
శ్రీశైల దేవస్థానం: నిర్వాసితులైన వారికి గృహాలు నిర్మించే అంశాన్ని పరిశీలిస్తానని రాష్ట్ర గృహ నిర్మాణశాఖ మంత్రి చెరుకువాడ. శ్రీరంగనాధరాజు హామీనిచ్చారు.
సోమవారం మంత్రి శ్రీశైలం సందర్శించి శ్రీ భ్రమరాంబామల్లికార్జునస్వామివార్లను దర్శించుకున్నారు.
ఈ సందర్భంగా మంత్రి పలు అంశాలను గురించి దేవస్థానం కార్యనిర్వహణాధికారి కే ఎస్ .రామరావు తో చర్చించారు. కార్యనిర్వహణాధికారి ఈ సందర్భంగా నిర్వాసితుల సమస్యలను మంత్రి దృష్టికి తీసుకువచ్చారు.
సుమారు రెండు వేల మంది నిర్వాసితులు ఉన్నారని, అధికారులతో చర్చించి వారికి న్యాయం చేస్తానని మంత్రి తెలిపారు.
రాష్ట్రంలో సంక్షేమ పథకాలు బాగా అమలు జరిగి, పేద ప్రజలు సుఖసంతోషాలతో మెలగాలని, పంటలు బాగా పండి, రైతులు క్షేమంగా ఉండాలని దేవుడిని ప్రార్థించినట్లు మంత్రి విలేకరులకు తెలిపారు.
రాష్ట్రంలో 30 లక్షల మందికి గృహాలు నిర్మించాలనే ముఖ్యమంత్రి దృఢ సంకల్పమని, ఈ మహత్తర కార్యక్రమం నిర్వహించే బాధ్యత దక్కడం తమ అదృష్టంగా భావిస్తున్నానని మంత్రి తెలిపారు.
కాగా స్వామి అమ్మవార్లను దర్శించుకున్న అనంతరం అమ్మవారి ఆలయ ప్రాంగణంలో రాష్ట్ర గృహనిర్మాణశాఖ మంత్రికి స్వామి అమ్మవార్ల ప్రసాదాలు, జ్ఞాపికను అందించారు.