*రాష్ట్రంలోని అర్హులైన జర్నలిస్టులందరికీ అక్రెడిటేషన్ కార్డులు
హైదరాబాద్:
రాష్ట్రంలోని అర్హులైన జర్నలిస్టులందరికీ అక్రెడిటేషన్ కార్డులు జారీ చేయడం
జరుగుతుందని సమాచార, పౌర సంబంధాల శాఖ ప్రత్యేక కమిషనర్ సీహెచ్ ప్రియాంక తెలిపారు.
అక్రెడిటేషన్ ప్రక్రియను పారదర్శకంగా నిర్వహించడంపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని
పేర్కొన్నారు. అక్రెడిటేషన్ మంజూరుకు రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన జి.ఓ. నెం. 252 ప్రకారం
ఇప్పటికే దరఖాస్తులను ఆహ్వానించినట్లు తెలిపారు. ఈ మేరకు రాష్ట్ర మీడియా అక్రెడిటేషన్
కమిటీ (ఎస్ఎంఏసీ) రెండు దఫాలుగా సమావేశమై, జి.ఓ అమలు విధి విధానాలపై విస్తృతంగా
చర్చించింది. అర్హులైన ప్రతి జర్నలిస్టుకు సమాన అవకాశాలు కల్పించేలా ప్రక్రియను క్రమబద్దంగా
కొనసాగిస్తున్నామని తెలిపారు.
ఇప్పటికే దరఖాస్తు చేసుకున్న జర్నలిస్టుల వివరాలను కమిటీ సమీక్షించి, ప్రభుత్వం
నిర్దేశించిన మార్గదర్శకాల ప్రకారం అర్హత ప్రమాణాలు పూర్తి చేసిన వారికి అక్రెడిటేషన్ కార్డులు
మంజూరు చేయనున్నట్లు వెల్లడించారు.
ఇంకా దరఖాస్తు చేసుకోని జర్నలిస్టులు తమ యాజమాన్య సిఫార్సు లేఖను జతచేస్తూ
ఆన్లైన్ దరఖాస్తును పూర్తి చేసి అప్లోడ్ చేయాలని సూచించారు. ఏప్రిల్ రెండో వారంలో కమిటీ
మరోసారి సమావేశమై అందిన దరఖాస్తులను పరిశీలించి, అర్హులైన వారందరికీ అక్రెడిటేషన్
కార్డులు మంజూరు చేసే ప్రక్రియ కొనసాగుతుందని తెలిపారు. ఇందుకోసం జర్నలిస్టులు ఏప్రిల్
6లోగా ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియను పూర్తి చేయాలని స్పష్టం చేశారు. అర్హులైన
జర్నలిస్టులందరూ నిర్ణీత గడువులోగా దరఖాస్తులను సమర్పించాలని కమిషనర్ కోరారు.
