* ఎంప్లాయిమెంట్ జనరేషన్ అండ్ మార్కెటింగ్ మిషన్ (ఈజీఎంఎం) పూర్వ విద్యార్థల కన్వెన్షన్ కు హాజరైన పంచాయతీరాజ్ మరియు గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు.
* ఈజీఎంఎం శిక్షణ ద్వారా ఉపాధి అవకాశాలు పొందిన విద్యార్థులతో మాట్లాడిన మంత్రి… ఈజీఎంఎం పూర్వ విద్యార్థుల విజయగాథలతో రూపోందించిన 100 స్మైల్స్ పుస్తకాన్ని ఆవిష్కరించిన మంత్రి జూపల్లి కృష్ణారావు, కమిషనర్ నీతూ ప్రసాద్.
* ఈజీఎంఎం వల్ల మా జీవితాల్లో వెలుగులు నిండాయి. ఉపాధి అవకాశాలు దొరకడంతో నిరుపేద కుటుంబాల నుండి వచ్చిన మాకు మంచి జీవితం లభించిందని కొనియాడిన పూర్వ విద్యార్థులు.
* అన్ని వర్గాల్లో సంతోషం నింపడమే బంగారు తెలంగాణ లక్ష్యం.
* విద్యావ్యవస్థలో దేశవ్యాప్తంగా మార్పులు తేవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. చిన్న చిన్న విషయాలకే ఆత్మ స్థైర్యం కోల్పోయే పరిస్థితుల నుండి విద్యార్థులు బయటపడాలి.
* ప్రతిభ ఉంటే ప్రైవేట్ రంగంలో ఉపాధి అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. నిపుణుల కోసం ప్రైవేట్ కంపనిలు ఎదురుచూస్తున్నాయి.
* తెలంగాణ నూతన పారిశ్రామిక విధానం కారణంగా దాదాపు 50వేల కోట్ల పెట్టుబడులు, లక్షల ఉద్యోగాలు వచ్చాయి.
హైదరాబాద్: చిత్తశుద్ధి ఉంటే ఎంత పెద్ద లక్ష్యాన్నైనా అధిగమించవచ్చని… ఇందుకు ఎంప్లాయిమెంట్ జనరేషన్ అండ్ మార్కెటింగ్ మిషన్ (ఈజీఎంఎం) ద్వారా శిక్షణ పొంది జీవితంలో స్థిరపడ్డ వారే నిదర్శనమని పంచాయతీరాజ్ మరియు గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. తారామతి బారాదరిలో సోమవారం జరిగిన ఎంప్లాయిమెంట్ జనరేషన్ అండ్ మార్కెటింగ్ మిషన్ (ఈజీఎంఎం) పూర్వ విద్యార్థుల కన్వెన్షన్ కు మంత్రి జూపల్లి కృష్ణారావు ముఖ్య అతిధిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఈజీఎంఎం విద్యార్థుల విజయగాథలతో రూపొందించిన 100 స్మైల్స్ పుస్తకాన్ని మంత్రి ఆవిష్కరించారు. అనంతరం విజయం సాధించిన విద్యార్థులను, వారి తల్లి తండ్రులను ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… అంకితభావం, కష్టించే స్వభావం ఉంటే చిత్తశుద్ధితో ఎంతటి లక్ష్యాన్నైనా అధిగమించవచ్చన్నారు. ఇప్పుడున్నన్ని వనరులు, అవకాశాలు లేకపోయినా గ్రామీణాప్రాంత విద్యార్థులే గతంలో ఎంతో ఉన్నత స్థానాలను అలంకరించిన విషయాన్ని గుర్తు చేశారు. ప్రాధాన్యత క్రమంలో ప్రభుత్వాల లక్ష్యాలు లేకపోవడం వల్ల విద్యావ్యవస్థ నాసిరకంగా తయారైందని, దేశ వ్యాప్తంగా విద్యావ్యవస్థలో మార్పులు తీసుకురావల్సిన అవసరం ఉందన్నారు. ప్రైవేట్ రంగంలో ఎన్నో అవకాశాలు ఉన్నాయని, ఆకాశమే హద్దుగా ఎదిగే పరిస్థితి ప్రైవేట్ రంగంలోనే ఎక్కువగా ఉంటుందన్నారు. కమ్యూనికేషన్ స్కిల్స్, భాషా ప్రావీణ్యం ఉంటే ప్రైవేట్ రంగంలో ఉన్నత స్థాయికి చేరుకోవడం పెద్ద కష్టమేమి కాదంటూ.. తన వ్యక్తిగత జీవితంలో సాధించిన విజయాలను ఉదహరించారు. టైపిస్ట్ గా జీవితం ప్రారంభించిన తాను… చేపట్టిన ప్రతి పనిని అంకిత భావంతో చేయడం వల్లే ఈ రోజు మెరుగైన స్థితిలో ఉన్నానని గుర్తు చేసుకున్నారు.
