శ్రీశైలంలో ఘనంగా సాగుతున్న మహా శివరాత్రి బ్రహ్మోత్సవాలు
*తెల్లవారుజామున 2.20 గంటలకు మొదటి దర్శనం ప్రారంభం
*భక్తులకు సమగ్ర సదుపాయాలు – 2.50 లక్షల మంది క్షేత్రంలో
శ్రీశైలం / నంద్యాల, ఫిబ్రవరి 15 :-పాగాలంకరణ కార్యక్రమానికి దాదాపు 7 నుండి 8 వేల మంది భక్తులను అనుమతించేందుకు చర్యలు తీసుకుంటున్నామని కలెక్టర్ తెలిపారు.
మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల సందర్భంగా శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి దేవస్థానంలో శివరాత్రి పర్వదినాన తెల్లవారుజామున 2.20 గంటల నుంచే మొదటి దర్శనం ప్రారంభమైనట్లు జిల్లా కలెక్టర్ జి. రాజకుమారి తెలిపారు. ఆదివారం దేవస్థానంలో జరుగుతున్న మహాశివరాత్రి ఏర్పాట్లను కలెక్టర్ స్వయంగా జాయింట్ కలెక్టర్‌తో కలిసి పరిశీలించారు. స్వామివారు, అమ్మవార్ల దర్శనార్థం ఏర్పాటు చేసిన క్యూ లైన్లు, భక్తుల రద్దీ, మౌలిక సదుపాయాల నిర్వహణ తదితర అంశాలను ప్రత్యక్షంగా పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు.
భక్తుల రాక నిరంతరం పెరుగుతున్న నేపథ్యంలో ఎలాంటి చిన్న ఇబ్బందులు కూడా తలెత్తకుండా సమగ్ర చర్యలు తీసుకుంటున్నామని కలెక్టర్ తెలిపారు. ప్రతి భక్తుడు స్వామి అమ్మవార్ల దర్శనం సంతృప్తికరంగా చేసుకునే విధంగా అన్ని ఏర్పాట్లు చేయడం జరిగిందన్నారు. క్యూ లైన్లలోని చిన్నపిల్లలకు పాలు, బిస్కెట్లు పంపిణీ సీనియర్ సిటిజన్లు, వికలాంగులకు ప్రత్యేక సౌకర్యాలు, క్యూ లైన్లలో ఆరోగ్య సమస్యలు తలెత్తిన వారికి తక్షణ వైద్య సహాయం, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కట్టుదిట్టమైన భద్రతా చర్యలు చేపట్టామని కలెక్టర్ తెలిపారు.
పాగాలంకరణ కార్యక్రమానికి దాదాపు 7 నుండి 8 వేల మంది భక్తులను అనుమతించేందుకు చర్యలు తీసుకుంటున్నామని కలెక్టర్ తెలిపారు. ముఖ్యంగా శివదీక్షాపరులతో పాటు ఇతర భక్తులకు కూడా అవకాశమివ్వాలని నిర్ణయించామని వెల్లడించారు. భక్తులందరూ శివనామ స్మరణతో, సమయపాలన పాటిస్తూ దర్శనం చేసుకుని నిండు ఆయురారోగ్యాలతో స్వగ్రామాలకు చేరుకోవాలని జిల్లా యంత్రాంగం తరఫున కలెక్టర్ ఆకాంక్షించారు. శ్రీశైల క్షేత్రంలో ఒక్కరోజు నిద్రిస్తే అనేక యుగాల పుణ్యఫలం లభిస్తుందని విశ్వాసంతో దాదాపు 2.50 లక్షల మంది భక్తులు ప్రస్తుతం క్షేత్రంలో ఉన్నారని కలెక్టర్ తెలిపారు.
భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా 30 పడకల ఆసుపత్రి, 7 అత్యవసర అంబులెన్సులు విస్తృత తాగునీటి సౌకర్యం, పారిశుద్ధ్య నిర్వహణకు ప్రత్యేక బృందాలు, 30 నీటి ట్యాంకుల ద్వారా టాయిలెట్లకు నిరంతర నీటి సరఫరా అదేవిధంగా 46 కిలోమీటర్ల కాలినడక పాదయాత్ర మార్గంలో గుర్తించిన 13 ప్రదేశాల్లో తాగునీరు, పారిశుద్ధ్య సదుపాయాలు, టాయిలెట్లు, వైద్య సహాయం, చలువ పందిళ్లు ఏర్పాటు చేసినట్లు కలెక్టర్ తెలిపారు. ఎండ తీవ్రత దృష్ట్యా భక్తులు ఎక్కువసేపు ఎండలో నిల్చోకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని కూడా కలెక్టర్ సూచించారు. మహాశివరాత్రి సందర్భంగా జిల్లా యంత్రాంగం సమన్వయంతో పనిచేస్తూ భక్తులకు సౌకర్యవంతమైన దర్శనం కల్పించేందుకు కట్టుబడి ఉందని కలెక్టర్ స్పష్టం చేశారు.
