శ్రీశైల దేవస్థానం: మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల సందర్భంగా గురువారం సాయంకాలం కార్యనిర్వహణాధికారి ఎం. శ్రీనివాసరావు శివసేవకుల బృందాల నిర్వాహకులతో ప్రత్యేకంగా సమావేశం అయ్యారు.ఈ సమావేశంలో కార్యనిర్వహణాధికారి పలు సూచనలను చేశారు.ఈ సందర్భంగా ఈ ఓ మాట్లాడుతూ శివసేవకులందరూ కూడా అంకిత భావంతో స్వచ్ఛంద సేవలను అందించాలన్నారు.ముఖ్యంగా క్యూ కాంప్లెక్స్, క్యూలైన్లు, ఆలయ ప్రాంగణం, అన్నప్రసాద వితరణ, యాత్రిక సహాయ కేంద్రాలు (హెల్ప్ డెస్క్లు), కల్యాణకట్ట మొదలైన చోట్ల స్వచ్ఛంద సేవకులు ఇతోధికంగా సేవలను అందించాలన్నారు. శివసేవకులందరు కూడా వారికి కేటాయించిన ప్రదేశాలలో ఆయా సేవలను ఎటువంటి లోటుపాట్లు లేకుండా నిర్వర్తించాలన్నారు.ముఖ్యంగా శివసేవకులంతా కూడా సమయ పాలనను పాటించాలన్నారు.
అదేవిధంగా యాత్రికులతో మర్యాదపూర్వకంగా మెలగాలన్నారు. ప్రతి యాత్రికుడిని కూడా దేవస్థానానికి అతిథిగా భావించాలన్నారు.
హెల్ప్ డెస్కులో సేవలు అందించే శివసేవకులు భక్తులు అడిగిన సమాచారాన్ని ఓపికతో తెలియజేయాలన్నారు.
దేవస్థానం అధికారులు, సిబ్బంది అందరు కూడా శివసేవకులకు పూర్తి సహాయ సహకారాలు అందిస్తారన్నారు.
ఈ సమావేశంలో డిప్యూటీ కార్యనిర్వహణాధికారిణి ఆర్.రమణమ్మ, ప్రజాసంబంధాలఅధికారి టి. శ్రీనివాసరావు, భద్రతా విభాగపు పర్యవేక్షకులు సి. మధుసూదన్ రెడ్డి, శివసేవకుల విభాగపు పర్యవేక్షకులు జి. రవి, శివసేవకుల విభాగం సిబ్బంది పాల్గొన్నారు.