అన్ని వర్గాల్లో సంతోషం నింపడమే బంగారు తెలంగాణ లక్ష్యమని… దీనికోసమే కేసీఆర్ నాయకత్వంలోని ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తుందన్నారు. రాష్ట్రంలోని వనరులన్నింటిని సద్వినియోగం చేసుకునే దిశగా కార్యక్రమాల రూపకల్పన జరుగుతుందన్నారు. నిరుద్యోగులకు ఉపాధి, రాష్ట్ర ఆదాయం పెంచే లక్ష్యంతోనే నూతన పారిశ్రామిక విధానానికి తెలంగాణ ప్రభుత్వం రూపకల్పన చేసిందన్నారు. దీని కారణంగా ఇప్పటికి దాదాపు 50వేల కోట్ల పెట్టుబడులు, 2-3 లక్షల ఉద్యోగాల కల్పన జరిగిందన్నారు. రానున్న రోజుల్లో ప్రైవేట్ రంగంలో 10 లక్షల ఉద్యోగాలను కల్పించే లక్ష్యంతో పనిచేస్తున్నామన్నారు. భవిష్యత్ లో ఈజీఎంఎం ద్వారా మరింత ఎక్కువ మందికి ఉపాధి అవకాశాలు కల్పించేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఉన్న అవకాశాలను, సమయాన్ని సద్వినియోగం చేసుకుంటూ జీవితంలో ఉన్నత స్థాయికి చేరాలన్నారు. కమిషనర్ నీతూ ప్రసాద్ మాట్లాడుతూ… సరైన గైడెన్స్ లేక గ్రామీణ ప్రాంతాల్లో యువత ఉపాధి పొందలేక పోతుందని.. ఇందుకోసం ఈజీఎంఎం ద్వారా ప్రభుత్వ పరంగా సహకారం అందిస్తున్నామన్నారు. గ్రామీణ ప్రాంతలతో పాటు, పట్టణ ప్రాంతాల్లోను అన్ని రంగాల్లో ఉపాధి అవకాశాలు కల్పించేందుకు ఈజీఎంఎం ద్వారా ప్రయత్నిస్తున్నామన్నారు. జాతీయ గ్రామీణాభివృద్ధి సంస్థ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ రవిబాబు మాట్లాడుతూ… తెలంగాణ ఈజీఎంఎం మెరుగైనా పనితీరుతో ఆదర్శవంతంగా పనిచేస్తుందని ప్రశంసించారు.
ఈజీఎంఎం మా జీవితాలను మార్చింది:
ఎలా బతకాలో తెలియని ధైన్య స్థితిలో ఉన్న తమ కుటుంబాల్లో ఈజీఎంఎం శిక్షణ వెలుగు నింపిందని పలువుదు ఉపాధి పొందిన విద్యార్థులు, వారి తల్లి తండ్రులు ఆనందం వ్యక్తం చేశారు. పీవీఆర్, లైఫ్ స్టైల్, కేఎఫ్ సీ, సబ్ వే లాంటి సంస్థల్లో మంచి ఉద్యోగాలు దక్కాయని తమ అనుభవాలను పంచుకున్నారు. ఉపాధి పొందిన పలువురు విద్యార్థులతో మంత్రి మాట్లాడి అభినందించారు. సమావేశంలో ఎమ్మెల్యే అంజయ్య యాదవ్, ఈజీఎంఎం ఈడీ మధుకర్ బాబు తదితరులు పాల్గొన్నారు.