
శ్రీశైల దేవస్థానం:అన్నప్రసాద వితరణ భవనాన్ని ధర్మకర్తల మండలి అధ్యక్షులు, సభ్యులు, కార్యనిర్వహణాధికారి మంగళవారం పరిశీలించారు.అన్నప్రసాద వితరణ పాకశాలలో ఉదయం అకస్మాత్తుగా బాయిలర్ పేలింది. పాకశాలలో అన్నప్రసాదాన్ని వాటర్ స్ట్రీమింగ్ ద్వారా వండుతారు. ఈ వాటర్ స్ట్రీమింగ్ బాయిలర్ అకస్మాత్తుగా పేలిపోయింది.అదృష్టవశాత్తు ఈ సంఘటనలో ఎవరికీ కూడా ఎటువంటి ప్రమాదం జరగలేదు. ఘటన జరిగిన సమయం లో ఆ ప్రదేశం లో ఎవరు కూడా లేకపోవడంతో ప్రమాదం తప్పింది.
సంఘటన విషయాన్ని తెలుసుకున్న వెంటనే ధర్మకర్తల మండలి అధ్యక్షులు రెడ్డివారిచక్రపాణిరెడ్డి, ధర్మకర్తల మండలి సభ్యులు శ్రీమఠం విరూపాక్షయ్యస్వామి, శ్రీమతి డా. కనకదుర్గ, ప్రత్యేక ఆహ్వానితులు తన్నీరు ధర్మరాజు అన్నప్రసాద వితరణ మందిరాన్ని పరిశీలించారు.ఈ సందర్భంగా అధ్యక్షులు, సభ్యులు మాట్లాడుతూ శ్రీభ్రమరాంబమల్లికార్జునస్వామివార్ల కటాక్షంతో ప్రమాదం తప్పిందన్నారు. భవిష్యత్తులో ఇలాంటి ప్రమాదాలు జరగకుండా వుండేందుకు సాంకేతిక సిబ్బందిని(టెక్నికల్ స్టాఫ్ ను) వెంటనే ఏర్పాటు చేయాలని అధికారులకు సూచించారు. అన్నప్రసాద వితరణ మందిరం లో మౌలిక సదుపాయాలను ఎప్పటికప్పుడు జాగ్రత్తగా పరిశీలిస్తుండాలన్నారు. మరమ్మతులు అవసరమైనప్పుడు ఎటువంటి ఆలస్యం లేకుండా తగు చర్యలు చేపట్టాలన్నారు.అదేవిధంగా పారిశుద్ధ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ కనబర్చాలని అధికారులకు సూచించారు.
సంఘటన జరిగిన వెంటనే కార్యనిర్వహణాధికారి ఎస్. లవన్న ఘటనా స్థలాన్ని పరిశీలించారు. అన్నప్రసాదవితరణ సిబ్బందితో మాట్లాడుతూ సంఘటన వివరాలను తెలుసుకున్నారు.ఈ ఓ మాట్లాడుతూ భవిష్యత్తులో ఎటువంటి ప్రమాదాలు జరగకుండా వుండేందుకు అవసరమైన అన్ని ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా వుండేందుకు సంబంధిత అధికారులందరు ఎప్పటికప్పుడు తగు చర్యలు చేపడుతుండాలన్నారు. విధినిర్వహణ సమయములో సిబ్బంది అందరు కూడా అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
పరిశీలనలో ఎగ్జిక్యూటివ్ ఇంజనీరు వి. రామకృష్ణ, డిప్యూటీ ఎగ్జిక్యూటీవ్ ఇంజనీరు ఎం. నరసింహారెడ్డి, అన్నప్రసాదవితరణ సహాయ కార్యనిర్వహణాధికారి డి. మల్లయ్య పర్యవేక్షకులు శ్రీమతి దేవిక, ముఖ్యభద్రతా అధికారి నరసింహారెడ్డి, సంబంధిత అసిస్టెంట్ ఇంజనీర్లు తదితరులు పాల్గొన్నారు.