
శ్రీశైల దేవస్థానం:పవిత్ర శ్రావణ మాసంలో శివస్మరణ అత్యంత విశిష్టమైనది. ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకుని లోక కల్యాణం కోసం ప్రతీ సంవత్సరం శ్రావణ మాసంలో దేవస్థానం శివచతుస్సప్తాహ భజనలు నిర్వహిస్తోంది. అంటే నెల పూర్తిగా రేయింబవళ్లు నిరంతరంగా ఈ భజన సాగుతుంది. ఈ పవిత్ర అఖండ భజనలు శ్రావణమాస ప్రారంభం సందర్భంగా ఆలయప్రాంగణంలోని వీరశిరోమండపంలో 17.08.2023 నుంచి శివసప్తాహ భజనలు ప్రారంభమవుతాయి.
ఈ భజన ప్రారంభంలో ముందుగా లోకకల్యాణాన్ని కాంక్షిస్తూ అర్చకులు సంకల్పాన్ని పఠిస్తారు. అనంతరం భజన కార్యక్రమం నిర్విఘ్నంగా జరగాలని మహాగణపతి పూజను చేస్తారు. ఆ తరువాత శాస్త్రోక్తంగా స్వామిఅమ్మవార్ల ఉత్సవమూర్తులకు విశేషపూజలు చేస్తారు. ఈ పూజల అనంతరం పంచాక్షరీనామ భజనను ప్రారంభిస్తారు.
కాగా కర్నూలు నగరానికి చెందిన అయిదు భజన బృందాలకు, కర్ణాటకకు చెందిన రెండు భజన బృందాలకు ఈ శ్రావణమాస శివ భజనలు చేయడానికి అవకాశం కల్పించారు.
శ్రీసుంకులమ్మదేవి భజన మండలి వారు (17.08.2023 నుండి 24.08.2023వరకు), శ్రీ రామాంజనేయ భజనమండలివారు (21.08.2023 నుండి 28.08.2023 వరకు), శ్రీ చెన్నకేశవ నాటక కళా భజన మండలి రెండు బృందాల వారు ( 28.08.2023 నుండి 04.09.2023), శ్రీ గురునిమిషాంబదేవి భజన మండలి కర్నూలు వారు (04.09.2023 నుండి 11.09.2023), మల్లికార్జున భజన సంఘం,సుమ్కేశ్వారాహాల్, రాయచూరు జిల్లా మరియు ప్రభులింగ సేవా సంఘం గోపన దేవర హళ్లి, కర్ణాటక రాష్ట్రం వారు (08.09.2023 నుండి 15.09.2023 ) పాల్గొంటున్నారు.
కలియుగంలో కేవలం స్మరణతోనే ముక్తి సాధ్యమవుతుందని పురాణాలు చెబుతున్నాయి. నవవిధ భక్తులలో భగవంతుని లీలావిశేషాలను వినడం, ఉచ్చరించడం, తలచడం, భగవంతుని పాదములను సేవించడం, భగవంతుని అర్చించడం, ఆయనకు వందనములు సమర్పించడం, భగవంతునిపట్ల దాస్యభావంతో ఉండడం, భగవంతుని పట్ల సఖ్యభావంతో ఉండటం, చివరికి భగవంతునికి ఆత్మ సమర్పణ చేయడం అనేవి ముఖ్యమైనవి. వీటిలో నామస్మరణ చాలా ప్రాముఖ్యమైంది. ఆలయములలో అటువంటి స్మరణ పూర్వకమైన భజనలను ఏర్పాటు చేయడం వలన భక్తులలో ఆధ్యాత్మికత పెరిగి భక్తులు అలౌకికానందానికి లోనవుతారని, ఆలయ సంప్రదాయానికి మూలమైన ఆగమాలు చెబుతున్నాయి.