
కర్నూలు/ శ్రీశైలం : సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఎన్.వి. రమణ దంపతులు శ్రీశైల భ్రమరాంబ మల్లికార్జున స్వామి దర్శనం, ప్రత్యేక పూజలు ముగించుకొని సోమవారం మధ్యాహ్నం హైదరాబాదుకు బయలుదేరారు. మధ్యాహ్నం నందిని కేతన్ అతిథి గృహంలో ఎన్.వి. రమణ దంపతులకు రాష్ట్ర దేవాదాయ శాఖ కమిషనర్ యం. హరిజవహర్ లాల్, జిల్లా కలెక్టర్ పి.కోటేశ్వరరావు, ప్రిన్సిపల్ జిల్లా జడ్జి వీఆర్కే కే సాగర్, జిల్లా ఎస్పీ సుధీర్ కుమార్ రెడ్డి, దేవస్థాన కార్యనిర్వహణాధికారి ఎస్ .లవన్న ఘనంగా వీడ్కోలు పలికారు.అంతకుముందు కంచి కామకోటి శంకరమఠంలో
నిర్వహించిన చండీ, రుద్ర హోమాల పూర్ణాహుతి కార్యక్రమంలో సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఎన్.వి. రమణ దంపతులు పాల్గొన్నారు. తెలంగాణ చీఫ్ జస్టిస్ సతీష్ చంద్ర శర్మ దంపతులు, సుప్రీంకోర్టు రిజిస్ట్రార్ ప్రసన్నకుమార్ సూర్యదేవర, ఆంధ్రప్రదేశ్ హైకోర్టు రిజిస్ట్రార్ జనరల్ ఎ.వి. రవీంద్రబాబు, ఎస్సీ ఎస్టీ స్పెషల్ జడ్జి శ్రీమతి విఎయల్ సత్యవతి, మొదటి అదనపు జిల్లా జడ్జి బి. శ్రీనివాస్, ఆత్మకూరు జూనియర్ సివిల్ జడ్జి రాజన్ ఉదయ్ ప్రకాష్ తదితరులు వీడ్కోలు కార్యక్రమంలో పాల్గొన్నారు.
ఈ రోజు తెల్లవారుజామున శ్రీశైల భ్రమరాంబ మల్లికార్జున స్వామి మహా మంగళహారతి దర్శనానికి విచ్చేసిన ఎన్.వి. రమణ దంపతులకు ఆలయ రాజగోపురం వద్ద మంగళవాయిద్యాలతో అర్చక స్వాములు ఆలయ సాంప్రదాయం ప్రకారం స్వాగతం పలికారు. అనంతరం చీఫ్ జస్టిస్ ఎన్.వి. రమణ దంపతులు రత్నగర్భ గణపతి పూజ, శ్రీ మల్లికార్జున స్వామి వారి సుప్రభాత సేవ, మహా మంగళ హారతి కార్యక్రమంలో పాల్గొని, గర్భగుడిలోని మూలవిరాట్ కు మహాన్యాస రుద్రాభిషేకం చేసారు. అనంతరం భ్రమరాంబ అమ్మవారి కుంకుమార్చన కార్యక్రమంలో పాల్గొన్నారు.
అనంతరం వారు వేద పండితుల నుండి ఆశీర్వచనం తీసుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు.
తెలంగాణ చీఫ్ జస్టిస్ సతీష్ చంద్ర శర్మ దంపతులు, సుప్రీంకోర్టు రిజిస్ట్రార్ ప్రసన్నకుమార్ సూర్యదేవర, ఆంధ్రప్రదేశ్ హైకోర్టు రిజిస్ట్రార్ జనరల్ ఎ.వి. రవీంద్రబాబు, రాష్ట్ర దేవాదాయ శాఖ కమిషనర్ యం. హరిజవహర్ లాల్, జిల్లా కలెక్టర్ పి.కోటేశ్వరరావు, ప్రిన్సిపల్ జిల్లా జడ్జి సాగర్, జిల్లా ఎస్పీ సుధీర్ కుమార్ రెడ్డి, ఎస్సీ ఎస్టీ స్పెషల్ జడ్జి శ్రీమతి విఎయల్ సత్యవతి, మొదటి అదనపు జిల్లా జడ్జి బి. శ్రీనివాస్, ఆత్మకూరు జూనియర్ సివిల్ జడ్జి రాజన్ ఉదయ్ ప్రకాష్, దేవస్థాన కార్యనిర్వహణాధికారి లవన్న తదితరులు సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ వెంట వున్నారు.