×

ఎలాంటి సమస్యలు తలెత్తకుండా జాగ్రత్త వహించాలి-ఈ ఓ లవన్న

ఎలాంటి సమస్యలు తలెత్తకుండా జాగ్రత్త వహించాలి-ఈ ఓ లవన్న

శ్రీశైల దేవస్థానం:ఎలాంటి సమస్యలు తలెత్తకుండా జాగ్రత్త వహించాలని ఈ ఓ లవన్న ఆదేశించారు. ఈ నెల 26వ తేదీన కార్తీక మాసోత్సవాలు ప్రారంభమయ్యా యి. వచ్చే నెల 23వతేదీతో ఈ మాసోత్సవాలు ముగియనున్నాయి.కార్తీక మాసం లో ఉభయ తెలుగు రాష్ట్రాలు, ఇతర రాష్ట్రాల నుంచి కూడా భక్తులు క్షేత్రాన్ని సందర్శిస్తున్నారు.ముఖ్యంగా సోమవారాలు, ఏకాదశులు మొదలైన పర్వదినాలు,  ప్రభుత్వ సెలవుదినాలలో అధిక సంఖ్యలో భక్తులు క్షేత్రాన్ని సందర్శిస్తారు.ఈ మాసోత్సవాలలో భక్తుల సౌకర్యార్థం వివిధ  ఏర్పాట్లు చేసారు. ఈ మాసోత్సవాల ఏర్పాట్లకు సంబంధించి ఆదివారం  సాయంకాలం కార్యనిర్వహణాధికారి ఎస్.లవన్న సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు.ఈ సమావేశంలో దేవస్థాన అన్ని విభాగాల యూనిట్ అధికారులు, పర్యవేక్షకులు పాల్గొన్నారు. స్థానిక పోలీస్ సర్కిల్ ఇన్స్పెక్టర్  వై. దివాకరరెడ్డి, సబ్ ఇన్స్పెక్టరు  జి. లక్ష్మణరావు, మండల రెవిన్యూ ఇన్ స్పెక్టర్  జి. రవి, ప్రభుత్వ ప్రాథమిక వైద్యశాల వైద్యులు డా. సోమశేఖరయ్య, దేవస్థానం వైద్యశాలలో విధులు నిర్వహిస్తున్న అపోలో వైద్యులు డా. ప్రవీణ్ కుమార్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

 కార్యనిర్వహణాధికారి  మాట్లాడుతూ భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా ఎప్పటికప్పుడు అవసరమైన అన్ని చర్యలు చేపట్టాలన్నారు.ముఖ్యంగా క్యూలైన్లలో వేచివున్న భక్తులకు నిరంతరం మంచినీరు, అల్పాహారం, బిస్కెట్లు అందిస్తుండాలన్నారు. అదేవిధంగా ఉదయం వేళలో వేడిపాలు కూడా అందజేయాలని కూడా ఆదేశించారు.భక్తుల రద్దీకనుగుణంగా అన్నప్రసాద వితరణ ఏర్పాట్లు కూడా చేస్తుండాలన్నారు.క్యూలైన్లలో ఎలాంటి సమస్యలు తలెత్తకుండా జాగ్రత్త వహించాలని క్యూకాంప్లెక్స్,  క్యూలైన్ల నిర్వహణ అధికారులను ఆదేశించారు.

 ముఖ్యంగా ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా ఎప్పటికప్పుడు తగు చర్యలు తీసుకోవాలని ఈ ఓ  సూచించారు. ఆలయ మహాద్వారం వద్ద, అమ్మవారి ఆలయ మెట్ల మార్గం వద్ద ఏర్పాటు చేసిన ప్రథమచికిత్సా కేంద్రంలో తగినన్ని ఔషధాలను సిద్ధంగా ఉంచుకోవాలన్నారు.కార్తీక మాసములో భక్తులు పుణ్యస్నానాలకు ప్రాధాన్యత ఇస్తుంటారని చెబుతూ పాతాళగంగలో అవసరమైన అన్ని ఏర్పాట్లతో పాటు తగు ముందస్తు జాగ్రత్తలు కూడా తీసుకోవాలన్నారు. అవసరం మేరకు అదనంగా కూడా ఈత నిపుణులను ఏర్పాటు చేయాలన్నారు.పారిశుద్ధ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ కనబర్చాలన్నారు. ఎప్పటికప్పుడు చెత్తా చెదారాలను తొలగిస్తుండాలన్నారు. శౌచాలయాల శుభ్రతపట్ల ప్రత్యేక శ్రద్ధ కనబర్చాలన్నారు. ఎలాంటి అంతరాయం లేకుండా నిరంతరం శౌచాలయాలకు నీటి సరఫరా ఉండాలన్నారు.సిబ్బంది అందరు కూడా భక్తులతో మర్యాదగా మెలగాలన్నారు. ఈ విషయమై శివసేవకులకు కూడా తగు సూచనలు చేయాలని ఆయా విభాగాల అధికారులను సూచించారు.

print

Post Comment

You May Have Missed