×

తెలంగాణ ఆవిర్భావ వేడుకలకు సిద్ధం అవుతున్న పరేడ్ గ్రౌండ్, ట్యాంక్ బండ్

తెలంగాణ ఆవిర్భావ వేడుకలకు సిద్ధం అవుతున్న పరేడ్ గ్రౌండ్, ట్యాంక్ బండ్

హైదరాబాద్, మే 30 :: తెలంగాణా ఆవిర్భావ వేడుకల నిర్వహణకు అధికార యంత్రాంగం ముమ్మరంగా ఏర్పాట్లు చేస్తున్నది. జూన్ 2వ తేదీన సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్ లో తెలంగాణ అవతరణ వేడుకలు జరగనున్నాయి. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదేశాలతో సంబంధిత అధికారులు పరేడ్ గ్రౌండ్ లో ప్రధాన వేదిక తో పాటు, ముఖ్య అతిథులకు, ఆహ్వానితులకు , అధికారులకు, ప్రజా ప్రతినిధులకు వేరు వేరుగా ప్రత్యేక  లాంజ్ లు ఏర్పాటు చేస్తున్నారు. వేసవి ఎండల తీవ్రత నేపథ్యంలో కార్యక్రమానికి విచ్చేసే వారందరికి అసౌకర్యం కలగకుండా భారీ టెంట్ లను ఏర్పాటు చేస్తున్నారు.

సభా ప్రాంగణంలో ప్రత్యేక మెడికల్ క్యాంపులు, త్రాగునీటి సౌకర్యాలు ,  మొబైల్ టాయిలెట్లను కూడా ఏర్పాటు చేస్తున్నారు. సమాచార పౌర సంబంధాల శాఖ ఆధ్వర్యంలో ఎల్.ఈ.డీ స్క్రీన్ లు, కార్యక్రమ లైవ్ ప్రసారానికి ఏర్పాట్లు చేస్తున్నారు.

ట్యాంక్ బండ్ పై కనుల పండగగా సాంస్కృతిక కార్యక్రమాల నిర్వహణ :

జూన్ 2 వ తేదీన  సాయంత్రం ట్యాంక్ బండ్ పై  పలు సాంస్కృతిక కార్యక్రమాలు, కార్నివాల్, బాణ సంచా  లేజర్ షో, ఫుడ్, గేమింగ్ స్టాళ్ళను ఏర్పాటు చేస్తున్నారు. ట్యాంక్ బండ్ పై ఏర్పాటు చేసే పలు సాంస్కృతిక కార్యక్రమాలకు  ముఖ్యమంత్రి, మంత్రులు, ఇతర ప్రముఖులు హాజరవుతారు.  రాష్ట్రంలోని వివిధ జిల్లాలకు చెందిన పలు సాంస్కృతిక కళా బృందాలచే కార్నివాల్ ప్రదర్శనలు ఉండనున్నాయి.  ప్రధాన స్టేజీ పై పలు శాస్త్రీయ, జానపద, దక్కనీ సాంస్కృతిక కార్యక్రమాలు, తెలంగాణ రాష్ట్ర అధికారిక గీతం ‘జయ జయహే తెలంగాణ’ పై జాతీయ జెండాలతో మార్చ్-ఫాస్ట్ నిర్వహించనున్నారు.

ట్యాంక్ బండ్ పై దాదాపు 80 స్టాళ్లను ఏర్పాటు చేస్తున్నారు. ఈ స్టాళ్లలో రాష్ట్రంలోని హస్త కళలలు, స్వయం సహాయక బృందాలు తయారు చేసిన ఉత్పత్తులు, చేనేత వస్త్రాలు, నగరం లోని పలు ప్రముఖ హోటళ్ళచే స్టాళ్ళ ఏర్పాటు, చిన్న పిల్లలకు గేమింగ్ షో ల ఏర్పాటు చేయనున్నారు.

జూన్ 1 వ తేదీ నుండే ట్యాంక్ బండ్ పై అందుబాటులోకి స్టాల్స్ 

          అవతరణ వేడుకలో భాగంగా సందర్శకుల వినోదం కోసం ట్యాంక్ బండ్ పై ఏర్పాటు చేయనున్న 80 స్టాల్స్ జూన్ 1వ తేదీ నుండే అందుబాటులోకి రానున్నాయి. సందర్శకుల సౌకర్యార్థం ఈ స్టాళ్లను రెండు రోజుల పాటు (జూన్ 1, 2వ తేదీలలో) తెరచి ఉంచాలని ప్రభుత్వం భావిస్తుంది. అందుకు అనుగుణంగా అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.

print

Post Comment

You May Have Missed