*శ్రీశైలం, దోర్నాలలో మంత్రి గొట్టిపాటి రవికుమార్ పర్యటన
*ఆలయ అభివృద్ధిపై అధికారులతో మంత్రి గొట్టిపాటి సమీక్ష
*సబ్ స్టేషన్ నిర్మాణం, భూగర్భ కేబుల్ వ్యవస్థ ఏర్పాటుపై చర్చ
*రథం తిరిగేందుకు వీలుగా పనులు త్వరితగతిన పూర్తికి ఆదేశం
-ఇంధన శాఖ మంత్రి గొట్టిపాటి రవి కుమార్
శ్రీశైలం: శ్రీశైలంకు వచ్చే భక్తుల అవసరాలను దృష్టిలో పెట్టుకొని శ్రీశైలం దేవస్థానానికి ప్రత్యేక విద్యుత్ సబ్ స్టేషన్ నిర్మాణం చేపట్టాలని ఇంధన శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ శాఖాధికారులను ఆదేశించారు. మంగళవారం శ్రీశైలం, దోర్నాల ప్రాంతాల్లో పర్యటించిన మంత్రి గొట్టిపాటి రవికుమార్ ఆలయ అభివృద్ధి పనులు, భక్తుల సౌకర్యాలు, మౌలిక వసతుల కల్పనపై అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా విద్యుత్ శాఖ అధికారులతో ప్రత్యేకంగా సమావేశమై, శ్రీశైలం దేవస్థానానికి సంబంధించిన భూగర్భ కేబుల్ వ్యవస్థ ఏర్పాటుపై విస్తృతంగా మంత్రి చర్చించారు. అలాగే శ్రీశైలం మల్లిఖార్జున స్వామి, అమ్మవార్ల రథం సులభంగా తిరిగేలా అవసరమైన పనులను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలని అధికారులను మంత్రి ఆదేశించారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని ఏర్పాట్లు సమయానికి పూర్తి కావాలని స్పష్టం చేశారు. దోర్నాల వద్ద చెంచు గిరిజనులతో మంత్రి గొట్టిపాటి రవికుమార్ మాటామంతీ నిర్వహించారు. ఈ సందర్భంగా చెంచులు చేసిన విజ్ఞప్తులకు మంత్రి సానుకూలంగా స్పందించారు. గిరిజన తండాలకు ప్రస్తుతం అమలులో ఉన్న సోలార్ విద్యుత్ తరహాలోనే వ్యవసాయ అవసరాలకూ విద్యుత్ అందించే విధానాన్ని పరిశీలిస్తామని హామీ ఇచ్చారు. ఆలయ అభివృద్ధి, మౌలిక వసతులు, గిరిజన సంక్షేమానికి సంబంధించిన అన్ని పనులు మూడు నెలల లోపు పూర్తయ్యేలా తగిన చర్యలు చేపట్టాలని సంబంధిత అధికారులను మంత్రి స్పష్టంగా ఆదేశించారు. ఈ పర్యటనలో ఎమ్మెల్యేలు ఉగ్రనరసింహారెడ్డి, అశోక్ రెడ్డి తదితరులు మంత్రితో కలిసి పాల్గొన్నారు.
