22 న ఎల్బీ స్టేడియంలో స్వతంత్ర వజ్రోత్సవాల ముగింపు వేడుకలు

హైదరాబాద్, ఆగస్టు 11 :: భారత స్వతంత్ర వజ్రోత్సవాల ముగింపు వేడుకలు ఈ నెల 22 వ తేదీన హైదరాబాద్  ఎల్.బి స్టేడియంలో అత్యంత ఘనంగా నిర్వహించాలని డా. కేశవరావు అధ్యక్షతన జరిగిన భారత స్వతంత్ర వజ్రోత్సవాల కమిటీ నిర్ణయించింది. గురువారం ఉదయం బీ.ఆర్.కె.ఆర్ భవన్ లో జరిగిన వజ్రోత్సవాల కమిటీ సమావేశానికి రాష్ట్ర మంత్రులు తలసాని శ్రీనివాస యాదవ్, సబితా ఇంద్రా రెడ్డి, శ్రీనివాస గౌడ్, నగర మేయర్ గద్వాల్ విజయ లక్ష్మి, ఎమ్మెల్సీ ప్రభాకర్ రావు, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, రాష్ట్ర సాహిత్య అకాడమీ అధ్యక్షులు జూలూరి గౌరీ శంకర్ తదితరులు హాజరయ్యారు. ఈ సందర్బంగా కమిటీ అధ్యక్షులు కేశవ రావు మాట్లాడుతూ, ఈ నెల 8 వ తేదీ నుండి ప్రారంభమైన స్వతంత్ర వజ్రోత్సవాలకు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని వర్గాల నుండి విశేష స్పందన లభిస్తోందని అన్నారు. ఇదే మాదిరిగా ఈనెల 22 న ఎల్.బి స్టేడియంలో ఉత్సవాల ముగింపు వేడుకలు అత్యంత ఘనంగా నిర్వహిస్తున్నట్టు తెలిపారు. మధ్యాహ్నం 3 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు జరిగే ఈ వేడుకలకు రాష్ట్ర ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు  హాజరవుతారని పేర్కొన్నారు, రాష్ట్రంలోని అన్ని జిల్లాల నుండి ప్రజలు ఈ ఉత్సవాలకు హాజరవుతారని అన్నారు. ఈ సందర్బంగా ఎల్బీ స్టేడియాన్ని రంగు రంగుల విద్యుత్ దీపాలతో అలంకరించనున్నట్టు చెప్పారు. రాష్ట్ర సంగీత నాటక  అకాడమీ అధ్యక్షురాలు దీపికా రెడ్డి బృదంచే దీపాంజలి సాంస్కృతిక కార్యక్రమాలు, ప్రముఖ గాయకులు శంకర్ మహదేవన్ బృందంచే దేశభక్తి గీతాల సంగీత విభావరి, లేజర్ షో, క్రాకర్స్ ప్రదర్శన ఉంటుందని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ సినీ తారలు కూడా పాల్గొంటారని అన్నారు.  హైదరాబాద్ తోపాటు రాష్ట్రంలోని అన్ని వ్యాపార వాణిజ్య సముదాయాలు, మాల్స్, సినిమా హాళ్లు, పెట్రోల్ బంకులు ప్రధాన జంక్షన్లన్నింటినీ విద్యుత్ దీపాలతో అలంకరించాలని తెలిపారు.

 16 తేదీన ఉదయం 11.30 గంటలకు సామూహిక జాతీయ గీతాలాపన

స్వతంత్ర వజ్రోత్సవాలలో భాగంగా ఈనెల 16 వ తేదీన ఉదయం పదకొండున్నరకు సామూహిక జాతీయ గీతాలాపన ఉంటుందని నిర్వాహకులు  తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా ఆ సమయంలో అన్ని రహదారులలో ట్రాఫిక్ ను నిలిపివేసి జాతీయగీతం ఆలపించాల్సి ఉంటుందని తెలిపారు. ఈ జాతీయ గీతాలాపనలో ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొని స్వాతంత్రోద్యమ స్ఫూర్తిని చాటాలని విజ్ఞప్తి చేశారు.

print

By Online News Diary

ONLINENEWSDIARY.COM - A Multilingual Online News Portal

Leave a Reply

Your email address will not be published.