
శ్రీశైల దేవస్థానం: శ్రీశైల దేవస్థానం లో ఆయా ఆర్జిత సేవలు, స్వామివారి గర్భాలయ అభిషేకం, సామూహిక అభిషేకం, కుంకుమార్చన, కల్యాణోత్సవం మొదలైన సేవలను జరిపించుకునే భక్తులు, అదేవిధంగా ఆర్జిత హోమాలను జరిపించుకునే భక్తులు కరెంట్ బుకింగ్ ద్వారా టికెట్లు పొందేటప్పుడు గుర్తింపు కోసం ఆధార్ కార్డును తప్పనిసరిగా దేవస్థానానికి సమర్పించవలసివుంటుందని ఈ ఓ వివరించారు.
అదేవిధంగా విరామ దర్శనం టికెట్లు మరియు స్పర్శదర్శనం టికెట్లు పొందే భక్తులు కూడా తప్పనిసరిగా గుర్తింపు కోసం ఆధార్ కార్డు జిరాక్స్ కాపీని సమర్పించవలసి వుంటుంది.
ఆయా ఆర్జిత సేవలు మరియు స్పర్శదర్శన టికెట్ల జారీ విధానములో పూర్తి పారదర్శకత కోసం ఈ విధానాన్ని ప్రవేశపెట్టడం జరుగుతోంది.
భక్తులు ఆయా ఆర్జితసేవ టికెట్లను ముందస్తుగా ఆన్లైన్ ద్వారా పొందే సౌకర్యాన్ని దేవస్థానం కల్పించింది. అదేవిధంగా ఈ టికెట్లను కరెంట్ బుకింగ్ ద్వారా పొందే అవకాశం కూడా కల్పించింది.
భక్తులందరు కూడా దేవస్థానం కల్పిస్తున్న సౌకర్యాన్ని సద్వినియోగం చేసుకోవలసినదిగా కోరుతున్నారు.
ముఖ్యంగా భక్తులు ఆయా ఆర్జిత సేవలు మరియు స్పర్శదర్శన టికెట్ల కోసం నేరుగా దేవస్థానాన్ని సంప్రదించవలసినదిగా కోరుతున్నారు.ఈ విధంగా టికెట్లు పొందే విషయములో దళారీలను ఎవరిని కూడా ఆశ్రయించవద్దని కోరుతున్నారు.
భక్తులు ఎవరైనా టికెట్లు పొందే విషయములో ఇబ్బందులు కలిగితే సహాయ కార్యనిర్వహణాధికారివారిని లేదా ప్రజాసంబంధాల అధికారివారిని సంప్రదించవలసినదిగా దేవస్థానం పేర్కొంది.
భక్తులు ఈ విషయమై దేవస్థానానికి సహకరించవలసినదిగా కూడా కోరారు.