హైదరాబాద్,21,సెప్టెంబర్: తెలంగాణలో ఉన్న పథకాలు దేశంలో ఎక్కడా లేవని రాష్ట్ర హోంశాఖ మంత్రి మహమ్మద్ మహమూద్ అలీ అన్నారు. అబ్దుల్లాపూర్ మెట్ మండలంలోని తట్టి అన్నారంలో డబుల్ బెడ్ రూం ఇండ్ల కేటాయింపు కార్యక్రమంలో హోం మంత్రి పాల్గొన్నారు.ముఖ్యమంత్రి కేసీఆర్ నేతృత్వంలోని తెలంగాణ ప్రభుత్వం పాలనలో ఎన్నో పథకాలను అమలు చేసిందని, దాని వల్లనే రాష్ట్రం సర్వతోముఖాభివృద్ధి సాధించిందని అన్నారు. ఎంపికైన లబ్ధిదారులను అభినందిస్తూ.. ఇంటి యజమానులుగా మారారని, కిరాయి ఇళ్లలో అద్దె చెల్లించకుండా విముక్తి కలిగిందన్నారు .లాటరీ ద్వారా ఇళ్ల పంపిణీలో పారదర్శకత తీసుకొచ్చామని, కేసీఆర్ నేతృత్వంలోని తెలంగాణ ప్రభుత్వం పేద, బడుగు, బలహీన వర్గాల ప్రభుత్వమని, పనులు జరుగుతున్నాయన్నారు. అన్ని వర్గాల ప్రజల అభివృద్ధి, సంక్షేమం కోసం తెలంగాణ ప్రభుత్వం తొమ్మిదేళ్ల పాలనలో రాష్ట్రానికి అసాధారణ అభివృద్ధిని అందించి దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకుందన్నారు. తొమ్మిదేళ్లలో తెలంగాణలోని మైనార్టీలు, ముఖ్యంగా ముస్లింలు అన్ని రంగాల్లో లబ్ధి పొందారని, దీని వల్ల తెలంగాణ ముస్లింలు ఎంతో ఆనందంగా ఉన్నారని సంతోషం వ్యక్తం చేశారు. తెలంగాణ ఏర్పడడానికి ముందు పదేళ్లలో సమైక్య ఆంధ్రప్రదేశ్‌లో మైనార్టీల కోసం కేవలం 1200 కోట్ల రూపాయలు మాత్రమే ఖర్చు చేశారని, తెలంగాణ ప్రభుత్వం మైనారిటీ వర్గాల సంక్షేమం, అభివృద్ధికి సామాజిక, ఆర్థిక, విద్యా, సంస్థాగత అభివృద్ధికి అనేక చర్యలు తీసుకుంటోందన్నారు. మైనార్టీల అభివృద్ధికి 2200 కోట్ల రూపాయల బడ్జెట్‌ను కేటాయించిందన్నారు. తెలంగాణ ప్రభుత్వం షాదీ ముబారక్ పథకం కింద ఇప్పటి వరకు మైనారిటీ వర్గాలకు చెందిన 2.65 లక్షల మంది పేద బాలికలకు లబ్ధి చేకూర్చిందని పేర్కొన్నారు. రెసిడెన్షియల్ పాఠశాలలను ప్రస్తావిస్తూ హోంమంత్రి తెలంగాణ ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా 204 రెసిడెన్షియల్ పాఠశాలలను జూనియర్ కాలేజీలుగా అప్‌గ్రేడ్ చేసిందని తెలిపారు. ఇందులో 1.30 లక్షల మంది విద్యార్థులు చదువుతుండగా. వారి కోసం ఇప్పటివరకు రూ.2,974 కోట్లు ఖర్చు చేశారని తెలియజేశారు .ముఖ్యమంత్రి ఓవర్సీస్ స్కాలర్‌షిప్ గురించి మహమ్మద్ మహమూద్ అలీ మాట్లాడుతూ….ఈ పథకం కింద ఇప్పటివరకు మొత్తం 29743 మంది విద్యార్థులకు రూ.438.65 కోట్ల రూపాయలు ఖర్చు చేసినట్లు తెలిపారు. స్కాలర్‌షిప్, సివిల్ సర్వీసెస్ కోచింగ్ గురించి కూడా ఆయన ప్రస్తావించారు.ఇమామ్‌లు, మ్యూజిన్‌ల గౌరవ వేతనం గురించి మాట్లాడుతూ….. తెలంగాణ ప్రభుత్వం ఈ పథకం ద్వారా 10,000 మంది ఇమామ్‌లు లబ్ధి పొందుతున్నారన్నారు.ఇప్పటి వరకు ఈ పథకం కింద ప్రభుత్వం రూ.301 కోట్లు ఖర్చు చేసిందని, మరో 7000 మంది ఇమామ్‌లకు నిధులు విడుదల చేస్తూ ముఖ్యమంత్రి చంద్రశేఖర్‌రావు ఉత్తర్వులు జారీ చేశారన్నారు. తెలంగాణ గంగా ,జమున నాగరికతను నమ్మడమే కాకుండా ఆచరిస్తున్నారని, మతం,దేశాలకు అతీతంగా ప్రజలందరూ తమ పండుగలను ఆనందోత్సాహాలతో జరుపుకునేలా.. ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ఎన్నో కార్యక్రమాలు చేపట్టారని అన్నారు. లౌకికవాద ముఖ్యమంత్రిగా దేశవ్యాప్తంగా ప్రసిద్ధి చెందారని, తెలంగాణ ఏర్పాటైన నాటి నుంచి రోజురోజుకూ రాష్ట్రం అభివృద్ధి పథంలో దూసుకుపోతోందని. గత తొమ్మిదేళ్లలో తెలంగాణ రాష్ట్రం అసాధారణ అభివృద్ధిని సాధించిందన్నారు.65 ఏళ్లలో సాధించలేని ప్రగతి గత తొమ్మిదేళ్లలో సాధించామని, చివరగా ప్రీ మెట్రిక్, పోస్ట్ మెట్రిక్ స్కాలర్‌షిప్, కళ్యాణలక్ష్మి, ఆస్రా పింఛన్, ఉచిత తాగునీరు, 24 గంటల ప్రామాణిక విద్యుత్, కేసీఆర్ కిట్, రైతు బంధు, రైతు బీమా, దళిత బంధు తదితర పథకాలను సవివరంగా ప్రస్తావించారు. ఈ కార్యక్రమంలో స్థానిక ఎం ఎల్ ఏ మంచిరెడ్డి కిషన్‌రెడ్డి, చైర్‌పర్సన్ స్వప్న చిరంజీవి, వైస్ చైర్‌పర్సన్ సంపూర్ణ, కౌన్సిలర్ శ్రీధర్‌రెడ్డి, జాయింట్ కలెక్టర్ భూపాల్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
లౌకికవాద ముఖ్యమంత్రిగా కేసీఆర్ దేశవ్యాప్తంగా ప్రసిద్ధి-హోంశాఖ మంత్రి మహమ్మద్ మహమూద్ అలీ
