
కర్నూలు, మార్చి 01 :- శ్రీశైలం బ్రహ్మోత్సవాలు వైభవంగా ,కన్నుల పండుగగా కొనసాగుతున్నాయి. శ్రీశైల మహాక్షేత్రం శివనామస్మరణతో మారుమోగుతోంది. బ్రహ్మోత్సవాలలో భాగంగా జిల్లా కలెక్టర్ పి కోటేశ్వర రావు, జిల్లా ఎస్పీ సిహెచ్ సుధీర్ కుమార్ రెడ్డి, జాయింట్ కలెక్టర్ (రెవిన్యూ, రైతు భరోసా) రామ సుందర్ రెడ్డి, జాయింట్ కలెక్టర్ (ఆసరా, సంక్షేమం) ఎం.కె.వి శ్రీనివాసులు శ్రీశైల భ్రమరాంబ మల్లికార్జున స్వామి అమ్మవార్లను మంగళవారం దర్శించుకున్నారు.
ఈ రోజు పాగాలంకరణ, కల్యాణం ఏర్పాట్లు, భక్తుల ఉచిత దర్శన క్యూలైన్లు, లడ్డూ ప్రసాదం కౌంటర్లు, ట్రాఫిక్, రద్దీ, ప్రసాదం క్యూలైన్లు, పోలీసు భద్రత తదితర అన్ని ఏర్పాట్లను జిల్లా కలెక్టర్, జిల్లా ఎస్పీ, జేసిలు తనిఖీలు చేస్తూ నిశితంగా పరిశీలిస్తూ…ఎక్కడైనా సమస్య వస్తే తక్షణ పరిష్కార చర్యలు తీసుకోవాలని ప్రత్యేక జోనల్ అధికారులను, జిల్లా అధికారులను ఆదేశించారు.
జిల్లా కలెక్టర్ పి కోటేశ్వర రావు మాట్లాడుతూ…. భగవంతుని దయవల్ల శ్రీశైల బ్రహ్మోత్సవాలు ప్రశాంతంగా జరుగుతున్నాయన్నారు. శ్రీశైల భ్రమరాంబికా మల్లికార్జున స్వామి వార్లను భక్తులందరూ భక్తి శ్రద్ధలతో దర్శించుకుంటున్నారన్నారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా త్రాగునీరు, పారిశుధ్యం, భక్తుల క్యూలైన్లు, లడ్డు ప్రసాదాల కౌంటర్లు, అన్ని వసతులు కూడా కల్పించామన్నారు. పాగాలంకరణకు సంబంధించి పకడ్బందీ చర్యలు చేపట్టినట్లు జిల్లా కలెక్టర్ వివరించారు.
జిల్లా కలెక్టర్ వెంట కర్నూలు ఆర్డీఓ హరి ప్రసాద్, ఏ ఎస్ పి రమణ, ప్రత్యేక జోనల్ అధికారులను, జిల్లా అధికారులు, డి ఎస్ పి లు, తహసీల్దార్ లు, శ్రీశైలం దేవస్థానం సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.