శ్రీశైల దేవస్థానం: ఉన్నత న్యాయస్థానం ఉత్తర్వులను అమలు పర్చడంలో భాగంగా బహిరంగ వేలం లో హెచ్చుపాటదారులుగా నిలిచిన 41 మందికి శ్రీలలితాంబిక దుకాణ సముదాయము లోని దుకాణాలు కేటాయించే ప్రక్రియ శుక్రవారం ప్రారంభమైంది.
ఈ కార్యక్రమం లో ధర్మకర్తల మండలి అధ్యక్షులు రెడ్డివారి చక్రపాణిరెడ్డి, దేవస్థానం కార్యనిర్వహణాధికారి ఎస్. లవన్న, ధర్మకర్తల మండలి సభ్యులు విరుపాక్షయ్యస్వామి, ఎ. మురళి, మేరాజోత్ హనుమంతనాయక్, ఓ. మధుసూదన్ రెడ్డి, ప్రత్యేక ఆహ్వానితులు తన్నీరు ధర్మరాజు, కేతిరెడ్డి జగదీశ్వరరెడ్డి పాల్గొన్నారు. రెవెన్యూ విభాగపు సహాయ కార్యనిర్వహణాధికారి పి. నటరాజరావు, రెవెన్యూ విభాగపు పర్యవేక్షకులు కె.శివప్రసాద్, గుమాస్తాలు ఇ. మల్లిక్ రాజా, హరికృష్ణారెడ్డి తదితర సిబ్బంది పాల్గొన్నారు.
గతం లో శ్రీలలితాంబికా దుకాణ సముదాయములోని దుకాణాల కేటాయింపునకు నిర్వహించిన బహిరంగవేలం లో పాల్గొన్నవారిలో 42మంది తమకు దుకాణాలు కేటాయించవలసిందిగా న్యాయస్థానంలో వ్యాజ్యములు దాఖలు చేసారు.వ్యాజ్యము దాఖలు చేసిన 42 మందికి దుకాణాలు కేటాయించవలసిందిగా మార్చిలో న్యాయస్థానం తుది తీర్పు ఇచ్చింది. ఈ 42 మందిలో ఒక్కరు మినహా తక్కిన 41 మంది దుకాణాలు పొందటానికి తమ అంగీకారం తెలిపారు.
తదనుగుణంగా దుకాణాలు కేటాయించే విషయాన్ని శుక్రవారం జరిగిన ధర్మకర్తల మండలి సమావేశంలో అజెండా అంశముగా ప్రవేశపెట్టారు.వ్యాజ్యము దాఖలు చేసిన వారిలో దుకాణాలు పొందటానికి అంగీకారం తెలిపిన 41మందికి వెంటనే దుకాణాలు కేటాయించవలసినదిగా ధర్మకర్తల మండలి వారు తీర్మానించారు.
ధర్మకర్తల మండలి సమావేశం లో అధ్యక్షులతో పాటుమఠం విరూపాక్షయ్యస్వామి, శ్రీమతి జంగం సుజాతమ్మ, గురుమహంత్ మహేష్, జి. నరసింహారెడ్డి, శ్రీమతి ఎం. విజయలక్ష్మి శ్రీమతి బి. రామేశ్వరి, శ్రీమతి లక్ష్మీ సావిత్రమ్మ,మేరాజోత్ హనుమంతనాయక్, మధుసూదన్ రెడ్డి, శ్రీమతి బి. పద్మజ, డా. శ్రీమతి కనకదుర్గ, ఎక్స్ అఫిషియే సభ్యులు జె. వీరభద్రస్వామి పాల్గొన్నారు. ధర్మకర్తల మండలి ప్రత్యేక ఆహ్వానితులు తన్నీరు ధర్మరాజు, కేతిరెడ్డి జగదీశ్వరరెడ్డి పాల్గొన్నారు. తీర్మానం అనుసరించి దుకాణముల కేటాయింపునకు న్యాయస్థానములో వ్యాజ్యం దాఖలు చేసిన 41 మందికి దుకాణాలు కేటాయించారు.ఈ దుకాణాలను 11.06.2022 నుంచి 10.06.2025 వరకు, అనగా మూడు సంవత్సరాల కాలపరిమితితో కేటాయించారు.
ఈ రోజు జరిగిన కార్యక్రమం లో పలువురు దుకాణదారులకు దుకాణాలు కేటాయింపు పత్రాలు అందించారు. అంతేకాక నందిసర్కిల్ నుంచి పోస్టాఫీస్ రోడ్డులోని దుకాణాల రేట్లు కూడా ఆమోదించి కమిషనరు ఆమోదానికి పంపారు.
ఈ షాపులకు, చెంచు గిరిజనులకు నిర్దేశించిన 30 దుకాణాలకు మే 30వ తేదీలోపల డిప్ సిస్టమ్ ద్వారా కేటాయించి ప్రస్తుత దుకాణాలను ఖాళీ చేయించడానికి నిర్ణయం తీసుకున్నారు.
