శ్రీశైల దేవస్థానం:దేవస్థానంలో స్వచ్ఛంద సేవను అందిస్తున్న శివసేవకుల బృందాల నిర్వాహకులతో సోమవారం కార్యనిర్వహణాధికారి యం. శ్రీనివాసరావు ప్రత్యేకంగా సమావేశమయ్యారు.
ఈ సమావేశంలో స్వచ్ఛందసేవకు సంబంధించి పలు సూచనలను చేశారు.
ఈ సందర్భంగా కార్యనిర్వహణాధికారి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు శివసేవకుల స్వచ్ఛందసేవను దేవస్థానం మరింత విస్తృతంగా వినియోగించుకోవడం జరుగుతుందన్నారు. స్వచ్ఛందసేవకు ఆసక్తిగల వారు ఆన్లైన్ ద్వారా కూడా నమోదు చేసుకోవచ్చునన్నారు. ఈ ఆన్లైన్ విధానంలో బృందాలుగా లేదా వ్యక్తిగతంగా కూడా స్వచ్ఛందసేవకు నమోదు చేసుకునే అవకాశం ఉందన్నారు.
శివసేవకులు సేవను నిర్వహించు సమయంలో దేవస్థానమే తాత్కాలిక గుర్తింపు కార్డులను అందజేయడం జరుగుతుందన్నారు. అదేవిధంగా సేవా సమయంలో శివసేవకులకు గుర్తింపు కోసం దేవస్థానం అధికార చిహ్నం (లోగో) తో స్కార్ఫ్‌ను అందజేస్తుందన్నారు.
శివసేవకులలో తగు అవగాహన పొందేందుకుగాను దేవస్థానం కరదీపికను ( పాకెట్ సైజు పుస్తకాన్ని) కూడా అందజేస్తుందన్నారు. అదేవిధంగా సమయానుకూలంగా శివసేవకులకు దేవస్థానం అవగాహన కార్యక్రమాన్ని కూడా నిర్వహిస్తుందన్నారు.
శివసేవకులు క్యూకాంప్లెక్సు, క్యూలైన్ల నిర్వహణ, ఆలయ ప్రాంగణం, అన్నప్రసాద వితరణ, కల్యాణకట్ట మొదలైనచోట్ల స్వచ్ఛందసేవను అందించాలన్నారు.
స్వచ్ఛందసేవకులందరు కూడా అంకితభావంతో భక్తులకు సేవలు అందించాలన్నారు. ముఖ్యంగా యాత్రికులతో మర్యాదపూర్వకంగా మెలగాలన్నారు. ప్రతి యాత్రికుడిని కూడా దేవస్థానానికి వచ్చిన అతిథిగా భావించాలన్నారు.
అదేవిధంగా శివసేవకులు వారికి కేటాయించిన ప్రదేశాలలో ఎటువంటి లోటుపాట్లు లేకుండా సేవలను అందజేయాలన్నారు. శివసేవకులందరు కూడా సమయపాలన పాటించడం ఎంతైనా అవసరమన్నారు.
సేవా సమయంలో భక్తులు అడిగే సమాచారాన్ని కూడా సేవకులు ఓపికతో తెలియజేయాలన్నారు. ఈ సాధారణ సమాచారాన్ని దేవస్థానమే శివసేవకులకు సమకూరుస్తుందన్నారు.
దేవస్థాన అధికారులు, సిబ్బంది అందరు కూడా శివసేవకులకు పూర్తి సహయ సహకారాలు అందిస్తారన్నారు.
దేవస్థానం అధికారులతో తగు సమన్వయం చేసుకుంటూ స్వచ్చందసేవకులు స్వచ్చందసేవలు అందించాలన్నారు.
ఈ సమావేశంలో శివసేవకుల విభాగపు సహాయ కార్యనిర్వహణాధికారి కె. వెంకటేశ్వరరావు, పర్యవేక్షకురాలు టి. హిమబిందు తదితర సిబ్బంది, స్వచ్ఛందసేవా సంస్థల నిర్వాహకులు పాల్గొన్నారు.
