హైదరాబాద్: అనుమతిలేని నిర్మాణాలు, అక్రమ లే అవుట్లపై ఉక్కుపాదం మోపాలని అధికారులను పంచాయతీరాజ్ మరియు గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు ఆదేశించారు.
రంగారెడ్డి జిల్లా కొత్తూరు, కమ్మధనం గ్రామ పంచాయతీల పరిధిలోని లే అవుట్లను కమిషనర్ నీతూకుమారి ప్రసాద్ తో కలిసి పరిశీలించారు. ఆయా గ్రామ పంచాయతీల రికార్డులను పరిశీలించి పాలక వర్గ సభ్యులతో మాట్లాడారు. గ్రామపంచాయతీ రికార్డులు సరిగా నిర్వహించాలని, రిజిస్టర్లను నిర్దేశించిన నమూనాలో పొందుపరచాలి అన్నారు. గ్రామ కార్యదర్శులు గ్రామాలలో ఉదయం నుండి సాయంత్రం వరకు అందుబాటులో ఉండాలన్నారు.
ఇంటి పన్నులు సకాలంలో వసూలు చేయడంతోపాటు… వసూలు చేసిన పన్నులను ట్రెజరీలలో వెనువెంటనే జమచేసేలా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. ప్రజా ధనాన్ని దుర్వినియోగం చేసిన, నిబంధనలు అతిక్రమించినా కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. గ్రామసభలను నిర్వహిస్తూ ప్రజలను అభివృద్ధిలో భాగస్వాములు అయ్యేలా చూడాలని ఆయా గ్రామ పంచాయతీల పాలక వర్గాలకు సూచించారు. గ్రామపంచాయతీ తీర్మాణం చేసిన తరువాతే అభివృద్ధి పనులు చేపట్టాలన్నారు.
అత్యవసర పరిస్థితుల్లో పనులు చేపడితే మాత్రమే…. అనంతరం గ్రామపంచాయతీ తీర్మానము చేసి ఎంబీ రికార్డ్ చేయించాలన్నారు. గ్రామ పంచాయతీ లెక్కలను ప్రియా సాఫ్ట్ వేర్ నందు ఎప్పటికప్పుడు నమోదు చేయడంతో పాటు… నిర్ణీత సమయానుసారం ఆడిట్ చేయించాలని సూచించారు. కమ్మధనంలో 180 ఎకరాల్లో ఏర్పాటు చేసిన లే అవుట్ కు సంబంధించిన పూర్తి వివరాలు అందచేయాలని రంగారెడ్డి జిల్లా డీపీఓను ఆదేశించారు.