శ్రీశైల దేవస్థానం: శ్రీశైల క్షేత్రాన్ని ప్లాస్టిక్ రహిత ప్రాంతంగా తీర్చిదిద్దేందుకు దేవస్థానం కృత నిశ్చయంతో ఉందని ఈ ఓ ఎస్.లవన్న చెప్పారు. శ్రీశైలక్షేత్ర పరిధిలో ప్లాస్టిక్ కవర్ల నిషేధంపై ఈ రోజు (16.11.2021) న కార్యనిర్వహణాధికారి అవగాహన సదస్సు నిర్వహించారు.
దేవస్థానం పరిపాలనా భవనం లోని సమావేశమందిరం లో జరిగిన ఈ అవగాహన కార్యక్రమం లో దేవస్థానం అధికారులు, స్థానిక వ్యాపారులు హోటళ్ళ నిర్వాహకులు పాల్గొన్నారు.
ఈ అవగాహన కార్యక్రమం లో ఎకోలాస్టిక్ (ecolastic) హైదరాబాద్ వారి ప్రతినిధులు కూడా కార్యక్రమానికి వచ్చి ప్లాస్టిక్ వాడకం వలన జరిగే అనర్థాలు , ప్లాస్టిక్ స్థానంలో compostable carry బ్యాగుల వినియోగ ఆవశ్యకత మొదలైన అంశాల గురించి వివరించారు.
ఈ సందర్భంగా కార్యనిర్వహణాధికారి మాట్లాడుతూ శ్రీశైల క్షేత్రాన్ని ప్లాస్టిక్ రహిత క్షేత్రంగా తీర్చిదిద్దేందుకు దేవస్థానం కృత నిశ్చయంతో ఉందన్నారు. ఇందుకు అవసరమైన ప్రత్యామ్నాయం ఏర్పాటు కూడా దేవస్థానం చేస్తుందన్నారు.ఈ దేవస్థానం కూడా తిరుమల తిరుపతి దేవస్థానంలో వినియోగిస్తున్న ప్రత్యామ్నాయ క్యారీ బ్యాగులను వినియోగించాలని భావిస్తున్నదని అన్నారు. త్వరలోనే ఈ కవర్ల వాడకానికి చర్యలు తీసుకుంటామన్నారు.
స్థానిక వ్యాపారులు కూడా ప్లాస్టిక్ కవర్ల స్థానం లో compostable carry( మట్టిలో కలిసిపోయే ) బ్యాగులను వినియోగించవచ్చన్నారు ఈ ఓ.
ప్లాస్టిక్ కవర్లు నిషేధించేందుకు స్థానిక వ్యాపారులు, హోటళ్ళ నిర్వాహకులు సహకరించాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. అందరి సమిష్టి కృషితోనే స్వచ్ఛశ్రీశైలాన్ని సాధించగలమన్నారు ఈ ఓ.
క్షేత్రపరిధిలో నివసించే స్థానికులు, హోటళ్ల నిర్వాహకులు, దుకాణాల వారు ప్లాస్టిక్ కవర్ల వినియోగాన్ని స్వచ్ఛందంగా నిరోధించాలన్నారు. కేవలం ఎవరికి వారు ఈ నియమాన్ని పాటించడం వలనే ప్లాస్టిక్ నిషేధించగలమన్నారు.అదేవిధంగా తడిచెత్త – పొడిచెత్తలను వేరు వేరు చెత్తకుండిలలో వేయాల్సిన అవసరం కూడా ఎంతైనా ఉందన్నారు.ఈ విషయమై కూడా దేవస్థానం అందరిలో అవగాహన కల్పించి తగు చర్యలు చేపడుతుందన్నారు.
స్థానికులందరు కూడా పండ్ల తొక్కలు, నిరుపయోగ భోజన పదార్థాలు, రాలిన ఆకులు, కూరగాయలు వ్యర్థాలు మొదలైనవి తడిచెత్తగా గుర్తించాలన్నారు ఈ ఓ.
అదేవిధంగా వినియోగించిన మంచినీళ్ల బాటిళ్లు, ప్లాస్టిక్ కవర్లు, కప్పులు, పాలు, పెరుగు కవర్లు మొదలైన వాటిని పొడి చెత్తగా గుర్తించాలన్నారు.
అదేవిధంగా వైద్యశాలలో బ్యాండేజ్ వ్యర్థాలు, ఇంకా ఔషధ వ్యర్థాలు, వినియోగింబడిన బ్లేడ్లు,రేజర్లు మొదలైనవాటిని ప్రమాదకరమైన చెత్తగా గుర్తించాలన్నారు. వీటిని వేరువేరుగా ఉంచడం వలన దేవస్థాన చెత్త సేకరణదారులకు వేరు వేరుగా వీటిని సేకరించే అవకాశం ఉంటుందన్నారు.
ఈ అవగాహన కార్యక్రమములో ఎగ్జిక్యూటీవ్ ఇంజనీరు మురళీ బాలకృష్ణ, సహాయ కార్యనిర్వహణాధికారులు నటరాజరావు, ఫణిధరప్రసాద్, హరిదాస్, డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్లు నరసింహారెడ్డి, శ్రీనివాసరెడ్డి, పర్యవేక్షకులు శివప్రసాద్, ఎడిటర్ డా.సి.అనిల్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.