ఉగాది మహోత్సవాలను విజయవంతం చేద్దాం-

 శ్రీశైలదేవస్థానం:శ్రీశైల మహాక్షేత్రంలో ఉగాది మహోత్సవాలు 27.03.2025 నుండి 31.03.2025 వరకు జరుగనున్నాయి. ఉగాది పర్వదినం 30న  రానున్నది.

ఈ ఉత్సవాలకు కర్ణాటక రాష్ట్రం నుండి ముఖ్యంగా ఉత్తర కర్ణాటక ప్రాంతం నుండి మహారాష్ట్రలోని షోలాపూర్, సాంగ్లీ తదితర ప్రాంతాల భక్తులు తరలివస్తారు. వీరిలో పలు ప్రాంతాల భక్తులు పాదయాత్రతో శ్రీశైలం రావడం విశేషం.

ఈ సందర్భంగా శనివారం కర్ణాటక రాష్ట్రములోని విజయపుర ( బీజాపూర్) నగరములో భక్త బృందాలు, స్వచ్ఛందసేవా సంస్థలతో సమన్వయ సమావేశం జరిగింది.

ఈ సమన్వయ సమావేశాన్ని పురస్కరించుకుని విజయపుర నగరములో దేవస్థానం ధర్మ ప్రచార రథంతో శోభాయాత్ర నిర్వహించారు. అదేవిధంగా ఈ సాయంకాలం శ్రీస్వామిఅమ్మవార్ల కల్యాణోత్సవం జరిగింది. 

కాగా ఈ రోజు ఉదయం విజయపుర నగరంలోని సిద్ధేశ్వరస్వామి ఆలయం, దానమ్మదేవి ఆలయం, శంకరలింగ దేవస్థానం, కాళమ్మ ఆలయం నుంచి గాంధీ సర్కిల్ మార్కెట్ మీదుగా శోభాయాత్ర జరిపారు.

ఈ శోభాయాత్రకు ముందుగా శ్రీశైల జగద్గురు పీఠాధిపతి శ్రీశ్రీశ్రీ చెన్నసిద్దరామ శివాచార్య మహాస్వామివారు ప్రచార రథంలో వేంచేబు చేయించిన శ్రీస్వామిఅమ్మవార్లకు ప్రత్యేక పూజలు నిర్వహించి శోభాయాత్రను ప్రారంభించారు.

 ప్రత్యేకంగా వంద మందికిపైగా మహిళలు కలశాలను ధరించి ఈ శోభాయాత్రలో పాల్గొనడం విశేషం.

శోభాయాత్ర అనంతరం కర్ణాటక, మహారాష్ట్ర ప్రాంతంలోని పలు భక్తసంఘాలు, పాదయాత్ర బృందాలు మరియు స్వచ్ఛంద సేవా సంస్థల ప్రతినిధులతో దేవస్థానం ఈ రోజు  మధ్యాహ్నం సిద్ధేశ్వరస్వామి ఆలయం వద్ద ప్రత్యేకంగా సమన్వయ సమావేశాన్ని నిర్వహించారు.

శ్రీశైల జగద్గురు పీఠాధిపతి శ్రీశ్రీశ్రీ చెన్నసిద్దరామ శివాచార్య మహాస్వామివారు కూడా ఈ సమావేశంలో పాల్గొని అనుగ్రహభాషణం చేశారు.

ఈ సందర్భంగా జగద్గురు పీఠాధిపతి  ప్రసంగిస్తూ దేవస్థానం వారు భక్తుల కోసం  ఆయా దర్శన ఏర్పాట్లను చేయడం జరుగుతుందన్నారు. ఉగాది ఉత్సవాలలో ప్రతీరోజు వేలాది మంది భక్తులు ఆలయానికి రావడం జరుగుతోందన్నారు. భక్తులు అధికసంఖ్యలో ఉంటున్న కారణంగా ఉత్సవాల రోజులలో శ్రీస్వామివారి స్పర్శదర్శనానికి అవకాశం ఉండదన్నారు.

ఈ కారణంగా ఉత్సవ రోజులలో దేవస్థానం వారు శ్రీస్వామివారి అలంకార దర్శనం మాత్రమే కల్పించడం జరుగుతోందన్నారు. గత కొన్ని సంవత్సరాలుగా భక్తుల సౌకర్యార్థమై దేవస్థానం ఈ విధానాన్ని అనుసరించడం జరుగుతోందన్నారు.

