శ్రీశైలదేవస్థానం:అత్యవసర వైద్యం అందించేందుకు సిద్ధంగా ఉండాలని ఈ ఓ ఆదేశించారు. పరిపాలనాంశాలలో భాగంగా గురువారం కార్యనిర్వహణాధికారి దేవస్థాన వైద్యశాలను పరిశీలించారు.ఈ సందర్భంగా ఈ ఓ మాట్లాడుతూ వైద్యశాలలో మెరుగైన వైద్యసేవలను అందించాలని వైద్యులకు సూచించారు. ఏ సమయములోనైనా అత్యవసర వైద్యం అందించేందుకు సిద్ధంగా ఉండాలన్నారు. స్థానికులకు, యాత్రికులకు అవసరమైన వైద్యసేవలను అందించడం పట్ల ప్రత్యేకశ్రద్ధ కనబర్చాలని వైద్యవిభాగాన్ని ఆదేశించారు.అదేవిధంగా వైద్యశాలకు అవసరమైన ఆధునిక వైద్యపరికరాలు కూడా వెంటనే కొనుగోలు చేయాలని కూడా ఆదేశించారు.
ముఖ్యంగా వైద్యం కోసం వచ్చే రోగుల సంఖ్యకనుగుణంగా దేవస్థానం వైద్యశాలలో ఆయా ఔషధాలను అందుబాటులో ఉంచాలని వైద్యవిభాగాన్ని ఈ ఓ ఆదేశించారు. గుండెజబ్బులు మొదలైనవాటికి సంబంధించిన అత్యవసర ఔషధాలు కూడా అందుబాటులో ఉంచుకోవాలన్నారు. ఎప్పటికప్పుడు వైద్యశాలకు అవసరమైన ఆయా ఔషధాల జాబితాను సంబంధిత అధికారులకు అందజేస్తుండాలని వైద్యులకు సూచించారు.
దేవస్థానం వైద్యశాలను మరింతగా అభివృద్ధి పరిచి, ఇంకా మెరుగైన సేవలు అందించేందుకు చేపట్టాల్సిన చర్యల గురించి దేవస్థానం వైద్యశాలలో విధులు నిర్వహిస్తున్న అపోలో వైద్యులు , ఇంజనీరింగ్ అధికారులతో చర్చించారు.
ఈ పరిశీలనలో ఎగ్జిక్యూటీవ్ ఇంజనీరు ఎం.నరసింహారెడ్డి, సహాయ ఇంజనీర్లు పాల్గొన్నారు.