శ్రీశైల దేవస్థానం:
* నవంబరు 14నుంచి డిసెంబరు 12 వరకు కార్తీక మాసోత్సవాలు
*రద్ధీరోజులలో స్వామివార్ల స్పర్శ దర్శనం నిలుపుదల చేసి అలంకార దర్శనానికి మాత్రమే అవకాశం
* సాధారణ రోజులలో నిర్ధిష్ట వేళలో నాలుగు విడుతలుగా స్వామివార్ల స్పర్శదర్శనానికి అవకాశం
* స్పర్శదర్శనం ఇతర ఆర్జితసేవా టికెట్లు ఆన్‌లైన్‌లో అందుబాటు. టికెట్ల లభ్యతను బట్టి గంట ముందు
వరకు కూడా ఆన్‌లైన్‌లో పొందే అవకాశం
మంగళవారం నుంచి కార్తీకమాసం ప్రారంభం కానుంది. ఈ కార్తీక మాసోత్సవాల నిర్వహణకు
వివిధ ఏర్పాట్లు జరిగాయి.
భక్తులకు వసతి,మంచినీటి సరఫరా, సౌకర్యవంతమైన దర్శనం, ప్రసాదాల విక్రయం, అన్నప్రసాదాల వితరణ,
పారిశుద్ధ్యం, కార్తీక సోమవారాలలో లక్ష దీపోత్సవం, పుష్కరిణి హారతి, నవంబరు 26న సాయంకాలం పౌర్ణమి
ఘడియలలో పుణ్య నదీహారతి, జ్వాలాతోరణం , లక్షదీపోత్సవం, పుష్కరిణి హారతి మొదలైన
కార్యక్రమాలకు సంబంధించి పలు ఏర్పాట్లు జరిగాయి.
దర్శన ఏర్పాట్లు :
కార్తికమాస పర్వదినాలు , సెలవు రోజులలో భక్తుల సంఖ్య అధికంగా ఉండే అవకాశం ఉంది.
భక్తులందరికీ సౌకర్యవంతమైన దర్శనం కల్పించేందుకు వీలుగా కార్తీ కమాసమంతా కూడా గర్భాలయ
అభిషేకాలు,సామూహిక ఆర్జిత అభిషేకాలు పూర్తిగా నిలుపుదల చేసారు.
అదేవిధంగా కార్తీక మాస రద్ధీరోజులలో , శని,ఆది,సోమవారాలు మొదలైన రోజులు (
మొత్తం 13 రోజులు) స్వామివారి స్పర్శదర్శనం పూర్తిగా నిలుపుదల చేసారు.
ఇక కార్తికమాస సాధారణ రోజులలో రోజుకు నాలుగు విడతలుగా స్పర్శదర్శనం వుంటుంది.
భక్తులు ఈ స్పర్శదర్శనం టికెట్లను ఆన్‌లైన్‌లో మాత్రమే పొందవలసివుంటుంది.
ఇప్పటికే నవంబరు నెల టికెట్ల కోటాను దేవస్థానం వెబ్‌సైట్ నందు అందుబాటులో ఉంచారు.
అదేవిధంగా డిసెంబరు నెల టికెట్ల కోటాను నవంబరు 25వ తేదీ నుంచి అందుబాటులో ఉంచుతారు.
టికెట్ల లభ్యతను బట్టి ప్రారంభ సమయానికి కంటే ఒక గంట ముందు వరకు కూడా భక్తులు ఆన్‌లైన్
ద్వారా టికెట్లను పొందే అవకాశం కల్పించారు.
శీఘ్రదర్శనం – అతిశీఘ్ర దర్శనం టికెట్లు :
రూ. 150/-ల రుసుముతో గల శీఘ్రదర్శనం ( శ్రీస్వామివారి అలంకార దర్శనం మాత్రమే) ,
రూ. 300/-ల రుసుముతో గల అతిశీఘ్ర దర్శనం టికెట్లను ( శ్రీస్వామివారి అలంకార దర్శనం మాత్రమే) ఆన్‌లైన్‌తో
పాటు కరెంట్ బుకింగ్ ద్వారా కూడా పొందవచ్చు. ఈ టికెట్లలో 3౦శాతం టికెట్లు ఆన్‌లైన్‌లో , తక్కిన
70 శాతం టికెట్లు కరెంట్ బుకింగ్ ద్వారా ఇస్తారు.కార్తీకమాసంలో ఉచిత సర్వదర్శనం కూడా యథావిధిగా కొనసాగుతుంది.
అమ్మవారి కుంకుమార్చన, గణపతి హోమం, రుద్రహోమం, మహామృత్యుంజయహోమం, చండీహోమం,
శ్రీవల్లిదేవసేవా సమేత సుబ్రహ్మణ్యేశ్వరస్వామి కల్యాణం, శ్రీస్వామిఅమ్మవార్ల కల్యాణోత్సవం, మొదలైన ఆర్జితసేవలు
యథావిధిగా వుంటాయి.
అన్నప్రసాదాల వితరణ :
భక్తులకు అన్నదాన భవనములో ఉదయం 10.30 నుండి అన్నప్రసాదాల వితరణ చేస్తారు. సాయంత్రం
గం. 7.00 నుంచి భక్తులకు అల్పాహారం ఏర్పాటు వుంటుంది. క్యూకాంప్లెక్స్‌లో దర్శనానికి వేచి ఉండే
భక్తులకు మంచి నీరు,బిస్కెట్లు, అల్పాహారం ఇస్తారు.
పాతాళగంగవద్ద ఏర్పాట్లు:
కార్తీకమాసములో భక్తులు పుణ్యస్నానాలకు ప్రాధాన్యత ఇస్తున్న కారణంగా పాతాళగంగ వద్ద అవసరమైన
అన్ని ఏర్పాట్లు చేసారు. పాతాళగంగవద్ద శౌచాలయాల నిర్వహణ, పారిశుద్ధ్యం నిర్వహణ పట్ల ప్రత్యేక శ్రద్ధ
తీసుకోవడం జరిగింది.
కేశఖండనశాలలో ఏర్పాట్లు:
భక్తులు తలనీలాలు సమర్పించుకునేందుకు కేశఖండనశాలలో ఆయా ఏర్పాట్లు చేసారు. ముఖ్యంగా
భక్తులరద్దీకనుగుణంగా కేశఖండనశాల వేళలను నిర్ధారిస్తారు.
సూచిక బోర్డుల ఏర్పాట్లు :
భక్తులు సమాచారం తెలుసుకునేందుకు వీలుగా పలుచోట్ల మరిన్ని సూచిక బోర్డులు ఏర్పాటు చేసారు.