అయినప్పటికీ ఉత్సవాలకు ముందు 10 రోజులపాటు అనగా 17.03.2025 నుంచి 26.03.2025 వరకు రోజుకు నాలుగు విడతలుగా దేవస్థానం వారు నిర్దిష్ట వేళలో స్పర్శదర్శానానికి అవకాశం కల్పించడం జరిగిందన్నారు.భక్తులు దేవస్థానం నిర్దేశించిన రోజులలో శ్రీస్వామివారి స్పర్శదర్శనాన్ని చేసుకోవచ్చునని అన్నారు.

పీఠాధిపతి మాట్లాడుతూ భక్తులందరు కూడా సంయమనం పాటిస్తూ శ్రీస్వామిఅమ్మవార్లను దర్శించుకోవాలన్నారు. అదేవిధంగా దేవస్థానం కల్పించిన ఆయా సదుపాయాలను వినియోగించుకోవాలన్నారు. ముఖ్యంగా భక్తులందరు కూడా దేవస్థానానికి సహకరించాలన్నారు. పాదయాత్ర చేసే భక్తులు ఆరోగ్యంపట్ల కూడా తగు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు.

ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఉండేందుకు మరియు ఉత్సవాలు విజయవంతం చేసేందుకు భక్తులందరూ కూడా సహకరించాలన్నారు.

అనంతరం దేవస్థానం కార్యనిర్వహణాధికారి  యం. శ్రీనివాసరావు  సమావేశానికి పంపిన ప్రసంగపాఠాన్ని శ్రీశైలప్రభ సహాయ సంపాదకులు  కె.సత్యబ్రహ్మచార్య కన్నడలో అనువదించి తెలియజెప్పారు.

ఈ ప్రసంగంలో శ్రీశైలక్షేత్ర సంస్కృతీ సంప్రదాయాలలో కన్నడ ప్రాంతానికి ఎంతో విశిష్టస్థానం ఉందని తెలుపుతూ, కన్నడ భక్తులు శ్రీభ్రమరాంబాదేవివారిని తమ ఆడపడుచుగా, శ్రీమల్లికార్జునస్వామివార్లను తమ అల్లునిగా భావిస్తారన్నారు.ఇటీవల కాలంలో 11 రోజులపాటు మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలను ఎంతో వైభవంగా జరిపారని , ఇదే పంథాలో ఉగాది మహోత్సవాలను కూడా నిర్వహించడం జరుగుతుందన్నారు.అదేవిధంగా ఎప్పటి వలే కాలిబాట మార్గములో భక్తులకు దేవస్థానం మంచినీటి సరఫరా మొదలైన ఏర్పాట్లు చేయడం జరుగుతుందన్నారు. ముఖ్యంగా కాలిబాటలో వచ్చే భక్తులకు అవసరమైన మంచినీరు, మార్గమధ్యంలో దాతల సహకారంతో అన్నదాన ఏర్పాట్లను చేస్తున్నట్లుగా పేర్కొన్నారు.సామాన్య భక్తుల సౌకర్యార్థం క్షేత్రపరిధిలోని ఆరుబయలు ప్రదేశాలలో విశాలమైన చలువ పందిర్లను వేయడం జరుగుతుందని, భక్తులందరు ఈ చలువపందిర్లలో సేద తీరవచ్చన్నారు.అదేవిధంగా క్షేత్రంలో పలుచోట్ల స్నానపు గదులను, మూత్రశాలలను, మరుగుదొడ్లను భక్తులకు అందుబాటులోకి తెచ్చామన్నారు. భక్తులు వీటిని వినియోగించుకోవచ్చునని పేర్కొన్నారు.ఇక పాతాళగంగలో నీటిమట్టం తగ్గే అవకాశం ఉన్నందున పాతాళగంగలోనూ, క్షేత్రపరిధిలో పలుచోట్ల షవరుబాతులకు ( జల్లు స్నానాలకు) ఏర్పాట్లు చేయడం జరుగుతుందన్నారు.

ఉగాది మహోత్సవాలలో పలు భక్తబృందాల వారు క్షేత్రపరిధిలో అన్నదానాలు చేయడం జరుగుతోందన్నారు. అన్నదానం చేసే భక్త బృందాల వారికి దేవస్థానం తరుపున సంపూర్ణ సహాయ సహాకారాలను అందించడం జరుగుతోందన్నారు.ఈ సమావేశంలో శ్రీస్వామివార్ల ప్రధానార్చకులు హెచ్. వీరయ్యస్వామి, సహాయ కార్యనిర్వహణాధికారి జి. స్వాములు, పర్యవేక్షకులు ఆర్. మల్లికార్జున, సహాయ సంపాదకులు కె. సత్య బ్రహ్మాచార్య, పలువురు అర్చకస్వాములు, సిబ్బంది పాల్గొన్నారు.

print

By Online News Diary

ONLINENEWSDIARY.COM - A Multilingual Online News Portal

Leave a Reply

Your email address will not be published.