తిరుపతి 20 సెప్టెంబరు 2021: మస్తిష్క పక్షవాత నిర్ధారణ, చికిత్సలో బర్డ్ ఆసుపత్రిని ముఖ్యమైన కేంద్రంగా తీర్చిదిద్దడానికి చర్యలు తీసుకోవాలని టీటీడీ ఈవో డాక్టర్ కె ఎస్ జవహర్ రెడ్డి అధికారులను ఆదేశించారు.
శ్రీ పద్మావతి అతిథిగృహంలో సోమవారం సాయంత్రం ఆయన బర్డ్ ఆసుపత్రి అభివృద్ధి అంశాలపై సమీక్ష జరిపారు. సెరిబ్రిల్ పాలసీ నిర్ధారణ, చికిత్సకు కావలసిన ఏర్పాట్లకు సంబంధించిన స్థలం, సిబ్బంది ఎంత అవసరమో ముందుగా ఒక అంచనాకు రావాలని అధికారులకు ఈవో సూచించారు. ఆస్పత్రి నిర్వహణ, సాంకేతిక పరిజ్ఞానం వాడుకోవడం, సాఫ్ట్వేర్ తయారీ లాంటి అంశాల పరిశీలన కోసం దేశంలో ఉన్నతమైన ఢిల్లీ ఎయిమ్స్ లాంటి ఆసుపత్రులను పరిశీలించాలని అధికారులను ఆయన ఆదేశించారు.
బర్డ్ లో అవసరమైన మేరకు డాక్టర్లు, పారామెడికల్ సిబ్బందిని నియమించుకోవాలని ఈవో అధికారులకు సూచించారు. సిటి స్కాన్ యంత్రాన్ని వీలైనంత త్వరగా కొనుగోలు చేయాలన్నారు. బర్డ్ లో క్యాంటీన్ ఏర్పాటు కోసం డిజైన్లు సిద్ధం చేయాలని, పాత ఆస్పత్రిలోని వార్డుల ఆధునీకరణకు చర్యలు తీసుకోవాలని చీఫ్ ఇంజనీర్ ను ఆదేశించారు. బర్డ్ కు అవసరమైన మందులు టీటీడీ చీఫ్ మెడికల్ ఆఫీసర్ ద్వారా కాకుండా బర్డ్ ఆస్పత్రి నుంచే కొనుగోలు చేసుకోవడానికి చర్యలు తీసుకోవాలని చెప్పారు.
అదనపు ఈవో ధర్మారెడ్డి, ఎఫ్ ఎ అండ్ సీఎవో బాలాజి, చీఫ్ ఇంజినీర్ నాగేశ్వరరావు, ఆర్ఎంఓ శేష శైలేంద్ర, ఆసుపత్రి ప్రత్యేకాధికారి డాక్టర్ రెడ్డెప్ప రెడ్డి పాల్గొన్నారు.