తెలంగాణ ముఖ్యమంత్రి శ్రీ కె. చంద్రశేఖర్ రావు గారి క్యాంపు కార్యాలయం ఉయ్యాల పాటలతో మార్మోగింది. తెలంగాణ పూల పండుగ సిఎం అధికారిక నివాసంలో సందడి చేసింది. తెలంగాణతో పాటు ముంబయ్, సూరత్, ఢిల్లీలో అదేవిధంగా విదేశాల్లోనూ అంగరంగ వైభవంగా కొనసాగుతున్న తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగ నేడు బేగంపేట్ లోని ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో కన్నుల పండువగా జరిగింది. ఆద్యంతం ఉత్సాహంగా సాగిన ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి శ్రీ కె. చంద్రశేఖర్ రావు గారి సతీమణీ శ్రీమతి శోభ తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, నిజామాబాద్ ఎంపీ శ్రీమతి కల్వకుంట్ల కవిత గార్లతో పాటు డిప్యూటి స్పీకర్ శ్రీమతి పద్మాదేవేందర్ రెడ్డి, మంత్రుల సతీమణులు శ్రీమతి సునీత జగదీష్ రెడ్డి, శ్రీమతి ఈటెల జమున, శ్రీమతి తన్నీరు శ్రీనిత హరీష్ రావు, శ్రీమతి కల్వకుంట్ల శైలిమ రామారావు, శ్రీమతి అల్లోల విజయ లక్ష్మీ, శ్రీమతి చెర్లకోల శ్వేతా లక్ష్మారెడ్డి, తలసాని స్వర్ణ గార్లతో పాటు రంగారెడ్డి, కరీంనగర్ జిల్లా పరిషత్ చైర్ పర్సన్లు శ్రీమతి సునీత మహేందర్ రెడ్డి, శ్రీమతి తూల ఉమ గార్లతో పాటు సిఎం కుటుంబ సభ్యులు, బంధువులు, క్యాంపు కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు.
‘‘పొదల పొదల గట్ల నడుమ నాగమల్లేదారిలో’’ అంటు క్యాంపు కార్యాలయ మహిళా సిబ్బందితో కలిసి సిఎం సతీమణి, ఎంపి కవిత, మంత్రుల సతీమణులు ఆడి పాడారు. గౌరమ్మకు ప్రత్యేక పూజలు చేశారు. అంతకు ముందు ఉదయం బతుకమ్మలను పాటలు పాడుతూ ఉత్సాహ పూరిత వాతావరణంలో పేర్చారు. సిఎం క్యాంపు కార్యాలయ ప్రాంగణంలో జరిగిన బతుకమ్మ వేడుకలను మంత్రి కెటి. రామారావు కాసేపు ఆసక్తిగా తిలకించారు.