శ్రీశైలం/నంద్యాల, ఫిబ్రవరి 19:-సోమవారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ బిశ్వ భూషణ్ హరి చందన్ శ్రీశైల పర్యటనకు సంబంధించి ఏర్పాట్లను జిల్లా కలెక్టర్ డా. మనజీర్ జిలాని సామూన్, జిల్లా ఎస్‌పి కె. రఘువీర్ రెడ్డిలు ఆదివారం పర్యవేక్షించారు. సున్నిపెంట హెలిప్యాడ్ మైదానాన్ని పరిశీలిస్తూ ప్రోటోకాల్ ప్రకారం హెలిప్యాడ్ ఏర్పాట్లు, చుట్టూ బ్యారికేడింగ్, తాత్కాలిక శౌచాలయాల ప్రదేశాలను పరిశీలిస్తూ సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. సున్నిపెంట్ హెలిప్యాడ్ మైదానం నుండి మాక్ ట్రయల్ రన్ నిర్వహిస్తూ మార్గమధ్యములో పారిశుద్ద్య చర్యలు, ట్రాఫిక్ నియంత్రణ తదితర ఏర్పాట్లపై సంబంధిత అధికారులకు సూచనలు జారీ చేశారు.
ధర్మకర్తల మండలి అధ్యక్షులు రెడ్డివారిచక్రపాణిరెడ్డి, గవర్నర్ ప్రోటోకాల్ అధికారి ఉదయరాజు, దేవస్థానం కార్యనిర్వహణాధికారి ఎస్. లవన్న, ఆత్మకూరు ఆర్ డిఓ ఎం. దాసు, జిల్లా పరిషత్ డిప్యూటీ సీఈఓ సుబ్బారెడ్డి, డిఆర్ డిఏ పీడి శ్రీధరరెడ్డి తదితరులు కలెక్టర్ వెంట ఉన్నారు.