
శ్రీశైల దేవస్థానం: కార్యనిర్వహణాధికారి ఎస్.లవన్న ఈరోజు (02.11.2021) సాయంకాలం సంబంధిత అధికారులతో కలిసి ఆయా ఏర్పాట్లను పరిశీలించారు. ఈ పరిశీలనలో ఇ .ఇ .మురళీ బాలకృష్ణ, పర్యవేక్షకులు స్వాములు, శివప్రసాద్, రెవెన్యూ ఇన్-స్పెక్టర్లు శ్రీగిరి శ్రీనివాసరెడ్డి, హరికృష్ణారెడ్డి, సహాయ ఇంజనీరులు సీతరమేష్, ఎడిటర్ డా.సి.అనిల్ కుమార్ తదితర సిబ్బంది పాల్గొన్నారు. మెట్ల మార్గం గుండా పాతాళగంగకు చేరుకొని ఈ ఏర్పాట్లను కార్యనిర్వహణాధికారి పర్శీలించారు. ఈ నెల 5వ తేదీ నుండి కార్తికమాసోత్సవాలు ప్రారంభకానున్నాయి. డిసెంబర్ 4వ తేదీతో ఈ మాసోత్సవాలు ముగియనున్నాయి.
కార్తికమాసములో భక్తులు పాతాళగంగలో పుణ్యస్నానాలను ఆచరించేందుకు ప్రాధాన్యాన్నిస్తారు. ముఖ్యంగా ప్రభుత్వ సెలవురోజులు, సోమవారాలు, పౌర్ణమిరోజులలో అత్యధిక సంఖ్యలో భక్తులు పుణ్య స్నానాలను ఆచరించే అవకాశం వుంది.
ఈ కారణంగా కార్తికమాస ఏర్పాట్ల సమీక్షాసమావేశంలో నిర్ణయించినట్లుగా ఇప్పటికే పాతాళగంగలో వివిధ ఏర్పాట్లు జరుగుతున్నాయి.
పాతాళగంగలో మహిళలు దుస్తులు మార్చుకునే గదులకు అవసరమైన మరమ్మతులు జరిగాయి. అదేవిధంగా అక్కడి శౌచాలయాలకు మరమ్మతులు చేసారు.
కార్యనిర్వహణాధికారి మాట్లాడుతూ మెట్ల మార్గం నిరంతరం పరిశుభ్రంగా వుండేందుకు తగు సిబ్బందిని ఏర్పాటు చేసి అవసరమైన చర్యలు చేపట్టాలని పారిసుద్ధ్య విభాగాన్ని ఆదేశించారు.ఇంకా పాతాళగంగ మెట్ల మార్గంలోను, పాతాళగంగ పరిసరాలలో తగినన్ని విద్యుద్దీపాలు ఏర్పాటు చేసి విద్యుద్దీకరణను పెంచాలని కూడా ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు.పాతాళగంగలో ప్రమాదాలు జరగకుండా వుండేందుకు ఎప్పటికప్పుడు బ్యారికేడింగ్ ను పరిశీలిస్తూ వుండాలన్నారు.
పాతాళగంగలో నిరంతరం అప్రమత్తంగా ఉంటూ, అవాంఛనీయ సంఘటనలు జరగకుండా జాగ్రత్త వహించాలని ఈత నిపుణులను ఈ ఓ ఆదేశించారు.పాతాళగంగ స్నానఘట్టాల పరిసరాలను ఎప్పటికప్పుడు శుభ్రపరుస్తూ, ఆ ప్రాంతాన్నంతా పరిశుభ్రంగా ఉంచడం ఎంతో ముఖ్యం అన్నారు.పాతాళగంగ వద్ద మహిళలు దుస్తులు మార్చుకునేందుకు మరిన్ని గదులను ఏర్పాటు చేయాలని ఇంజనీరింగ్ విభాగాన్ని ఆదేశించారు.పాతాళగంగ వద్ద భక్తులు కోవిడ్ నిబంధనలు పాటించే విధముగా అవగాహన కలిగేందుకు ఫిల్మ్ బోర్డులను ఏర్పాటు చేయాలన్నారు.
కార్తిక పౌర్ణమి రోజున పాతాళగంగలో పుణ్యనదీహారతి కార్యక్రమం వుంటుంది. ఈ సందర్భంగా పాతాళగంగ వద్ద నెలకొల్పిన కృష్ణవేణి విగ్రహానికి పూజాదికాలు చేస్తారు. నదీమాతల్లికి పుణ్యనదీహారతి ఇస్తారు.
ఈ పుణ్యనదీహారతి కార్యక్రమానికి కూడా అవసరమైన అన్ని ఏర్పాట్లు చేయాలని సంబంధిత అధికారులను ఈ ఓ ఆదేశించారు. ముఖ్యంగా కృష్ణవేణి విగ్రహం నెలకొల్పిన పీఠానికి పెయింటింగ్ పనులు చేయలన్నారు.భక్తులలో నదీప్రాశస్త్యం పట్ల అవగాహన కల్పించేందుకుగాను నదీహారతి గురించి తగు ప్రచారాన్ని కల్పించాలని శ్రీశైలప్రభ విభాగాన్ని ఆదేశించారు.