రాష్ట్ర అటవీ, పర్యావరణ , దేవాదాయ శాఖ మంత్రిగా శ్రీమతి కొండా సురేఖ బాధ్యతలు చేపట్టారు. సచివాలయం నాలుగో అంతస్తులో ఉన్న కార్యాలయంలో (రూమ్ నెంబర్ 410,11,12) కుటుంబ సభ్యులతో కలిసి ప్రత్యేక పూజలు చేసి బాధ్యతలు స్వీకరించారు. దేవాదాయ, అటవీ, కాలుష్య నియంత్రణ మండలి ఉన్నతాధికారులు, సిబ్బంది కార్యక్రమానికి హాజరై మంత్రిని అభినందిచారు. అనంతరం అటవీ శాఖ కార్యక్రలాపాలపై తొలి సమీక్షా సమావేశాన్ని మంత్రి నిర్వహించారు. అటవీ శాఖ ఆధ్వర్యంలో చేపట్టిన పథకాలు, పనులపై అటవీ సంరక్షణ అధికారి (పీసీసీఎఫ్, హెచ్ఓఎఫ్ఎఫ్) ఆర్.ఎం. డోబ్రియల్ పవర్ పాయింట్ ప్రజంటేషన్ ద్వారా వివరించారు. వన్యప్రాణుల దాడుల్లో చనిపోయిన వారి కుటుంబాలకు ఇచ్చే ఎక్స్ గ్రేషియా పెంపుపై మంత్రి కొండా సురేఖ తొలి సంతకం చేశారు. ప్రస్తుతం ఐదు లక్షలుగా ఉన్న పరిహారం పది లక్షలకు ప్రభుత్వం పెంచనుంది. దీనికి సంబంధించిన ఉత్తర్వులు త్వరలో వెలువడుతాయి. వివిధ కార్యక్రమాలు, ఉత్సవాలకు ఏనుగులను ఇతర రాష్ట్రాల నుంచి తెచ్చుకునేందుకు వీలుగా అనుమతిని ఇస్తూ మరో ఫైల్ పై కూడా మంత్రి సంతకం చేశారు. తెలంగాణకు హరితహారం ద్వారా ఇప్పటిదాకా జరిగిన పచ్చదనం పెంపు, వచ్చే ఏడాది లక్ష్యాలపై మంత్రి ఆరా తీశారు. కంపా నిధుల సాధన, ఈ పథకం ద్వారా చేపట్టిన పనులను మంత్రి కొండా సురేఖ అడిగి తెలుసుకున్నారు. అటవీ, దేవాదాయ శాఖలో ప్రస్తుత సిబ్బంది, కొత్తగా నియామకాలకు ఉన్న అవకాశాలను అడిగి తెలుసుకున్నారు. తాను నిత్యం అందుబాటులో ఉంటానని, తన పరిధిలోని శాఖల సిబ్బంది, అధికారులు నిజాయితీగా పనిచేయాలని, జట్టుగా పనిచేసి లక్ష్యాలు సాధిద్దామని, పర్యావరణ రక్షణ, పచ్చదనం పెంపుపై అందురూ కార్యసాధకులుగా పనిచేయాలని మంత్రి పిలుపు నిచ్చారు. త్వరలోనే శాఖల వారీగా పూర్తి స్థాయి సమీక్షా సమావేశాలు చేపడతామని తెలిపారు.
బీసీ సంక్షేమం, రవాణా శాఖమంత్రి పొన్నం ప్రభాకర్, పలువురు ఎమ్మెల్యేలు, రాజకీయ ప్రముఖులు, నియోజక వర్గ నాయకులు, అటవీ, దేవాదాయ, కాలుష్య నియంత్రణ మండలి ఉన్నతాధికారులు, సిబ్బంది కార్యక్రమానికి హాజరై మంత్రిని అభినందించారు.