వరద నష్టం పరిశీలించే నిమిత్తం కేంద్ర బృందం (Inter Ministerial Central Team) రెండు రోజులు 13 మరియు 14 తేదిలలో జిల్లాలలో పర్యటన
- సుమారు రు. 2,740 కోట్ల నష్టం.
- కేంద్ర బృందానికి రాష్ట్ర ప్రభుత్వ నివేదిక.
రాష్ట్రంలో గత సెప్టెంబర్ మాసంలో కురిసిన భారీ వర్షాల వల్ల సుమారు రు. 2,740 కోట్ల రూపాయల మేర నష్టం సంభవించిoదని, రాష్ట్రానికి ఇతోధిక సహాయం అందించాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డా. రాజీవ్ శర్మ కేంద్ర బృందాన్ని కోరారు. ఆదివారం హరితప్లాజాలో జరిగిన సమావేశంలో ఆయన అకాల వర్షాల వల్ల జరిగిన నష్టాన్ని శాఖల వారీగా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా కేంద్ర బృందానికి వివరించారు.
ఈ సమావేశం లో రెవిన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి శ్రీ ప్రదీప్ చంద్ర, పంచాయత్ రాజ్ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి శ్రీ ఎస్.పి. సింగ్, మునిసిపల్ అడ్మినిస్ట్రేషన్ & అర్బన్ డెవలప్ మెంట్ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి శ్రీ ఎం.జి. గోపాల్, రోడ్లు, భవనాల శాఖ ముఖ్య కార్యదర్శి శ్రీ సునీల్ శర్మ, వ్యవసాయ శాఖ కార్యదర్శి శ్రీ పార్థసారథి, జి.హెచ్.ఎం.సి. కమిషనర్ శ్రీ జనార్దన్ రెడ్డి, జలమండలి (HMWS & SB) మేనేజింగ్ డైరెక్టర్ శ్రీ ఎం. దానకిషోర్, విపత్తుల నిర్వహణ శాఖ స్పెషల్ కమిషనర్ డా. వెంకట రాంరెడ్డి, కేంద్ర బృంద సభ్యులు కేంద్ర హోoశాఖ సంయుక్త కార్యదర్శి శ్రీ దిలీప్ కుమార్, కేంద్ర గ్రామీణ అభివృద్ధి శాఖ సహాయ కమిషనర్ శ్రీ జగదీశ్ కుమార్, ఆర్థిక శాఖ సహాయ సంచాలకులు శ్రీ ఆర్.బి. కౌల్, కేంద్ర వ్యవసాయ శాఖకు చెందిన ఆయిల్ సీడ్స్ డెవలప్ మెంట్ డైరెక్టరేట్ డైరెక్టర్ శ్రీ ఎస్.కె. కోల్హాట్కర్, కేంద్ర నీటి వనరులు, గోదావరి సర్కిల్ పర్యవేక్షక ఇంజనీయరు శ్రీ ఓ.ఆర్.కే. రెడ్డి, రోడ్లు, రవాణా & హై వేస్ రీజినల్ ఆఫీసర్ శ్రీ ఎ. క్రిష్ణప్రసాద్ తో పాటు రాష్ట్ర వ్యవసాయ, ఉద్యానవన, మునిసిపల్, జలమండలి, పoచాయతిరాజ్ శాఖల అధికారులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డా. రాజీవ్ శర్మ మాట్లాడుతూ, సెప్టెంబర్లో 21వ తేది నుండి 27 వతేదీ వరకు కరిసిన భారీ వర్షాల వలన రాష్ట్రంలోని చాలా ప్రాంతాల్లో రోడ్లు దెబ్బతినడం, విద్యుత్ ట్రాన్స్ ఫార్మర్లు కాలిపోవడం, పంట నష్టం జరగడం, ఇళ్ళు కూలిపోవడం, ఇళ్ళు పాక్షికముగా దెబ్బతినడం వంటి వాటి వల్ల సుమారు రు. 2,740 కోట్ల మేర నష్టం సంభవించిందని ఈ మేర సహాయం అందించేలా చూడాలని
కేంద్ర బృందాన్ని కోరారు. ఈ సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా జరిగిన నష్టాన్ని వివిధ శాఖల వారీగా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా కేంద్ర బృందానికి వివరించారు. మునిసిపల్ శాఖకు రు. 848 కోట్లు, వ్యవసాయ శాఖకు రు. 192.77 కోట్లు, నీటిపారుదల శాఖకు రు. 112 కోట్లు, పంచాయత్ రాజ్ శాఖకు రు. 290 కోట్లు మరియు ఇతర శాఖల ద్వారా కలిపి మొత్తం రు. 2,740 కోట్ల మేర నష్టం సంభవించిoదని కేంద్ర బృందానికి ప్రధాన కార్యదర్శి తెలిపారు.
భారీ వర్షాల వలన రాష్ట్రంలోని జరిగిన నష్టానికి తాత్కాలిక రిలీఫ్ క్రింద వీలైనంత ఎక్కువ మొత్తాన్ని మంజూరు చేయడానికి కేంద్ర ప్రభుత్వానికి సిఫారసు చేయగలమని కేంద్ర బృందానికి నాయకత్వం వహించిన కేంద్ర హోo శాఖ సంయుక్త కార్యదర్శి శ్రీ దిలీప్ కుమార్ తెలిపారు.
ఈ సమావేశం అనంతరం కేంద్ర బృందం వర్షాల వల్ల జరిగిన నష్టాన్ని అంచనా వేయడానికి కామారెడ్డి, నిజామాబాదు, సంగారెడ్డి, కరీంనగర్ మరియు సిద్దిపేట జిల్లాలలో పర్యటనకు బయలు దేరివెళ్ళింది. అదేవిధంగా రేపు హైదరాబాదు లో పర్యటించి నష్టాన్ని అంచనా వేయనుంది.