నోట్లు తీసుకోవడానికి ఎదురవుతున్న ఇబ్బందులను అడిగి తెలుసుకున్నారు. డిసెంబర్ 31 లోపు ఎప్పుడైనా నోట్లను మార్చుకునే వెసులుబాటు ఉందని…ఎవరూ ఆందోళన చెందవద్దని ప్రజలకు భరోసా ఇచ్చారు. మధ్నాహ్న సమయంలోనూ మరోసారి అన్ని జిల్లాల పంచాయతీ అధికారులతో మాట్లాడి ఆస్థి పన్ను కలెక్షన్ వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఈ ఆర్థిక సంవత్సరంలో ఇప్పటివరకు మొత్తం 64 కోట్ల 50 లక్షల ఆస్థి పన్నును గ్రామపంచాయతీల పరిధిలో వసూలు చేయగా…ఒక్క శుక్రవారమే 5 కోట్ల 80 లక్షలు వసూలు కావడం విశేషం. మంత్రి జూపల్లి కృష్ణారావు ఆదేశాల మేరకు రాత్రి 11 గంటల వరకు కూడా గ్రామాల్లో ఆస్తి పన్ను వసూలు కేంద్రాలు పనిచేశాయి