పోలీస్ నియామక పక్రియను వెంటనే చేపట్టాలి- సి.ఎం.

పోలీస్ నియామక పక్రియను వెంటనే చేపట్టాలని రాష్ట్ర ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు.   పోలీస్, వైద్య ఆరోగ్య శాఖలో నియామకాలపై   శుక్రవారం  డా.బీ.ఆర్ . అంబేద్కర్ సచివాలయంలో ఉన్నతస్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమీక్షా సమావేశానికి  రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి, డీజీపీ రవీ గుప్తా, పోలీస్ రిక్రూట్ మెంట్ బోర్డు చైర్మన్ శ్రీనివాస రావు, వైద్య ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి ఎస్.ఎ.ఎం. రిజ్వి, సి.ఎం ఓ అధికారులు శివధర్ రెడ్డి, శేషాద్రి, షా-నవాజ్ కాసీం, ఆర్థిక శాఖా కార్యదర్శి శ్రీదేవి, నగర పోలీస్ కమిషనర్ శ్రీనివాస్ రెడ్డి  తదితరులు పాల్గొన్నారు.

‘ఉద్యోగ నియామకాలను అత్యంత పారదర్శకంగా, ఎలాంటి అవకతవకలకు ఆస్కారం  లేకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు..  నియామకాల ప్రక్రియలో ఉన్న లోటు, పాట్లు, వాటిని వాటిని అధిగమించే అంశాలపై సవివరమైన నివేదిక ఇవ్వాలని అధికారులను సి.ఎం ఆదేశించారు.

తెలంగాణా రాష్ట్రం ఏర్పడిన నాటి నుంచి ఇప్పటి వరకు జరిగిన ఉద్యోగ నియామకాలపై కూడా నివేదిక ఇవ్వాలని కోరారు.  సాధ్యమైనంత త్వరగా పోలీస్ ఉద్యోగ నియామకాల ప్రక్రియను పూర్తి చేయాలని అన్నారు.

పోలీసు, ఆర్టీసీ ఉద్యోగుల పిల్లలకు కోరుకొండ స్కూల్ మాదిరి రెసిడెన్షియల్ పాఠశాల ఏర్పాటు

విధి నిర్వహణలో తీవ్ర పని ఒత్తిడి, ఎక్కువ సమయం విధులు నిర్వహించే పోలీస్, ఆర్టీసీ ఉద్యోగుల పిల్లల విద్య కోసం ప్రత్యేక శ్రద్ధ చూపే అంశంపై సమీక్షా సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి చర్చించారు. పోలీస్ ఉన్నతాధికారుల నుండి కానిస్టేబుల్ వరకు, ఆర్టీసీలో ఉన్నతాధికారుల నుండి కండక్టర్, క్రింది స్థాయి ఉద్యోగుల పిల్లలకు ప్రత్యేక రెసిడెన్షియల్ పాఠశాలలను ఏర్పాటుచేసేందుకు ప్రణాళికలు రూపొందించాలన్నారు. కోరుకొండ సైనిక్ స్కూల్ మాదిరిగా ఈ పాఠశాల ఉండాలన్నారు. ఉత్తర, దక్షణ తెలంగాణా లో ఈ పాఠశాలలు ఏర్పాటు చేసేందుకు తగు ప్రతిపాదనలు సిద్ధం చేయాలని రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు.

పోలీస్ శాఖలో గత ఏడెనిమిదేళ్ళుగా హోమ్ గార్డుల నియామకాలు లేవని, పోలీస్ శాఖలో మరింత సమర్థవంతంగా సేవలు ఉపయోగించుకునేందుకై వెంటనే హోమ్ గార్డుల నియామకాలను చేపట్టాలని సీఎం రేవంత్ రెడ్డి డీజీపీని ఆదేశించారు. హోమ్ గార్డుల ఆరోగ్యం, ఆర్థిక,వైద్య అవసరాలు తీరేలా తగు చర్యలు చేపట్టాలని అన్నారు. హైదరాబాద్ నగరంలో ట్రాఫిక్ క్రమబద్దీకరణ కు హోమ్ గార్డుల సేవలను మరింత విస్తృత స్థాయిలో ఉపయోగించుకోవాలని సూచించారు.

print

By Online News Diary

ONLINENEWSDIARY.COM - A Multilingual Online News Portal

Leave a Reply

Your email address will not be published.