
శ్రీశైలదేవస్థానం :శ్రీశైల మహాక్షేత్రంలో ఉగాది మహోత్సవాలు ఏప్రిల్ 6 నుంచి 10 వరకు జరుగనున్నాయి. ఉగాది పర్వదినం 9 న రానున్నది.
ఈ ఉత్సవాలకు కర్ణాటక రాష్ట్రం నుండి ముఖ్యంగా ఉత్తర కర్ణాటక ప్రాంతం నుండి మహారాష్ట్రలోని షోలాపూర్, సాంగ్లీ తదితర ప్రాంతాల భక్తులు తరలివస్తారు. వీరిలో పలు ప్రాంతాల భక్తులు పాదయాత్రతో శ్రీశైలం రావడం విశేషం.
ఈ కారణంగా కర్ణాటక, మహారాష్ట్ర ప్రాంతంలోని పలు భక్తసంఘాలు, పాదయాత్ర బృందాలు , స్వచ్ఛంద సేవా సంస్థల ప్రతినిధులతో దేవస్థానం గురువారం సాయంత్రం సమావేశాన్ని ఏర్పాటు చేసింది.
బాగల్కోట్ జిల్లా రబ్కవి పట్టణంలో శ్రీదానేశ్వరీ కల్యాణ మండపంలో ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసారు.
శ్రీశైల జగద్గురు పీఠాధిపతి శ్రీశ్రీశ్రీ చెన్నసిద్దరామ శివాచార్య మహాస్వామివారు కూడా ఈ సమావేశంలో పాల్గొని అనుగ్రహభాషణం చేశారు.
ఈ కార్యక్రమములో సహాయ కార్యనిర్వహణాధికారి ఐ.ఎన్.వి. మోహన్, శ్రీస్వామివార్ల ఉపప్రధానార్చకులు ఎం. శివశంకరయ్యస్వామి, పర్యవేక్షకులు ఎం. హరియనాయక్, పలువురు అర్చకులు, వేదపండితులు తదితరులు పాల్గొన్నారు.
ఈ సమావేశంలో అధికారులు మాట్లాడుతూ శ్రీశైల దేవస్థానం పక్షాన కన్నడ ప్రాంతానికి విచ్చేసి, శ్రీస్వామిఅమ్మవార్ల భక్తాదులతో సంభాషించే అవకాశం రావడం ఎంతో ఆనందంగా ఉందన్నారు.
ముఖ్యంగా ఉగాది మహోత్సవాలలో భక్తులందరికీ స్వామివారి అలంకార దర్శనం మాత్రమే ఉంటుందని అన్నారు. ఉత్సవ రోజులలో స్వామివారి స్పర్శదర్శనానికి అవకాశం ఉండదని తెలియజేశారు.
ఉత్సవం ముందు రోజులలో 10 రోజుల ముందునుంచి , 27.03.2024 నుండి 05.04.2024 వరకు నిర్దిష్ట వేళలలో నాలుగు విడతలుగా భక్తులకు శ్రీస్వామివారి స్పర్శదర్శనానికి అవకాశం కల్పిస్తారు. ఈ స్పర్శదర్శనం టికెట్ రుసుము రూ. 500.00లుగా నిర్ణయించారు.
శ్రీశైలక్షేత్ర సంస్కృతీ సంప్రదాయాలలో కన్నడ ప్రాంతానికి ఎంతో విశిష్టస్థానం ఉందని తెలుపుతూ, కన్నడ భక్తులు శ్రీభ్రమరాంబాదేవివారిని తమ ఆడపడుచుగా, శ్రీమల్లికార్జునస్వామివార్లను తమ అల్లునిగా భావిస్తారన్నారు.
ఇటీవల కాలంలో 11 రోజులపాటు మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు ఎంతో వైభవంగా జరిగాయని , ఇదే పంథాలో ఉగాది మహోత్సవాలను కూడా నిర్వహిస్తామన్నారు.
ముఖ్యంగా కాలిబాటలో వచ్చే భక్తులకు అవసరమైన మంచినీరు, మార్గమధ్యంలో దాతల సహకారంతో అన్నదాన ఏర్పాట్లను చేయనున్నామన్నారు.
సామాన్య భక్తుల సౌకర్యార్థం క్షేత్రపరిధిలోని ఆరు బయలు ప్రదేశాలలో విశాలమైన చలువ పందిర్లను వేయనున్నామని, భక్తులందరు ఈ చలువపందిర్లలో సేద తీరవచ్చన్నారు.
అదేవిధంగా క్షేత్రంలో పలుచోట్ల స్నానపు గదులను, మూత్రశాలలను, మరుగుదొడ్లను భక్తులకు అందుబాటులోకి తెచ్చామన్నారు. భక్తులు వీటిని వినియోగించుకోవచ్చునని పేర్కొన్నారు.
ఇక పాతాళగంగలో నీటిమట్టం తగ్గే అవకాశం ఉన్నందున పాతాళగంగలోనూ, క్షేత్రపరిధిలో పలుచోట్ల షవరుబాతులకు ( జల్లు స్నానాలకు) ఏర్పాట్లు చేస్తామన్నారు.అదేవిధంగా ఎప్పటి వలే కాలిబాట మార్గములో భక్తులకు దేవస్థానం మంచినీటి సరఫరా మొదలైనవి ఏర్పాట్లు ఉంటాయన్నారు.
ఉగాది మహోత్సవాలలో పలు భక్తబృందాల వారు క్షేత్రపరిధిలో అన్నదానాలు చేయడం జరుగుతోందన్నారు. అన్నదానం చేసే భక్త బృందాల వారికి దేవస్థానం తరుపున సంపూర్ణ సహాయ సహాకారాలను అందిస్తుందన్నారు.
భక్తులందరు దేవస్థానానికి సహకరించి తమ శ్రీశైలయాత్రను శుభప్రదం చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానన్నారు.తరువాత జగద్గురు పీఠాధిపతి శ్రీ చెన్నసిద్ధశివాచార్య మహాస్వామివారు మాట్లాడుతూ ఉత్సవాలలో దేవస్థానం సిబ్బందికి కన్నడ భక్తులందరు సహకరించాలని పేర్కొన్నారు.
*Dharma Pracharam In Rabkavi.