
శ్రీశైల దేవస్థానం: భక్తులరద్దీ అధికంగా ఉండడంతో గురువారం కార్యనిర్వహణాధికారి ఎస్. లవన్న క్యూలైన్లు, ఆర్జిత సేవాకౌంటర్లు, విరాళాల సేకరణ కేంద్రం మొదలైనవాటిని ఆకస్మికంగా తనిఖీ చేశారు.
తనిఖీ సమయం లో, రూ. 300/-లు టికెట్లను పొంది, రూ. 500/-ల క్యూలైన్ లో వెళ్ళేందుకు ప్రయత్నిస్తున్న కొందరిని కార్యనిర్వహణాధికారి గమనించి, వారిని అడ్డుకున్నారు.అతిశీఘ్ర దర్శనం రూ. 300/-ల టికెట్లను పొందినవారిని రూ. 500/-ల క్యూలైన్లో అనుమతించిన సెక్యూరిటీ సిబ్బందిని విధుల నుంచి తాత్కాలికంగా నిలుపుదల చేశారు.
ఈ సందర్భంగా కార్యనిర్వహణాధికారి మాట్లాడుతూ ఈ విధంగా నిర్దేశిత క్యూలైన్లో కాకుండా ఇతర క్యూలైన్లలో వెళ్ళడం వల్ల సామాన్య భక్తులకు ఇబ్బంది కలుగుతుందన్నారు. ఇటువంటి చర్యల వలన దేవస్థానం రూపొందించిన దర్శనాల వ్యవస్థ అస్త్యవ్యస్తంగా మారే ప్రమాదం ఉందన్నారు.దేవస్థానం లో సామాన్యభక్తులకు మరిన్ని సౌకర్యాలు కల్పించేందుకు, శీఘ్ర, అతిశీఘ్ర, దర్శనాలు, ఆర్జిత సేవాటికెట్ల జారీ విషయములో పారదర్శకంగా ఉండేందుకు, జవాబుదారితనాన్ని పెంపొందించేందుకే ఇటీవల పలు సంస్కరణలు తెచ్చామన్నారు.ముఖ్యంగా సామాన్య భక్తుడికి, సర్వదర్శనం భక్తులకు శీఘ్రదర్శనం, అతిశీఘ్రదర్శనం ఇతర భక్తులకు కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా సౌకర్యవంతమైన దర్శనం కల్పించేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు.సంబంధిత అధికారులంతా కూడా నిరంతరం దర్శనం క్యూలైన్లు, క్యూకాంప్లెక్స్, ఆర్జిత సేవాకౌంటర్లు, టికెట్ కౌంటర్లు మొదలైన వాటిని నిరంతరం పర్యవేక్షిస్తుండాలన్నారు.అధికారులందరు కూడా పరస్పర సమన్వయం తో విధులు నిర్వర్తించాలన్నారు.అక్రమంగా దర్శనాలు చేసుకొనేందుకు యత్నించిన కొందరు కార్యనిర్వహణాధికారివారి ఆకస్మిక తనిఖీని చిత్రీకరించి సామాజిక మాధ్యమాలలో దుష్ప్రచారం చేస్తున్నారన్నారు.భక్తులందరు కూడా అపోహాలకు లోనుకాకుండా వాస్తవ విషయాలను గ్రహించాలని పేర్కొన్నారు. క్యూకాంప్లెక్స్ లో నిరంతరం మంచినీరు, బిస్కెట్లు, అల్పాహారాలు అందిస్తుండాలని సంబంధిత అధికారులను సూచించారు.దర్శనం వేళలు, దర్శనానికి పట్టే సమయం మొదలైన అంశాలను నిరంతరం ఆలయ ప్రసార వ్యవస్థ ద్వారా ప్రసారం చేస్తుండాలన్నారు. వారాంతపు సెలవులు, పర్వదినాలలో ఉదయం వేళల్లో వేడిపాలను కూడా అందించాలన్నారు.