ప్రజల సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యత – రేవంత్ రెడ్డి

ప్రజల సమస్యలను సత్వరమే పరిష్కరించేందుకు అవసరమైన చర్యలు తీసుకోవలసిందిగా ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. డా.బి.ఆర్.అంబెడ్కర్ తెలంగాణ సచివాలయానికి వచ్చే ప్రజలు తమ సమస్యలను విన్నవించుకోవడానికి మంత్రుల ఛాంబర్స్ లో నిర్దిష్టమైన సమయం,  ప్రత్యేక అనుమతులు కల్పించేందుకు అధ్యయనం చేయాల్సిందిగా సిఎం సూచించారు.

శుక్రవారం సచివాలయంలో ముఖ్యమంత్రి అధ్యక్షతన  ఉన్నతస్థాయి సమీక్షా సమావేశం జరిగింది.  ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, డిజిపి రవిగుప్తా, ఫైనాన్స్ కార్యదర్శి టి.కె.శ్రీదేవి, ఆరోగ్యశాఖ కార్యదర్శి రిజ్వీ, మెడికల్ రిక్రూట్ మెంట్ బోర్డు సెక్రటరీ గోపికాంత్, హైదరాబాద్ పోలీస్ కమిషనర్ కె.శ్రీనివాసరెడ్డి, పొలీస్  రిక్రూట్ మెంట్ సెక్రటరీ, వి.వి.శ్రీనివాసరావు, అడీషినల్ సిపి విక్రమ్ సింగ్ తదితరులు సమీక్షలో పాల్గొన్నారు.

పట్టణాల్లో, గ్రామాల్లో ప్రతినెల మొదటి వారంలో ఒకటి లేదా  రెండు రోజులు పాటు సభలు నిర్వహించి వారి సమస్యలను వెంటనే పరిష్కరించేందుకు కృషి చేస్తే వారు హైదరాబాద్ దాకా వచ్చే అవసరం తగ్గుతుందని  సీ ఎం అన్నారు.   ఇందుకు గాను ప్రతినెల రెండు  రోజుల పాటు పట్టణాలు, గ్రామల్లో సభలు నిర్వహించి, వారి సమస్యలు అక్కడే పరిష్కరించేందుకు అధికారులు తగు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ప్రజల సమస్యల పరిష్కారానికి అధికారులు చిత్తశుద్దితో కష్టపడాలని, సమస్యల పరిష్కారానికి సమయం నిర్దేశించుకుని పరిష్కరించాలని సూచించారు. ఇందువల్ల ప్రభుత్వానికి ప్రజలకు మధ్య మంచి సత్సంబంధాలు ఏర్పడతాయని, సుహృద్భావ వాతావరణంలో ప్రభుత్వం పనిచేసేందుకు అవకాశం వుంటుందని అన్నారు.

విజ్ఞప్తులు, ఫిర్యాదులను డిజిటలైజ్ చేయాలని, ఎప్పటికప్పుడు స్టేటస్ ను ప్రజలకు తెలియజేయాలని సిఎం చెప్పారు.

ప్రజావాణి:

ప్రజావాణికి  అద్భుతమైన స్పందన వస్తున్నందున అందుకు అనుగుణంగా పిర్యాదుల స్వీకరణకు టేబుల్స్ పెంచాలని, కనీస అవసరాలయిన మంచినీరు, ఇతర వసతులను ప్రజలకు కల్పించాలని సూచించారు. ప్రజావాణికి వచ్చే వారిని చాలా జాగ్రత్తగా రిసీవ్ చేసుకోవాలని, వారికి ఎటువంటి ఇబ్బందులు కలుగకుండా చుడాలని అన్నారు.   శిక్షణలో వున్న ఐఎఎస్ అధికారుల సేవలను కూడా వినియోగించుకోవాలని సిఎం సూచించారు.

print

By Online News Diary

ONLINENEWSDIARY.COM - A Multilingual Online News Portal

Leave a Reply

Your email address will not be published.