
శ్రీశైల దేవస్థానం:ఈ నెల 16వ తేదీ నుంచి 21 వరకు మహాకుంభాభిషేక మహోత్సవం నిర్వహిస్తారు.
ప్రధానాలయంలో శివాజీగోపుర పునర్నిర్మాణం, ఆలయప్రాంగణంలోని కొన్ని ఉపాలయాల పునరుద్ధరణ, పంచమఠాలలోని మూడు మఠాల పునరుద్ధరణ , ఆయా ఉపాలయాలో, మఠాలలో శివలింగ, నందీశ్వరుల ప్రతిష్ఠ సందర్భంగా ఈ మహాకుంభాభిషేకం నిర్వహిస్తున్నారు.
16 ఉదయం గం.7.00లకు మహాకుంభాభిషేక సంకల్పం, గోపూజ, గణపతిపూజ, ఋత్విగ్వరణం, దీక్షాధారణ, పర్యగ్ని కరణము, యాగశాల ప్రవేశం, పుణ్యాహవాచనం, పంచగవ్యప్రాశన, మండపారాధనలు మూలమంత్రానుష్ఠానాలు, పారాయణలు, అఖండదీపస్థాపన జరిపిస్తారు.
16 సాయంత్రం గం. 4.30 నిల నుంచి మృత్సంగ్రహణము, అంకురార్పణ, అగ్నిమథనం, అగ్నిప్రతిష్ఠాపన, దేవతాహవనములు, వేదహవనములు, జలాధివాసం, వేదస్వస్తి, నీరాజనం, మంత్రపుష్పం జరిపిస్తారు. చివరగా భక్తులకు తీర్థప్రసాదాలను వితరణ వుంటుంది.
17వ తేదీ నుంచి 20 తేదీ వరకు కూడా ప్రతీరోజు గోపూజ, మండపపూజలు, వేదపారాయణలు, గణపతి, రుద్ర, చండీపారాయణలు, హోమములు, వేదహవనములు, వేదస్వస్తి తదితర కార్యక్రమాలు నిర్వహిస్తారు.
మహాకుంభాభిషేకం జరిగే 21వ తేదీ ఉదయం గం. 7.00లకు శాంతిహోమం, పౌష్టికహోమం, మహాపూర్ణాహుతి జరిపించబడుతాయి. గం. 8.45ల నుంచి పునరుద్ధరించిన ఆలయాలలో యంత్ర ప్రతిష్ఠలు, శివలింగ నందీశ్వర ప్రతిష్ఠలు, శివాజీగోపురమునకు సువర్ణకలశ ప్రతిష్ఠలు జరిపించబడుతాయి.
తరువాత గం. 9.45 నిలకు ఉభయ దేవాలయాల గర్భాలయ విమానాలకు, గోపురాలకు, మూలమూర్తులకు, ఇతర దేవతామూర్తులకు మహాకుంభాభిషేకం జరిపిస్తారు.
అనంతరం అవబృథం, గురువందనం, మహాదాశీర్వచనం, వేదసభ నిర్వహిస్తారు. చివరిగా భక్తులకు తీర్థ ప్రసాదాలు అందిస్తారు.
*మహాకుంభాభిషేక మహోత్సవానికి ప్రముఖులను ఆహ్వానించారు.