
శ్రీశైల దేవస్థానం: ఆర్జితపరోక్షసేవగా శ్రీశైల క్షేత్రపాలకుడైన శ్రీబయలువీరభద్రస్వామి వారికి విశేషార్చన ఈ రోజు (06.09.2021) న జరిగింది.ఈ రోజు సాయంకాలానికి అమావాస్య ఘడియలు ఉండడం తో ఈ పరోక్షసేవలో భక్తులు పాల్గొనే అవకాశం కల్పించారు.
మొత్తం 105 మంది భక్తులు ఆన్లైన్ ద్వారా నేవా రుసుమును చెల్లించి ఈ పరోక్షసేవను జరిపించుకున్నారు.
ఉభయ తెలుగు రాష్ట్రాల నుండే కాకుండా కర్ణాటక, మహారాష్ట్ర, తమిళనాడు, ఉత్తరప్రదేశ్, రాజస్తాన్, పశ్చిమ బెంగాల్, మొదలైన ఇతర రాష్ట్రాల నుంచి, ప్రవాహ భారతీయులు కూడా ఈ పూజలను జరిపించుకుంటున్నారు.
ఈ రోజు సాయంకాలం గం. 5.30 నుండి ఈ విశేషపూజ ప్రారంభమైంది. కాగా కార్యక్రమం నిర్విఘ్నంగా జరిగేందుకు మహాగణపతిపూజను జరిపారు.
ఈ పూజాదికాలలో పంచామృతాలతోనూ, బిల్వోదకం, కుంకుమోదకం, హరిద్రోదకం, భస్మోదకం, గంధోదకం, పుష్పోదకం, శుద్ధజలాలతో స్వామివారికి అభిషేకం నిర్వహించారు.
ఈ స్వామి ఆరాధన వలన గ్రహదోషాలు నివారించబడుతాయని, అరిష్టాలన్నీ తొలగి పోతాయని, ఎంతటి క్లిష్ట సమస్యలైనా పరిష్కరించబడతాయని, ప్రమాదాలు నివారించ బడతాయని, సర్వకార్యానుకూలత లభిస్తుందని, అభీష్టాలు సిద్ధిస్తాయని పండితులు పేర్కొంటున్నారు.
బయలువీరభద్రస్వామివారికి నిత్యపూజాదికాలతో పాటు లోకకల్యాణార్థం దేవస్థానం ప్రతి మంగళవారం , అమావాస్య రోజులలో విశేష పూజాదికాలను నిర్వహిస్తుంది.
ప్రస్తుతం అమావాస్య నాడు నిర్వహించే పూజలో భక్తులు కూడా పరోక్షసేవ ద్వారా పాల్గొనే అవకాశం కల్పించారు. ప్రతీనెలలో కూడా అమావాస్యరోజున ప్రదోషకాలములో భక్తులు ఈ పూజాదికాలను పరోక్షసేవ ద్వారా భక్తులు జరిపించుకోవచ్చు.
ఈ పరోక్షసేవకు భక్తులు ఆన్లైన్ ద్వారా రూ.1,116/-లను సేవారుసుముగా చెల్లించాల్సి ఉంటుంది. భక్తులు సేవారుసుమును www.srisalladevasthanam.org లేదా http://aptemples.ap.gov.in ద్వారా చెల్లింపు చేయవచ్చు.
ఈ పరోక్షసేవ ప్రత్యక్ష ప్రసారాలను వీక్షించేందుకు వీలుగా ప్రసార వివరాలు, ప్రసారాల సమయం మొదలైనవాటిని ఎప్పటికప్పుడు సేవాకర్తలకు తెలుపుతున్నారు.
సేవాకర్తలేకాకుండా భక్తులందరు కూడా వీటిని శ్రీశైలటి.వి | యూ ట్యూబ్ ద్వారా వీక్షించవచ్చును.
భక్తులందరు కూడా ఈ పరోక్షసేవను సద్వినియోగం చేసుకోవాలని దేవస్థానం కోరుతోంది.
ఇతర వివరాలకు దేవస్థానం సమాచార కేంద్ర ఫోన్ నంబర్లు 83339 01351/ 52 | 53 / 54/55/56 లను సంప్రదించవచ్చును.